ఔషధాల పుదీనా మొక్కను ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు.. గుబురుగా పెరగాలంటే మాత్రం ఇలా చేయాల్సిందే
పుదీనా మొక్కను ఇంట్లో సులభంగా పెంచుకోవడానికి రెండు మార్గాలున్నాయి.. నీటిలో లేదా నేరుగా మట్టిలో పెంచుకోవచ్చు.. సరైన నేల, తగినంత సూర్యరశ్మి తగలాలి.. అలాగే.. చిగుర్లను కత్తిరించడం వల్ల మొక్క గుబురుగా పెరుగుతుంది. విటమిన్లు, ఖనిజాలతో కూడిన పుదీనా, ఆరోగ్య ప్రయోజనాలతో పాటు తెగుళ్ల నియంత్రణలోనూ సహాయపడుతుంది.

పుదీనాలో ఎన్నో పోషకాలతో పాటు.. ఔషధ గుణాలు పుష్కలంగా దాగున్నాయి. పుదీనాను అన్ని కాలాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది చట్నీల నుండి సలాడ్లు, పానీయాల వరకు ప్రతిదానికీ తాజాదనాన్ని జోడిస్తుంది.. ఇంకా ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో సహాయపడుతుంది. పుదీనాలో విటమిన్ A, C, B కాంప్లెక్స్, కాల్షియం, ఐరన్, పొటాషియం, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది తక్కువ కేలరీలు.. అధిక ఫైబర్ కలిగి ఉన్న అద్భుతమైన ఔషధం.. ఇది జీర్ణక్రియను సైతం మెరుగుపరుస్తుంది.. ఇంకా నోటి ఆరోగ్యాన్ని పెంచి.. శ్వాసను తాజాగా ఉంచుతుంది. ఇలాంటి పుదీనాను ఇంట్లో పెంచుకుని.. పుదీనా నీటిని, సలాడ్లలో ఉపయోగించవచ్చు.. ఇది వేసవిలో మరింత చల్లదనాన్ని ఇస్తుంది. వేసవి కాలంలో పుదీనా జ్యూస్ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. అందుకే.. ఈ మొక్కను దాదాపు అందరూ సులువుగా ఇళ్లల్లో పెంచుకోవచ్చు..
వాస్తవానికి పుదీనా, ఇంట్లో సులభంగా పెంచుకోవడానికి అనువైన ఒక బహుముఖ మొక్క. దీని పెంపకం, సంరక్షణ, ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..
పుదీనా మొక్కను ఇంట్లో పెంచుకోవడం చాలా సులభం.. దుకాణం నుండి తెచ్చిన ముదురు పుదీనా కొమ్మలను ఎంచుకోవడం వల్ల అవి త్వరగా వేర్లు తొడుగుతాయి. నీటిలో పెంచే పద్ధతిలో, కొమ్మలను నీటిలో ఉంచి, ప్రతి మూడు రోజులకు నీటిని మార్చాలి. ఒక వారం నుండి పది రోజులలో వేర్లు ఏర్పడిన తర్వాత, వాటిని మట్టిలోకి మార్చుకోవచ్చు. నేరుగా మట్టిలో నాటడానికి, వేర్లు ఉన్న కొమ్మలను ఎంచుకోవడం ఉత్తమం.. ఇవి సులువుగా పెరుగుతాయి..
పుదీనా మొక్కకు లోతు తక్కువ ఉన్న కంటైనర్లు సరైనవి.. ఎందుకంటే ఇది అడ్డంగా విస్తరిస్తుంది. బాగా ఎండిపోయే మట్టిని ఉపయోగించాలి.. ఇందులో 40% గార్డెన్ సాయిల్, 40% వర్మీకంపోస్ట్, 20% కోకోపీట్, కొద్దిగా నీమ్ పౌడర్ ఉండాలి. ఇది గార్డెన్ లో ఇతర మొక్కల చుట్టూ నాటినప్పుడు దాని సువాసనతో తెగుళ్లను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
మట్టిలో నాటేటప్పుడు, కనీసం రెండు అంగుళాల నుండి మూడు అంగుళాల లోతులో రెండు కణుపులు మట్టిలోకి వెళ్లేలా చూసుకోవాలి. ఇది వేగవంతమైన వేరు పెరుగుదలకు సహాయపడుతుంది.
పుదీనా మొక్క పూర్తి సూర్యరశ్మిలో బాగా పెరుగుతుంది. బాల్కనీలలో పెంచేవారు కనీసం 4 నుండి 5 గంటల ఎండ తగిలే ప్రదేశంలో ఉంచవచ్చు..
మొక్క గుబురుగా పెరగడానికి..
పుదీనా ఒక చాలా సులభంగా పెరగడంతోపాటు.. సంవత్సరమంతా దిగుబడిని ఇస్తుంది. మొక్క గుబురుగా పెరగడానికి, చిగుర్లు వచ్చిన తర్వాత వాటిని కత్తిరించాలి. ఇది కొత్త చిగుర్లు రావడానికి మొక్క నిండుగా పెరగడానికి తోడ్పడుతుంది. అలాగే, ఎండిపోయిన కొమ్మలను ఎప్పటికప్పుడు తీసివేయడం ముఖ్యం. పుదీనా నేలపై అల్లుకుపోయే స్వభావం కలది కాబట్టి, గాలి ప్రసరణ సరిగా లేకపోతే ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. అందుకే, మంచి గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
