Badvel By Election: బద్వేల్‌లో పోలింగ్ శాతం పెరగడానికి కారణం అదే.. సంచలన కామెంట్స్ చేసిన బీజేపీ నేత..
Badvel By Election: బద్వేల్ ఉప ఎన్నిక ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ల మాట తప్పిదాలకు నిదర్శనం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
Badvel By Election: బద్వేల్ ఉప ఎన్నిక ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ల మాట తప్పిదాలకు నిదర్శనం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. మాట, మడమ తిప్పని పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. ఆదివారం నాడు కడప జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు.. బద్వేల్ ఉపఎన్నికలో వైసీపీ వ్యవహరించిన తీరుపై విమర్శలు గుప్పించారు. శనివారం నాడు బద్వేల్‌లో జరిగిన పోలింగ్ సరళిని చూస్తే 55 శాతం కూడా ఓటింగ్ మించకూడదని, దొంగ ఓట్లు వేసుకున్నారు కాబట్టే ఓటింగ్ శాతం పెరిగిందని వీర్రాజు ఆరోపించారు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. ఆ కారణంగానే.. ఎక్కువ ఇన్‌చార్జ్‌లను పెట్టుకున్నారని అన్నారు. మండలాల వారీగా ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న వైసీపీ నాయకులు.. బీజేపీ ఏజెంట్లను ఎందుకు బెదిరించారని ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నికను తలపించారని దుయ్యబట్టారు.
బద్వేల్‌లో దొంగ ఓటర్లు బారులు తీరారని సోము వీర్రాజు ఆరోపించారు. సిద్దవటం, కడప, ప్రొద్దుటూరు నుంచి స్ధానికేతరులను ప్రత్యేక వాహనాల్లో తరలించారని అన్నారు. బద్వేలు ఉప ఎన్నికలో అడుగడుగునా దౌర్జన్యాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు ఏకపక్షంగా వ్యవహరించి, ప్రజాస్వా్మ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేశారని నిప్పులు చెరిగారు. బద్వేలులో 28 చోట్లలో రిపోలింగ్ జరిపించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. వైసీపీ లాగా దొంగ ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. దొంగ ఓట్లు వేయించుకునే వాళ్ళు బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కులేదని ఫైర్ అయ్యారు. బద్వేల్‌లో జరిగింది బై పోల్ కాదని, బస్ పోల్ అని ఎద్దేవా చేశారు.
వైసీపీ నేతలు బద్వేల్‌లో అడుగడుగునా దొంగ ఓట్లు వేయించుకున్నారని బీజేపీకి చెందిన మరో కీలక నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. ఆ దొంగ ఓట్ల కారణంగానే 53 శాతం జరుగాల్సిన పోలింగ్ 68 శాతానికి పెరిగిందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు బద్వేల్‌లోనే తిష్ట వేశారని అన్నారు. కడప డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి అట్లూరు కొనరాజుపల్లెలో తిష్ట వేశారని అన్నారు. పరిగపల్లెలో దొంగ ఓటర్లను బీజేపీ అభ్యర్థి పట్టుకున్నారని అన్నారు. అధికారులు చాలా మంది నియమ నిబంధనలను అతిక్రమించారని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. చీఫ్ విప్ ప్రవర్తన చాలా విడ్డురంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అరాచక పాలనకు చరమ గీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యానించారు.
Also read:
BalaKrishna: ఆహాలో బాలయ్య టాక్ షో.. మొదటి గెస్ట్ ఎవరో చెప్పిన మేకర్స్..
IND vs NZ: అతడిలాగానే బౌలింగ్ చేస్తా.. భారత బ్యాటర్లను కట్టడి చేస్తా.. ట్రెంట్ బౌల్ట్..
Huzurabad By Election: చివరికి ఇలా కూడా చేస్తారా?.. హుజూరాబాద్ పోలింగ్‌పై ఈటల షాకింగ్ కామెంట్స్..