Agriculture ATM: వ్యవసాయంలోనూ ఏటీఎం మోడల్.. రైతన్నలకు కాసులు కురిపిస్తోన్న నూతన విధానం
వ్యవసాయం ఖరీదైపోయింది. రైతులు ఆరుగాలం కష్టపడినా అందుకు తగిన ఆదాయం రావడం లేదు. దీంతో వ్యవసాయం చేసేందుకు రైతులు ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నాయి. అంతే కాకుండా చిన్న చిన్న కమతాల్లో పంటలు సాగు చేస్తున్న అన్నదాతలు మరింతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఒక వైపు, దళారులు మరొకవైపు కర్షకులను దోచుకుంటున్నారు. ఈక్రమంలోనే వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి..

గుంటూరు, అక్టోబర్ 30: వ్యవసాయం ఖరీదైపోయింది. రైతులు ఆరుగాలం కష్టపడినా అందుకు తగిన ఆదాయం రావడం లేదు. దీంతో వ్యవసాయం చేసేందుకు రైతులు ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నాయి. అంతే కాకుండా చిన్న చిన్న కమతాల్లో పంటలు సాగు చేస్తున్న అన్నదాతలు మరింతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఒక వైపు, దళారులు మరొకవైపు కర్షకులను దోచుకుంటున్నారు. ఈక్రమంలోనే వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగానే వ్యవసాయ శాఖాధికారులు ఏటీఎం మోడల్ సాగును తీసుకొచ్చారు. చిన్న కమతాలున్న రైతులు ఆకు కూరలు, కాయగూరలు సాగు చేసి మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చని చెబుతున్నారు. అయితే సాంప్రదాయ బద్దంగా సాగు చేస్తే మాత్రం నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఏటీఎం మోడల్ అంటే ఏనీ టైం మనీగా చెబుతున్నారు. ఈ విధానంలో దాదాపు ఇరవై రకాల ఆకుకూరలు, కూరగాయలను అతి తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. తద్వారా ప్రతి రోజు కొంత ఆదాయం రైతులకు వస్తుంది. చీడ పీడల బాధ కూడా తగ్గుతుందని చెబుతున్నారు.
అది కూడా ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తే మరింతగా ఆదాయం ఉంటుందంటున్నారు. కొల్లిపర మండలం హనుమాన్ పాలెంలో శ్యాంబాబు ఏటిఎం మోడల్లో సాగు చేస్తున్నారు. మోడల్ క్షేత్రాన్ని ప్రక్రుతి వ్యవసాయం ప్రాజెక్ట్ మేనేజర్ రాజకుమారి రైతులతో కలిసి పరిశీలించారు. పదిహేను సెంట్ల స్థలంలోనే వివిధ రకాల ఆకు కూరలు, బీట్ రూట్, క్యారెట్, ముల్లంగి, స్వీట్ కార్న్, చెట్టు చిక్కుడు, గోరు చిక్కుడు, బెండ, పొద్దు తిరుగుడు, కాకర, బీర వంటి వాటిని సాగు చేస్తున్నారు.
తద్వారా ప్రతి రోజూ రైతుకు ఎంతో కొంత ఆదాయం వస్తుందన్నారు. ఏటీఎం మోడల్లో ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా రసాయనాల్లేని ఆహారాన్ని అందించడం కూడా జరుగుతుందని రాజకుమారి తెలిపారు. డెల్టా ప్రాంతంలోని రైతులు ఈ ఏటీఎం మోడల్‌పై మక్కువ చూపుతున్నారన్నారు. రైతులకు కావాల్సిన సూచనలు, సలహాలు అందిస్తామని తెలిపారు. ఇటువంటి వ్యవసాయ విధానంతో రైతులకు మేలు జరుగుతుందన్నారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.