AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరువు సీమలో కాసుల పంట.. ఏడాదికి రూ.2 కోట్ల ఆదాయం.. ఆనందంలో రైతన్నలు

డబ్బులు చెట్లకు కాస్తున్నాయా అనే సామెతను నిజం చేశాడు ఓ రైతు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావడంలేదని ఎంతో మంది రైతులు నష్టపోతుంటే.. ఓ రైతు 15 ఎకరాల్లో దానిమ్మ పండించి ఏకంగా రెండు కోట్ల రూపాయలు సంపాదించాడు. రాయలసీమలో కరువు జిల్లాగా పిలవబడే అనంతపురం జిల్లాలో దానిమ్మ రైతు కోట్లు సంపాదించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ గా పిలవబడే అనంతపురం జిల్లాలో ప్రస్తుతం దానిమ్మ పంట సిరులు కురిపిస్తోంది.

కరువు సీమలో కాసుల పంట.. ఏడాదికి రూ.2 కోట్ల ఆదాయం.. ఆనందంలో రైతన్నలు
Anantapur Pomegranate Farmer
Nalluri Naresh
| Edited By: |

Updated on: Jan 10, 2026 | 1:56 PM

Share

అనంతపురం జిల్లాలో కొద్దిరోజుల క్రితం అరటిపంట టన్ను వెయ్యి రూపాయలకు కూడా కొనడం లేదని.. అరటి రైతులు తమ పొలాల్లో పండిన అరటి గెలలను రోడ్డు పక్కన పారబోసి. అరటి చెట్లను తొలగించిన దృశ్యాలు అరటి రైతుల దయనీయస్థితిని తెలియజేసింది. కానీ అదే అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామినేపల్లి గ్రామానికి చెందిన రైతు కృష్ణారెడ్డికి దానిమ్మ పంట ఈ ఏడాది కోట్లు కురిపించింది. 15 ఎకరాల్లో దానిమ్మ పంట వేస్తే ఏకంగా రెండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇది స్థానిక రైతులందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మార్కెట్లో దానిమ్మకు గిట్టుబాటు ధర ఆశాజనకంగా ఉండడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇటు దిగుబడి, అటు ధర రెండు పెరగడంతో రైతులు మొహాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది

దానిమ్మ రైతులకు మంచి రోజులు

అనంతపురం దానిమ్మ రైతులకు మంచి రోజులు వచ్చాయి. ఇంతకాలం భారీగా పెట్టుబడులు పెట్టి పంటలు పండించినా సరైన ధరలు లేక ఇబ్బందులు పడుతూ వచ్చిన రైతులకు ఇటీవల పెరుగుతున్న ధరలు ఆసరనిచ్చాయి. మూడు నెలల క్రితం టన్ను ధర రూ.50వేల నుంచి రూ. 60వేల వరకు ఉంటే.. ప్రస్తుతం టన్ను దానిమ్మ ధర 2 లక్షల రూపాయల వరకు పలుకుతోంది. అంటే కిలో సుమారు 200 రూపాయల వరకు పలుకుతోంది. దీంతో గతంలో పెట్టుబడులకు చేసిన అప్పులను తీర్చుకోవచ్చని రైతులు ఆశిస్తున్నారు. అయితే పోయిన ఏడాది రామునేపల్లికి చెందిన రైతు కృష్ణారెడ్డి కుటుంబం ఇదే దానిమ్మ పంటలో కోటి రూపాయలు అర్జిస్తే.. ఈ ఏడాది ఏకంగా రెండు కోట్ల వచ్చాయి.

పెరిగిన సాగు

దీంతో గత ఏడాది కంటే ఈ సారి దానిమ్మ సాగు విస్తీర్ణం పెరిగింది. గత ఏడాది 13 వేల ఎకరాల్లో దానిమ్మ సాగు ఉండగా ఈ ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15,381 ఎకరాలకు చేరింది. అనంతపురం నేల దానిమ్మ సాగుకు అనువైనది కావటంతో సాగు విస్తీర్ణం పెరిగిందని. తక్కువ నీరు, ఎర్ర మట్టి నేల అధికంగా ఉండటంతో దానిమ్మ సాగుకు అనుకూలంగా మారాయని రైతులు చెబుతున్నారు. అలాగే పంటను తెగుళ్ళను, బ్యాక్టీరియా బారిన పడకుండా జాగ్రత్తగా సాగు చేయడం వల్లే కోట్లు సంపాదించామంటున్నారు రైతులు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.