Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అమరావతి రైతుల మహా పాదయాత్రకు బ్రేక్.. హైకోర్టులో తేల్చుకుంటామన్న రైతులు..

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పోలీసులు విధిస్తున్న ఆంక్షలపై విసుగు చెందిన..

Andhra Pradesh: అమరావతి రైతుల మహా పాదయాత్రకు బ్రేక్.. హైకోర్టులో తేల్చుకుంటామన్న రైతులు..
Amaravati Farmers Padayatra (File Photo)
Follow us
Amarnadh Daneti

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 22, 2022 | 3:03 PM

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పోలీసులు విధిస్తున్న ఆంక్షలపై విసుగు చెందిన రైతులు.. తాము హైకోర్టులోనే తేల్చుకుంటామని, అప్పటివరకు ఓ నాలుగు రోజులు తాత్కాలికంగా మహాపాదయాత్రకు విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రస్తుతం పాదయాత్ర కొనసాగుతుండగా.. రామచంద్రపురం లో అమరావతి రైతుల పాదయాత్ర నిలిచిపోయింది . రామచంద్రపురం నుంచి బయలుదేరుతున్న అమరావతి రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఐడీ కార్డులు ఉన్నవారు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు, పోలీసుల ఆంక్షలు తొలగించే వరకు పాదయాత్ర చేయకూడదని నిర్ణయించారు. దీంతో వారు రామచంద్రపురం లోనే పాదయాత్ర నిలిపివేశారు హైకోర్టు నుంచి స్పష్టమైన నిర్ణయం వచ్చాకే పాదయాత్ర చేపడతామన్నారు అమరావతి మహాపాదయాత్ర జేఏసీ నాయకులు. కోర్టు నిర్ణయం ఆధారంగా పాదయాత్ర మొదలు పెడతామని ప్రస్తుతం విరామం ప్రకటిస్తున్నామన్నారు. పోలీసులు ఆంక్షలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరోసారి హైకోర్టుకు వెళ్తామని అమరావతి రైతు జేఏసీ నేత తిరుపతిరావు తెలిపారు.

పోలీసుల తీరుకు నిరసనగా మహాపాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రైతు నాయకులు  ప్రకటించారు. కోర్టుకు సెలవులు ఉన్నందున పాదయాత్రకు నాలుగు రోజులు తాత్కాలిక విరామమేనని పేర్కొన్నారు. పాదయాత్ర 41వ రోజు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామంచంద్రాపురం బైపాస్‌ రోడ్డు నుంచి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే రైతులు బస చేస్తున్న ఫంక్షన్‌ హాల్‌ వద్దకు ఈ ఉదయం పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారని, రైతులను కలిసి మద్దతు తెలిపేందుకు బయటనుంచి వచ్చే వారిని సైతం అనుమతించలేదని, సంఘీభావం తెలిపేందుకు వస్తున్నవారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా పాదయాత్రలో పాల్గొనే 600 మంది గుర్తింపు కార్డులు చూపించాలని, అనుమతి ఉన్న వాహనాలు కాకుండా మిగతావి అంగీకరించబోమని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో రైతులు, పోలీసులకు స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇవి కూడా చదవండి

అమరావతి రైతుల మహా పాదయాత్రపై స్పందించిన చంద్రబాబు

రైతుల మహా పాదయాత్రపై వైసీపీ కుట్రలు, కుతంత్రాలు సాగబోవని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజు అయిన అక్టోబర్ 22వ తేదీన ఉద్ధండరాయునిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిందని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. కనీసం వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించామని.. అయితే ప్రస్తుత పాలకుల ఆలోచనల కారణంగా ప్రజల ఆకాంక్షలు నాశనం అయ్యే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతి అంటే 28వేల మంది రైతుల త్యాగమని, కోట్ల మంది సంకల్పమని అన్నారు.

ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రులు అమరావతిని తమకు గర్వకారణంగా భావించారన్నారు. ఎన్నికల ముందు దీన్ని స్వాగతించిన వ్యక్తి.. అధికారంలోకి రాగానే మాట మార్చి మోసం చేశారని సీఏం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎప్పటికీ అమరావతేనని, అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటుందని తెలిపారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరుతుందన్నారు. సత్యం, న్యాయం, త్యాగం, సంకల్పం ఉన్న అమరావతే నిలుస్తుందని, అమరావతే గెలుస్తుందని చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Pm Modi, Chandrababu Naidu

Pm Modi, Chandrababu Naidu

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..