Amaravati: అమరావతే ఏకైక రాజధాని.. తీర్మానం చేసిన సీపీఐ.. మాట మార్చారని పైర్..

అమరావతినే ఏకైక రాజధానిగా చేస్తూ తీసుకువచ్చిన తీర్మానాన్ని సీపీఐ జాతీయ మహాసభల్లో ప్రవేశపెట్టారు. మూడు రాజధానులపై ప్రభుత్వం కృత్రిమ ఉద్యమం సృష్టించి, విశాఖ రాజధాని పేరుతో భూములు కొల్లగొడుతుందంటూ..

Amaravati: అమరావతే ఏకైక రాజధాని.. తీర్మానం చేసిన సీపీఐ.. మాట మార్చారని పైర్..
Cpi Narayana
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 17, 2022 | 10:33 AM

అమరావతినే ఏకైక రాజధానిగా చేస్తూ తీసుకువచ్చిన తీర్మానాన్ని సీపీఐ జాతీయ మహాసభల్లో ప్రవేశపెట్టారు. మూడు రాజధానులపై ప్రభుత్వం కృత్రిమ ఉద్యమం సృష్టించి, విశాఖ రాజధాని పేరుతో భూములు కొల్లగొడుతుందంటూ జాతీయ కార్యదర్శి నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయవాడలో సీపీఐ 24వ జాతీయ మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ సభలకు సీపీఐ అగ్రనేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు అమరావతి ఒక్కటే రాజధాని అని సీపీఐ మహాసభల్లో తీర్మానం చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అమరావతి ఏకైక రాజధాని అంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, జాతీయ మహాసభల్లో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అమరావతి రాజధానిపై ప్రధాన ప్రతిపక్షంగా అమోదం తెలిపిన జగన్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చారంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయి ఇన్నేళ్లు అవుతున్నా రాజధాని ఏదో చెప్పుకోలేని దౌర్భగ్య స్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో భూ స్కామ్‌లపై సీబీఐ విచారణ జరిపించాలని నారాయణ డిమాండ్ చేశారు. అమరావతి రైతుల ఉద్యమానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్టచర్యలను ఉపసంహరించుకోవాలని సీపీఐ నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ సానుకూలంగా స్పందించి సత్వరమే నిర్మాణ పనులు కొనసాగించాలని సూచించారు.

మరోవైపు.. ఇప్పటికే 35 రోజులుగా సాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర – 2 సోమవారానికి రాజమండ్రిలోకి అడుగుపెట్టనుంది. రైల్‌కమ్‌ రోడ్‌ బ్రిడ్జిపై యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో టెన్షన్‌ నెలకొంది. అయితే.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పాదయాత్ర చేసి తీరుతామని రైతులు చెబుతున్నారు. సాధారణంగా ధర్నాలైనా, నిరసనలైనా తమ బలాన్ని నిరూపించుకునేందుకు పార్టీలు రాజమండ్రి రైల్‌ కమ్‌ రోడ్‌ బ్రిడ్జిని ఎంచుకుంటాయి. దాన్ని సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. అమరావతి రైతులు కూడా తమ బలాన్ని చూపాలని ప్లాన్‌ చేశారు. కానీ వారి వ్యూహాలకు పోలీసులు అడ్డుకున్నారు. రాజమండ్రి రోడ్‌ కమ్‌ రైల్‌ బ్రిడ్జి పై యాత్రకు అనుమతి నిరాకరించారు.

కాగా.. మహా పాద యాత్ర మార్గం మార్పు తో సోమవారం జరిగే యాత్రపై ఉత్కంఠ నెలకొంది. రాజమండ్రి రోడ్‌ కం రైలు వంతెనపై రాకపోకలను నిషేధించడంతో సోమవారం యాత్ర గామన్‌ వంతెన మీదుగా సాగనుంది. కొవ్వూరు బస్టాండు కూడలిలో వైసీపీ సభ ఉంది. దీంతో బందోబస్తు అంశంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం  క్లిక్ చేయండి..