Kakinada: వరద నీటిలో మునిగిన కలెక్టరేట్.. ఇళ్లల్లోకి చేరిన నీరు.. గోతుల్లో కాగితపు పడవలతో నిరసనలు..
చిన్నపాటి వర్షానికే కాకినాడ స్మార్ట్ సిటీ ముంపునకు గురైంది. ఎక్కడ చూసినా మోకాలు లోతు నీళ్లతో నగరంలోని పలు ప్రదేశాలు దర్శనమిస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలను వరదనీరు..
చిన్నపాటి వర్షానికే కాకినాడ స్మార్ట్ సిటీ ముంపునకు గురైంది. ఎక్కడ చూసినా మోకాలు లోతు నీళ్లతో నగరంలోని పలు ప్రదేశాలు దర్శనమిస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. కాకినాడ టౌన్ లోని పలు కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఎక్కడికి అక్కడ డ్రెయిన్లు నిండి, నడి రోడ్డుపై పొంగి పొర్లుతున్నాయి. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం, స్కూళ్లు మోకాలు లోతు వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. కలెక్టరేట్ కార్యాలయమే వరద నీటిలో మునిగితే.. ఇక మన బాధలు ఎవరికి చెప్పుకోవాలి అంటూ సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్యంగా నగరంలోని మెయిన్ రోడ్డు, సినిమా రోడ్, ఆర్టీసి కాంప్లెక్స్, విద్యాలయాలు, గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలు వరద ముంపునకు గురవుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు ఎత్తుగా ఉండడంతో వరద నీరు ఇళ్లలోకి చేరుతుంది. ఇక చేసేందేమీ లేక మురికి వాటర్ లోనే ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు. నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ మరీ అధ్వాన్నంగా తయరైందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.
కాకినాడతో పాటు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రోడ్ల పరిస్థితి దారుణంగా మారింది. దీనిపై టీడీపీ వినూత్నంగా నిరసన చేపట్టింది. వేమగిరి- కాకినాడ కెనాల్ రోడ్డు అధ్వాన్న స్థితికి ఎమ్మెల్యే గోతులు పథకం అంటూ నామకరణం చేశారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రోడ్లపై గోతుల్లో కాగితపు పడవలతో నిరసన చేపట్టారు. నాసిరకం పనుల వల్ల మూడు నెలలు కాకముందే రోడ్లు యథాస్థితికి చేరాయని నల్లమల్లి ఆరోపించారు.
కాగా.. రెండు రోజుల వ్యవధిలో కాకినాడ నగరంలో ఏకంగా 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇళ్లల్లోకి నీరు చేరడంతో ఆహారం కూడా తయారు చేసుకోలేని పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే వీరికి సహాయక చర్యలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో ఉండే అధికారులు మాత్రం.. సహాయక చర్యలు చేపట్టినా ఏమాత్రం ముంపును నివారించే పరిస్థితుల్లో లేవు. ఇప్పటికైనా సహాయక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నగరంలో 169 ప్రాంతాల్లో ముంపు సమస్య గుర్తించినా నివారణ చర్యలు లేవు. ఇప్పటికైనా ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం చూపకపోతే మరింత ముప్పు తప్పదు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..