Cover Mystery: తిరుపతి తొక్కిసలాటలో కొత్త ట్విస్ట్.. పద్మావతి ఆస్పత్రిలో ఏం జరిగింది.. తెల్ల కవర్లో ఏముంది?

ఈమధ్య కాలంలో తిరుమల తరచూ వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. ఒక దాని తర్వాత ఒకటిగా వస్తున్న సమస్యలతో తిరుమల తిరుపతి దేవస్థానం సతమతం అవుతోంది. కొండంత వివాదాలు, విచారణలు.. టీటీడీకి కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా తొక్కిసలాట ఘటన రాజకీయ దుమారం రాజుకుంది.

Cover Mystery: తిరుపతి తొక్కిసలాటలో కొత్త ట్విస్ట్.. పద్మావతి ఆస్పత్రిలో ఏం జరిగింది.. తెల్ల కవర్లో ఏముంది?
Tirupati Devotees Stampede
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 11, 2025 | 8:01 PM

తిరుపతి ట్రాజెడీలో కొత్త మలుపు. వైట్ కవర్ కహానీ. ఔను.. ఆ తెల్ల కవర్లో ఏముంది అనేది కాదు.. ఎంతుంది.. అనేదే మిస్టరీ.. అని తెలుగు దేశం పార్టీ అంటుంటే.. అసలా కవర్ స్టోరీయే పెద్ద బోగస్ అని వైసీపీ కొట్టిపారేస్తోంది. ఆస్పత్రిలో పరామర్శల పరంపరలో తొంగిచూసిన చిన్న సైజు అవినీతి కుంభకోణం ఇది. అంతుబట్టని ఆ కవరేజ్‌ కథేంటో తెలుసుకుందాం..!

తిరుపతి తొక్కిసలాట ఘటన పర్యవసానాలు పొలిటికల్ టర్న్ తీసుకుని.. రకరకాల ఆరోపణలకు దారితీస్తున్నాయి. ఇందులో మోస్ట్ మిస్టీరియస్ టాపిక్ ఏంటంటే.. పేషెంట్లకు తెల్లకవర్ల పంపిణీ. గాయపడ్డవారిని పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ నాయకులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటూ పేషెంట్లకు డబ్బులిచ్చారనే ఆరోపణలు ఆసక్తికరంగా మారింది. ఇదేదో అషామాషి నాయకులు కామెంట్ చేయలేదు. స్వయాన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ఈ ఆరోపణలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

తొక్కిసలాటలో గాయపడ్డ 48 మందిని చికిత్స కోసం రుయా, స్విమ్స్‌ ఆసుపత్రులకు తరలించారు. పరామర్శించడానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చే ముందు వైసీపీకి చెందిన ఒక ప్రముఖుడు.. ఆస్పత్రిలో అనుమానాస్పదంగా కనిపించారని, గాయపడ్డ వారిని పరామర్శించేందుకు తెల్ల కవర్లు పంచడం సీసీ కెమెరాల్లో రికార్డయిందని స్వయానా మంత్రి ఆనం మీడియాతో చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించే ప్రయత్నంలో భాగంగా డబ్బులు పంచినట్టు.. ఆస్పత్రిలో నర్సులు, మిగతా ఉద్యోగులే చెప్పారన్నది ఆనం ఆరోపణ.

వెంటనే తేరుకున్న వైసీపీ.. ఆనంకు కౌంటర్లు సంధించింది. తప్పుడు ఆరోపణలు చేయడం కాదు.. దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ బైటపెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే పదవి నుంచి తప్పుకోవాలని ఛాలెంజ్ విసిరారు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్. ఆనం.. హుందాగా రాజకీయాలు చేసే సీనియర్ నాయకుడని, అవాకులు చవాకులు పేలే రకం కాదని, ఇప్పుడు కూడా పక్కా ఆధారాలతోనే వైసీపీ కవర్ల కహానీ బైటపెట్టారని టీడీపీ నేతలు అంటున్నారు. కానీ.. ఆనం చెబుతున్న కవర్ స్టోరీ కూడా డైవర్షన్‌ టాక్టీస్‌లో భాగమేనంటోంది వైసీపీ.

పరామర్శకు తాను వస్తున్నట్టు తెలుసుకుని.. ఆస్పత్రి నుంచి పేషెంట్లను తరలించే ప్రయత్నం జరిగిందని, సొంతూళ్లకు పంపడానికి వాహనాలు కూడా సిద్ధం చేశారని వైసీపీ నుంచి రివర్స్ ఎటాక్ కూడా షురూ ఐంది. ట్రాక్టర్లు అడ్డుపెట్టి ట్రాఫిక్ సమస్యను సృష్టించడం.. పవన్‌కల్యాణ్ ఉద్దేశపూర్వకంగా రెండుగంటల పాటు ఆస్పత్రిలో ఉండడం.. ఇవన్నీ జగన్ తిరుపతి టూర్‌ని అడ్డుకోవడానికి పాల్పడ్డ కుట్రలు కాదా అని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. ఇప్పుడు మనీ కవర్లపై భూమన విసిరిన ఛాలెంజ్‌ను ఆనం స్వీకరిస్తారా.. సీసీ టీవీ ఫుటేజ్ బైటపెడతారా.. చూడాలి మరి..!

వీడియో చూడండి.. 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..