Makar Sankranti 2025: ఊరు పిలుస్తోంది..! తెలుగు పల్లెలకు సంక్రాంతి శోభ.. దారులన్నీ అటువైపే

సంక్రాంతికొస్తున్నాం. సిన్మాకాదు రియాలిటీ. లక్షలమంది ఒక్కసారి సొంతూరి బాట పడితే ఎలా ఉంటుంది. నేషనల్‌ హైవే కూడా కచ్చారోడ్డులా మారిపోయింది. గమ్యం దిశగా ప్రయాణం సాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి ఫీవర్. సంక్రాంతికి సొంతూళ్ల బాట పట్టిన జనం.. నిన్న సాయంత్రం నుంచే రద్దీగా మారిన రోడ్లు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పెరిగిన రద్దీ. శని, ఆది వారాలు కలిసి రావడంతో మూడు రోజులు ముందుగానే ఊరిబాట పట్టిన జనం..

Makar Sankranti 2025: ఊరు పిలుస్తోంది..! తెలుగు పల్లెలకు సంక్రాంతి శోభ.. దారులన్నీ అటువైపే
Sankranthi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 11, 2025 | 9:41 PM

సంక్రాంతి అంటేనే సందడి. సొంతూరికెళ్తేనే పెద్ద పండుగ మజా. అందుకే చలోచలో అంటూ సొంతూళ్లకు పయనమయ్యారు లక్షలమంది. బంధుమిత్రులతో సంక్రాంతిని ఎంజాయ్‌ చేసేందుకు కుటుంబాలతో బయలుదేరారు. బస్సులు కిటకిటలాడుతున్నాయి. రైలు బోగీల్లో కాలుపెట్టేందుకు కూడా స్థలం దొరకడం లేదు. చాలామంది సొంత వాహనాల్లో సొంతూళ్లకు బయలుదేరడంతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి.

వేల వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కటంతో హైదరాబాద్​-విజయవాడ నేషనల్‌ హైవే సహా ముఖ్య రహదారులపై ట్రాఫిక్‌ స్లోగా కదులుతోంది. శుక్రవారం రాత్రినుంచే వాహనాల రద్దీ పెరగటంతో పంతంగి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్‌ని కంట్రోల్‌ చేస్తున్నారు పోలీసులు. వాహనాల రద్దీతో విజయవాడ వైపు 10 టోల్‌బూత్‌లు తెరిచారు. సాధారణ రోజుల్లో 35వేల నుంచి 45వేల వాహనాలు వెళ్తాయని, సంక్రాంతి పండుగ సందర్భంగా వాటి సంఖ్య పెరిగిందని చెబుతున్నారు.

ఒకవైపు సంక్రాంతి పండగ.. మరోవైపు శని, ఆదివారాలు కలిసిరావడంతో లక్షల మంది సొంతూళ్లకు క్యూకట్టారు. హైదరాబాద్‌-విజయవాడ హైవే హెవీ ట్రాఫిక్‌తో నిండిపోయింది. జిల్లాలకు వెళ్లే రహదారుల పరిస్థితి కూడా అలాగే ఉంది. రహదారులే కాదు.. సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లతో పాటు ఎంజీబీఎస్‌, జూబ్లీ బస్‌స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాదే కాదు.. విజయవాడలోనూ ఇదే పరిస్థితి. విజయవాడకు చేరుకున్నాక అక్కడినుంచి తమ ప్రాంతాలకు తరలిపోతున్నారు సంక్రాంతి ప్రయాణికులు.

హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ 2 వేల 153 బస్సులు నడుపుతోంది. బెంగళూరు నుంచి 375, చెన్నై నుంచి 42, విజయవాడ నుంచి 300, వైజాగ్ నుంచి 250, రాజమహేంద్రవరం నుంచి 230, తిరుపతి నుంచి 50, ఇతర నగరాలు, పట్టణాల నుంచి 500 సర్వీసులు నడుపుతున్నారు. తిరుగు ప్రయాణానికి 3300 బస్సులు నడపనున్నారు. మొత్తంగా ఏపీఎస్‌ఆర్‌టీసీ 7,200 సర్వీసులు నడుపుతోంది.

ఎంత ఖర్చయినా, ఎన్ని ఇబ్బందులున్నా సంక్రాంతికి సొంతూరికి చేరాల్సిందే. సంక్రాంతి రష్‌ని ఫుల్‌గా క్యాష్‌ చేసుకుంటున్నాయి ప్రైవేట్‌ ట్రావెల్స్‌. సాధారణ రోజులకంటే టికెట్ల రేట్లు డబుల్‌ చేశారు. నాన్‌ ఏసీ టిక్కెట్లను కూడా ఏసీ రేట్లకు అమ్ముతున్నారు. ఆర్టీసీ హౌస్‌ఫుల్‌ కావటం కూడా ప్రైవేటు ట్రావెల్స్‌కి వరంగా మారింది. వెయ్యిలోపే ఖర్చయ్యే చోట 1500 నుంచి 2500దాకా పెట్టాల్సి వస్తోంది. రాజమండ్రికి 1500లోపుండే స్లీపర్‌ టికెట్‌ని సంక్రాంతికి బాదుడే బాదుడంటూ 4వేల రూపాయలకు పెంచేశారు. వైజాగ్‌కి ఆర్టీసీ టికెట్‌ రేటు 2వేల లోపే ఉంటే.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ 3వేల నుంచి 5500 దాకా వసూలు చేస్తున్నాయి.

ఇక రైల్వేస్టేషన్లయితే ఇసుకేస్తే రాలనంత రద్దీగా కనిపిస్తున్నాయి. రైల్వేశాఖ స్పెషల్‌ రైళ్లు నడుపుతున్నా స్టేషన్లలో జనం తగ్గడం లేదు. ఇప్పటికే రైల్వే అధికారులు 58 స్పెషల్స్‌ నడుపుతున్నారు. దీంతో సాధారణ రైళ్లతో పాటు స్పెషల్స్‌ కూడా రద్దీగా ఉంటున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య రాకపోకలు భారీగా సాగుతున్నాయి.

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు జనవరి 11 నుంచి 17దాకా సంక్రాంతి సెలవులు ప్రకటించాయి. సోమవారం భోగి కావడంతో శని, ఆదివారాల్లో రోడ్లపై రద్దీ ఇదే రేంజ్‌లో ఉండబోతోంది. పోయినేడాది పంతంగి టోల్ ప్లాజా మీదుగా రెండ్రోజుల్లోనే రికార్డుస్థాయిలో లక్షా 45వేల వాహనాలు వెళ్లాయి. ఈసారి సంక్రాంతి ప్రయాణాలు చూస్తుంటే ఆ రికార్డ్‌ బ్రేకయ్యేలా ఉంది.

ఫిల్మ్ సిటీ నుంచి విజయవాడ దుర్గగుడికి మామూలురోజుల్లో మూడున్నర నాలుగుగంటల్లోపే చేరిపోతారు. 100 నుంచి 120 స్పీడ్‌కి ఎవరూ తగ్గరు. కానీ ఇప్పుడా రూట్లో బ్రేక్‌ మీద బ్రేక్‌ వేయాల్సి వస్తోంది. యావరేజ్‌ గంటకు 40 కిలోమీటర్లకు మించి ముందుకెళ్లడం లేదు వాహనాలు. దీంతో విజయవాడ చేరడానికి ఆరేడు గంటల సమయం పడుతుంది.

విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఖమ్మం వెళ్లేవారికి నేషనల్‌ హైవే ఒక్కటే మార్గమా అంటే అల్టర్‌నేటివ్‌ రూట్స్‌ ఉన్నాయంటున్నారు పోలీసులు. గుంటూరు, నెల్లూరు వెళ్లేవారికి నాగార్జునసాగర్‌ మీదుగా ప్రత్యామ్నాయం ఉంది. విజయవాడ, ఖమ్మం వెళ్లేవారికి భువనగిరి, రామన్నపేట మీదుగా మరో ఆప్షన్‌ ఉందంటున్నారు. గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులకు కొంత దూరం పెరిగినా.. హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ హైవేపై ప్రయాణం సాఫీగా సాగుతుందంటున్నారు పోలీసులు.

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ రోడ్‌ అందుబాటులోకి రావడం సంక్రాంతి ప్రయాణాలకు కలిసొచ్చింది. ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్టణం వైపు వెళ్లేవారికి ఈ బైపాస్‌తో టైమ్‌ ఆదా కానుంది. విజయవాడలోకి వెళ్లకుండానే నగరాన్ని దాటేలా ఈ బైపాస్‌ నిర్మించారు. రద్దీ టైమ్‌లో విజయవాడ నగరం మీదుగా వెళ్తే రెండుమూడు గంటల సమయం పడుతుంటుంది. అదే ఈ బైపాస్‌తో గంటలోపే విజయవాడ నగరాన్ని దాటేయొచ్చు. గొల్లపూడి నుంచి చిన్నఅవుటపల్లి వరకు ఆరు లైన్లతో నిర్మించిన 30 కిలోమీటర్ల బైపాస్‌లోకి వాహనాలను అనుమతిస్తున్నారు.

విజయవాడ బస్‌స్టాండ్‌, రైల్వేస్టేషన్‌ ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నుంచి విజయవాడకు వాహనాల రాకపోకలు బాగా పెరిగాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బస్సులన్నీ ఫుల్లయి వస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వచ్చే వారి సంఖ్య ఎంత ఉందో, విజయవాడ-విశాఖపట్నం మధ్య కూడా అదే రద్దీ కొనసాగుతోంది. రాయలసీమ జిల్లాలతో పాటు తిరుపతి, కాకినాడకు రాకపోకలు ఎక్కువగా జరుగుతున్నాయి.

ఏపీలో మరో ప్రధాన నగరం విశాఖపట్టణం సంక్రాంతి రద్దీతో కిటకిటలాడుతోంది. ఉపాధి కోసం పట్టణాల్లో ఉన్న వారంతా సొంతూరికి ప్రయాణం కావటంతో విశాఖ బస్‌స్టాండ్‌ రద్దీగా మారింది. భోగి రోజు రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో రెండ్రోజుల ముందే సొంతూళ్లకు ప్రయాణమయ్యారు ప్రజలు.

కష్టమైనా ఖర్చులైనా సంక్రాంతికి సొంతూళ్లో ఉంటే ఆ ఆనందమే వేరు. ఏడాది పొడవునా ఎన్ని పండుగలొచ్చిపోయినా సంక్రాంతి వచ్చిందంటే అయినవాళ్లంతా ఓ చోట చేరాల్సిందే. అందుకే సంక్రాంతికొస్తున్నాం అంటూ పిల్లాపాపలతో సొంతూళ్లకు బయలుదేరారంతా.

సంక్రాంతి అంటే సందడి. అదో ఒరవడి. ఎంతదూరంలో ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్రాంతికి సొంతూరికి చేరుకుంటే ఆ ఆనందమే వేరు. భోగి మంటలు, గాలిపటాలు, కోళ్లపందేలు, గంగిరెద్దులు, రంగురంగుల ముగ్గులు. ఒకరోజు కాదు సంక్రాంతి వచ్చిందంటే ఊళ్లో ఉన్నన్నాళ్లూ ప్రతిరోజూ సంబరమే.

సంక్రాంతి వచ్చిందంటే పల్లె పిలుస్తుంది. నగరం ఖాళీ అవుతుంది. తెలుగు ప్రజల సంస్కృతీ సంప్రదాయాల్లో.. సంక్రాంతిది విశిష్ట స్థానం. అందరినీ ఒక్కటి చేసే అతి పెద్ద సంబరం. ఎక్కడెక్కడో ఉన్నోళ్లందరినీ ఊళ్లకు తీసుకెళ్లి మూలాల్ని గుర్తుచేసే మహా ఉత్సవం.

ఉద్యోగవ్యాపారాల్లో తలమునకలై ఉన్నా, ఎక్కడో సుదూరాన ఉన్నా సంక్రాంతి వచ్చిందంటే అంతా ఓచోటికి చేరతారు. సొంత ఊళ్లో సంబరాల్లో మునిగి తేలతారు. పిల్లాపాపల రాకతో పెద్దలు కూడా పిల్లలైపోతారు. కనుమరుగవుతున్న ఉమ్మడి కుటుంబాల స్ఫూర్తిని మూడు నాలుగు రోజులపాటు మళ్లీ ఆవిష్కరించే అతి గొప్ప పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ.. మూడు రోజుల ముచ్చటైన వైభోగం పల్లె లోగిళ్లలోనే కనిపిస్తుంది. ఆ ప్రేమాభిమానాలు, ఆప్యాయతల కోసమే సంక్రాంతి వచ్చిదంటే లక్షల కుటుంబాలు ఊరొస్తున్నాం అంటూ బయలుదేరతాయి. సొంతూరు పొలిమేరకు చేరగానే పులకరించిపోతాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే సంక్రాంతి భావోద్వేగ పండుగ. మళ్లీ ఏడాదిదాకా ఆ జ్ఞాపకాలను పదిలంగా దాచుకునేలా చేసే పండుగ. ముంగిళ్లలో ముత్యాల ముగ్గులు పరుచుకుంటాయి. డూడూ బవసన్నల సవ్వళ్లు, హరిదాసుల కీర్తనలు వినిపిస్తాయి. ఆటాపాటా, పందేలు ఒక్కటేంటి ప్రతీ ఊరూ ఓ జాతరే. అందుకే సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు ఇన్నేసి ఏర్పాట్లు. ప్రత్యేక బస్సులు, స్పెషల్‌ రైళ్లు. దూరభారాన్ని లెక్కచేయకుండా సొంత వాహనాల్లో ప్రయాణాలు. సీటుకోసం చూసుకోవడం లేదెవరూ. బస్సో, రైలో పట్టుకుంటే చాలు.. సంక్రాంతి తీసుకొస్తున్న ఎనర్జీతో నిలబడైనా జర్నీకి రెడీ.

ఊళ్లకెళ్తే సంక్రాంతి సందడే వేరు. ఏపీలో సంక్రాంతి అనగానే ముందు గుర్తుకొచ్చేది కోళ్ల పందేలే. గతంలో గోదావరి జిల్లాల్లోనే పందెంకోళ్లు కాలు దువ్వేవి. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాల్లో భాగమైపోతున్నాయి కోళ్లపందేలు. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో పండుగ మూడునాలుగు రోజులూ మామూలుగా ఉండదు హంగామా. గుర్రపు రేసు కూడా బలాదూర్‌ అన్నట్లుంటాయి కోళ్లపందేలు. నేషనల్‌ టోర్నమెంట్స్‌ని తలపించేలా ఉంటాయి పందెం బరులు.

సంక్రాంతి పందేల్లో పాల్గొనేవారే కాదు వాటిని చూసేందుకు వచ్చేవారితో ఆ ప్రాంతం జాతరని తలపిస్తుంది. వేలనుంచి లక్షల పందేలు కాస్తారు. అనధికారిక లెక్కలప్రకారం సంక్రాంతి వచ్చిందంటే ఏపీలో కోళ్లపందేల్లో వందలకోట్లు చేతులు మారతాయి. ఈసారి ఒక్కో జిల్లాలో కనీసం నాలుగైదొందల కోట్లకుపైనే పందేలు కాస్తారని లెక్కలేసుకుంటున్నారు కుక్కుటశాస్త్రంలో నిష్ణాతులైనవారు. గోదావరి జిల్లాల్లో కోడిపందేలకు భీమవరం ఎప్పట్నించో కేరాఫ్‌.

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలకు ఈసారి అదనపు ఆకర్షణవుతున్నాయి పడవ పందేలు. ఆత్రేయపురంలో సర్‌ ఆర్ధర్‌ కాటన్ గోదావరి ట్రోఫీ స్విమ్మింగ్, ముగ్గులు, గాలిపటాల పోటీలతో మొదలైంది. 12న డ్రాగన్ బోటు పందేలు.. 13న పడవ పందేలు కోనసీమ సంక్రాంతి సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అమలాపురం ఆత్రేయపురం మెయిన్ కెనాల్‌లో ఆహ్లాదకర వాతావరణంలో కేరళను తలపించేలా పడవ పందేలకు ఏర్పాట్లు చేశారు.

ఏ పందెం అయినా పండుగపూట ఆటవిడుపే. వీటన్నిటినీ మించింది ఆత్మీయ అనుబంధం. అయినవాళ్లతో రెండుమూడురోజులు ఆనందంగా గడపడం. సిటీల్లో ఫాస్ట్‌ ఫుడ్‌లకు అలవాటుపడ్డ ప్రాణాలు.. ఊళ్లో అమ్మ చేతివంటని ఆ నాలుగురోజులూ రుచిచూస్తాయి. పెద్దల ప్రేమాభిమానాలు పిల్లలకు పదికాలాలు గుర్తుండిపోతాయి. కాంక్రీట్‌ జంగిల్‌నుంచి పచ్చని పల్లెటూరికి వెళ్లినప్పుడు ప్రతీక్షణం ఆస్వాదించండి. మిగతావన్నీ పక్కనపెట్టి పండుగ అనుభూతుల్ని మూటగట్టుకుని తిరిగిరండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..