Telangana: మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త బీర్ బ్రాండ్లు..!

తెలంగాణ రాష్ట్రంలో కింగ్ ఫిషర్ బీర్లు ఇక కనుమరుగు కానున్నాయి. కింగ్‌ఫిషర్‌ ప్రీమియం లాగర్‌, కింగ్‌ఫిషర్‌ స్ట్రాంగ్‌, కింగ్‌ఫిషర్‌ అల్ర్టాతోపాటు హీనెకెన్‌ బీర్లను యూబీ సంస్థ సరఫరా చేస్తోంది. ఇప్పటికే సరఫరా నిలిపేసినట్లు యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అబ్కారీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Telangana: మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త బీర్ బ్రాండ్లు..!
Cm Revanth Reddy Review
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 11, 2025 | 9:30 PM

ఆరు గ్యారంటీల సంగతేమో గాని.. ఎన్నికల్లో ఇవ్వని ఏడో గ్యారంటీ తెలంగాణ సర్కార్‌ని ఇరకాటంలో పడేసింది. జనాభాలో అత్యధిక శాతం ఉన్న సోకాల్డ్ ట్యాక్స్ పేయర్స్‌ని ఫిదా చెయ్యడం కోసం నానా తంటాలు పడుతోంది. మందుబాబుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని.. బీర్ల ధరల పెంపును వాయిదా వేసుకుంటూ వస్తోంది. మీకోసం ఎందాకైనా అంటూ బడాబడా లిక్కర్ కంపెనీలతోనే జగడానికి సిద్ధమవుతోంది.

బార్, వైన్స్ షాపుల్లో బీరు సీసాలకు కరవు కాలం రాబోతోంది. ఒక్క బీరు దొరికినా చాలు అనుకుంటూ గంటలకొద్దీ క్యూలైన్లలో నిలబడ్డా ఉస్సూరుమంటూ వెనక్కి రావాల్సిందే. రాష్ట్రంలో అతిపెద్ద బీర్ల తయారీ సంస్థ యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌ ‘నో మోర్ బీర్’ అంటూ చెయ్యడ్డం పెట్టేసింది. స్టాకు ఉన్నా.. సరఫరా చేసేది లేదని మొరాయించింది. ఈ మేరకు తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ -TGBCLకు ఓపెన్ లెటర్ రాసుకుంది. ఆరేళ్ల నుంచి ధరలు పెంచరు.. పెండింగ్‌లో ఉన్న బకాయిలూ చెల్లించరు.. అంటూ ప్రభుత్వం మీద యుద్ధమే ప్రకటించింది. ఫలితం.. కింగ్‌ఫిషర్ సహా ఏడు బ్రాండ్ల బీర్లు బైటికి రాక గోడౌన్లలోనే ఇరుక్కుపోయాయి.

తెలంగాణలో బీర్ల విక్రయాలు బందయ్యే ప్రమాదం పొంచి ఉన్నందున ఉలిక్కిపడింది తెలంగాణ సర్కార్. కానీ.. కింకర్తవ్యం ఏమిటన్నదే అంతుబట్టకుండా ఉంది. మద్యం ధరల పెంపు మీద రిటైర్డ్ జడ్జ్‌తో కమిటీ వేసి.. సిఫార్సుల కోసం వెయిటింగ్‌లో ఉంది తెలంగాణ సర్కార్. ఆ కమిటీ నివేదిక ఇచ్చేదాకా లిక్కర్ తారిఫ్ జోలికి వెళ్లే ఛాన్సే లేదంటోంది అబ్కారీ శాఖ. దీంతో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. మంత్రులు భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావులతో కలిసి అబ్కారీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్సైజ్ అధికారులకు సూచించారు. ఇందుకోసం పారదర్శక విధానం పాటించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే టీజీబీసీఎల్ కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని చెప్పారు. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో కట్టుదిట్టం గా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. కొత్త కంపెనీల నుంచి అప్లికేషన్లకు తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి, కనీసం నెల రోజులు నిర్ణీత గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ కంపెనీలు తమ బ్రాండ్ల పేర్లతో దరఖాస్తు చేసుకోవాలని, ఆ కంపెనీల నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టాలని చెప్పారు.

ఇటీవల యునైటెడ్ బేవరేజస్ కంపెనీ బీర్ల రేట్లను 33.1 శాతం పెంచాలని ఒత్తిడి చేసిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే కంపెనీల ఒత్తిడి కి తలొగ్గేది లేదని, పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్ర తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీర్ల ధరలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. అంతేకాకండా హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ (ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ) నివేదిక ఆధారంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అలాగే, గత ఏడాదిగా ఎక్సైజ్ శాఖ కు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు క్రమంగా క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి ఆర్ధిక శాఖ అధికారుల ను ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..