Telangana: బతుకు దెరువు కోసం వచ్చి కోట్లకు అధిపతి.. క్రిమినల్ వెబ్ సిరీస్ తరహాలో సాగిన దందా..!

మెదక్ ప్రాంతానికి చెందిన సుధీర్ గౌడ్ జీవనోపాధి కోసం బీరంగూడలో నివాసం ఉంటున్నాడు. డబ్బు సంపాదన మీద దురాశతో 2014 సుధీర్ గౌడ్ అతని భార్య శ్రీవాణి, అతని తమ్ముడు ప్రభు గౌడ్ ముగ్గురు కలిసి కొత్త వ్యాపారానికి తెరలేపారు. వీళ్ల దందా మొత్తం చూస్తే ఓ క్రిమినల్ వెబ్ సిరీస్ తరహాలో సాగింది.

Telangana: బతుకు దెరువు కోసం వచ్చి కోట్లకు అధిపతి.. క్రిమినల్ వెబ్ సిరీస్ తరహాలో సాగిన దందా..!
Alprazolam Drug Seized
Follow us
P Shivteja

| Edited By: Balaraju Goud

Updated on: Jan 11, 2025 | 6:38 PM

బ్రతుకుతెరువు కోసం ఇతర రాష్ట్రం నుంచి వలస వచ్చిన ఒక సాధారణ ఎలక్ట్రిషన్ నాలుగు సంవత్సరాలలో కోట్లకి అధిపతి అయ్యాడు. యూట్యూబ్ పుణ్యమా అని ఏకంగా ఒక కంపెనీని ప్రారంభించి తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అతనిలా మీరు కూడా అవ్వాలనుకుంటే.. మీరు పప్పులో కాలేసినట్టే! అసలు ఏం జరిగింది.. అతడు ఆ డబ్బు ఎలా సంపాదించాడు.. ఎలాంటి కంపెనీని ప్రారంభించాడు.. తెలుసు కోవాలని ఉందా అయితే ఈ స్టోరీ చదవాల్సిందే..!

సంగారెడ్డి జిల్లాలో పారిశ్రామిక వాడగా పేరుపొందిన ముత్తంగి గ్రామంలో ఉంటున్న సుధీర్ గౌడ్ అనే వ్యక్తి ప్రధాన నేరస్తుడిగా గుర్తించారు పోలీసులు. మెదక్ ప్రాంతానికి చెందిన సుధీర్ గౌడ్ జీవనోపాధి కోసం బీరంగూడలో నివాసం ఉంటున్నాడు. డబ్బు సంపాదన మీద దురాశతో 2014 సుధీర్ గౌడ్ అతని భార్య శ్రీవాణి, అతని తమ్ముడు ప్రభు గౌడ్ ముగ్గురు కలిసి కొత్త వ్యాపారానికి తెరలేపారు.

కల్లులో కలిపే నిషేదిత అల్ప్రాజోలం మత్తు మందును అమ్మే అనుభవంతో 2017 లో కానుకుంటకు చెందిన విశాల్ గౌడ్ అనే వ్యక్తిని పరిచయం చేసుకున్నారు. అతని నుండి అల్ప్రాజోలం తీసుకొని కల్లు దుకాణాలకు సరఫరా చేయడం మొదలుపెట్టారు. 2020లో గుమ్మడిదలకు చెందిన సాయి గౌడ్ అనే వ్యక్తిని పరిచయం చేసుకుని అతని నుండి అల్ప్రాజోలం కొని అమ్మేవాళ్లు సాగించారు.

ఆ తరువాత విశాల్ గౌడ్ ముత్తంగికి చెందిన బీశ్వేశ్వర్ సింగ్ ను పరిచయం చేయగా, అప్పటి నుండి వీరందరూ కలిసి ఈ నిషేదిత అల్ప్రాజోలం వ్యాపారం చేస్తూ.. కమిషన్ ద్వారా వచ్చే డబ్బులు సరిపోగా,ఆ వ్యాపారంలో అధిక లాభాలను చూసి, సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. బీశ్వేశ్వర్ సింగ్ కు అల్ప్రాజోలంను తయారు చేసే పద్దతి తెలుసని సొంతంగా అల్ప్రాజోలంను తయారు చేసి అధిక డబ్బులు సంపాదించవచ్చనే ఆలోచనతో.. 2023లో హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాచారం గ్రామ శివారులోని సర్వే నెంబర్ 39 గల లక్ష్మణ్ గౌడ్‌కు చెందిన సాయి ప్రియ కెమికల్స్ కంపెనీని కొనాలని నిర్ణయించుకున్నారు.

దీని కోసం ముత్తంగికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన రాజేశ్వర్ శర్మను, బీశ్వేశ్వర్ సింగ్ పరిచయం చేయగా ముగ్గురు కలసి 2023 మే నెలలో లక్ష్మణ్ గౌడ్ కంపెనిని కొనుగోలు చేశారు. కంపెనీలో నిషేదిత అల్ప్రాజోలంను తయారు చేసే మిషనరిని ఏర్పాటు చేసుకొని, సుధీర్ డ్రైవర్ బోడ శశి కుమార్ సహాయంతో అల్ప్రాజోలం తయారికి కావాల్సిన ముడిపదార్దాలను సరఫరా చేశారు. దీంతో మత్తు మందు ఉత్పత్తి ప్రారంభించారు. ఒక్కో బ్యాచ్ -50 కిలోల చొప్పున, నెలకు 1-2 బ్యాచ్ ల అల్ప్రాజోలంను తయారు చేసి కేజి 4 లక్షల రూపాయల చొప్పున హైద్రాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలలో అమ్మి సొమ్ము చేసుకున్నారు. లండన్ లో పీజీ చేసిన శశి కుమార్ అనే వ్యక్తి ఈ ఆల్ఫోజం తయారీకి సంబంధించిన సాంకేతిక సహాయాన్ని చేయడంతో వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోయింది.

ఈ నేపథ్యంలోనే జనవరి 10వ తేదీ సాయంత్రం తయారు చేసిన అల్ప్రాజోలం మెదక్ వైపు అమ్మడానికి తీసుకుని వెళుతుండగా, పక్కా సమాచారంతో సుధీర్ గౌడ్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారణ జరపడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిని పోలీసులు వారిదైన శైలిలో విచారణ చేయగా, విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఈ దందాతో వీరు మొత్తం 60 కోట్ల రూపాయల ఆస్తులు కూడా బెట్టినట్లు తేలింది. వీళ్ల దందా మొత్తం చూస్తే ఓ క్రిమినల్ వెబ్ సిరీస్ తరహాలో సాగింది. ప్రధాన నిందితుడు సుధీర్ గౌడ్ బిజినెస్ చేసే స్టయిల్ వేరే లెవల్..! అతని పేరు కూడా ఎవరికి తెలియకుండా కోడ్ భాషలోనే బిజినెస్ చేశాడు. ఇక సంగారెడ్డి జిల్లాలోని పలుచోట్ల దాదాపు 60 కోట్ల రూపాయలతో భూములు, విల్లాలు ఇండ్లను కొనుగోలు చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. వాటిని సీజ్ చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..