Andhra Pradesh: గణేష్ ఊరేగింపులో అపశృతి.. కాంతారా పాటకు డ్యాన్స్ చేస్తుండగా మంటలు అంటుకుని..
వినాయక నిమజ్జన కార్యక్రమం అంటేనే అంగరంగ వైభవంగా.. ఎవరికి తగ్గట్టు వారు భక్తి శ్రద్ధలతో సంబరాలు చేసుకుంటూ ఆనందిస్తుంటారు. అయితే ఆ సంబరాలు ఒక్కొక్కసారి చేదు అనుభవాలను కూడా మిగులుస్తూ ఉంటాయి. వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించుకుని సంబరాలు చేసే క్రమంలో కడప జిల్లాలోని ఎర్రగుంట్ల ప్రాంతంలో అపశృతి చోటుచేసుకుంది.

కడప, అక్టోబర్ 01: వినాయక నిమజ్జన కార్యక్రమం అంటేనే అంగరంగ వైభవంగా.. ఎవరికి తగ్గట్టు వారు భక్తి శ్రద్ధలతో సంబరాలు చేసుకుంటూ ఆనందిస్తుంటారు. అయితే ఆ సంబరాలు ఒక్కొక్కసారి చేదు అనుభవాలను కూడా మిగులుస్తూ ఉంటాయి. వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించుకుని సంబరాలు చేసే క్రమంలో కడప జిల్లాలోని ఎర్రగుంట్ల ప్రాంతంలో అపశృతి చోటుచేసుకుంది. కాంతారా సినిమాలోని పాటకు.. అదే వేషధారణతో డాన్స్ చేస్తుంగా ప్రమాదం చోటుచేసుకుంది. కాంతారా సినిమాలోని వారాహ రూపం పాటకు.. పెట్రోల్ పోసి డాన్స్ చేసే సమయంలో నిప్పంటుకొని ఆరుగురు చిన్నారులు సహా ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది.
వివరాల ప్రకారం.. కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గ ఎర్రగుంట్ల ప్రాంతంలో నిన్న రాత్రి వినాయక నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ఎంతో ఆనందంగా వినాయకుడిని నిమజ్జనం చేయడానికి వెళుతున్న భక్తులకు నిప్పు అంటుకొని ఎనిమిది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అందులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సంబరాలు జరుగుతున్న సమయంలో ఊరేగింపుగా వస్తున్నారు. ఈ సమయంలో కొంతమంది కళాకారులు కాంతారా సినిమాలోని వేషధారణలతో డాన్సులు చేస్తున్నారు. ఈ సమయంలో సినిమాలో మాదిరిగా మంటలు వచ్చే విధంగా సెట్ చేసుకున్నారు. ఈ సమయంలో చుట్టూ పెట్రోలు పోసి నిప్పు పెట్టి డాన్స్ చేద్దాం అనుకున్నారు. అయితే, కళాకారులు చేసుకున్న ప్లాన్ బెడిసికొట్టింది. చుట్టూ పెట్రోల్ పోసుకొని మంట అంటించి.. మధ్యలో డాన్స్ చేయాల్సి ఉండగా ఆ మంటలు ఒక్కసారిగా పెద్దగా ఎగిసిపడ్డాయి. దీంతో కళాకారులతోపాటు.. చుట్టూ ఉన్న పిల్లలకు మంటలు అంటుకున్నాయి. ఇద్దరు కళాకారులతోపాటు.. ఆరుగురు చిన్న పిల్లలకు మంటలు అంటుకుని తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు.
పోలీసుల వైఫల్యంతోనే..
వినాయక నిమజ్జన సమయంలో అనేక రూల్స్ పెట్టి నిమజ్జనానికి అనుమతి ఇచ్చే పోలీసులు.. ఊరిగింపు సమయంలో అశ్రద్ధ వహించినట్లు పేర్కొంటున్నారు. రాత్రి ఊరేగింపు వారి కళ్ళముందే జరుగుతున్నా పట్టించుకోలేదని.. దాని వల్లే ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు అంటున్నారు. పెట్రోల్ క్యాన్లు తీసుకొని పోలీసుల కళ్ళముందే నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తున్న దానిని ఆపే ప్రయత్నం గానీ.. అడ్డుకునే ప్రయత్నం గానీ.. పోలీసులు చేయలేదని.. ఈ సమయంలో మంటలు వ్యాపించి అందరు గాయాలపాలయ్యారని పేర్కొంటున్నారు. పోలీసులు ముందుగా స్పందించి ఉంటే ఈ దుర్ఘటన జరిగేది కాదని పేర్కొంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..