YCP targer 24: ఆ ఇరవై నాలుగే వైసీపీ మెయిన్ టార్గెట్.. వ్యూహం మార్చిన ఫ్యాన్ పార్టీ!
ఇప్పుడో కొత్త టార్గెట్ పెట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. లాస్ట్ టైమ్ మిస్సయిన స్థానాల్ని కూడా చేజిక్కించుకునేలా కొత్త స్కెచ్ వేసింది.
YSRCP targer 24: గత ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైఎస్సార్‌సీపీ.. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపుగా స్వీప్ చేసేసింది. కాకపోతే ఆ నియోజకవర్గాల్లో మాత్రం.. ఎందుకనో విక్టరీ కొట్టలేకపోయింది. అందుకే, ఇప్పుడో కొత్త టార్గెట్ పెట్టుకుంది. లాస్ట్ టైమ్ మిస్సయిన స్థానాల్ని కూడా చేజిక్కించుకునేలా కొత్త స్కెచ్ వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులు సైతం ఊహించని విజయంతో అధికారం దక్కించుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ… ఈసారి మరింత పదునైన వ్యూహాలతో ఎన్నిలకు సిద్ధమవుతోంది. ఓవైపు ప్రభుత్వ కార్యక్రమాలు చూస్తూనే… మరోవైపు పార్టీ పటిష్టతపైనా ఫోకస్ పెట్టిన సీఎం జగన్మోహన్‌రెడ్డి… సరికొత్త వ్యూహాలతో ప్రత్యర్థులకు సవాల్ విసిరేందుకు సిద్ధమవుతున్నారు.
ఏపీలోని 175 స్థానాలకు గాను… గత ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లు గెలిచిన వైసీపీ… ప్రత్యర్థులకు 24 స్థానాల్లో మాత్రమే ఛాన్సిచ్చింది. అందులో 23 టీడీపీ, ఒక స్థానం జనసేన గెలుచుకుంది. ఆ 24మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేల్లోనూ కొందరు అధికార పార్టీకి మద్దతుగా మారిపోయారు, అది వేరే విషయం. అయితే, ఆ 24స్థానాలు ఎందుకు ఓడిపోయాం.. అవి కూడా గెలిచేస్తే ఓ పనైపోతుంది? అనే అంశంపై ఫోకస్ పెట్టింది వైసీపీ హైకమాండ్. ఈసారి ఆ స్థానాలు కూడా తమ ఖాతాలో వేసుకోవాలని కంకణం కట్టేసుకున్నట్టే కనిపిస్తోంది.
2019ఎన్నికల్లో దాదాపు స్వీప్ చేసింతగా దూసుకెళ్లిన వైసీపీ… ఆ 24 చోట్ల మాత్రం వెనకబడింది. అందుకే, ఓడిన 24 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన జగన్.. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. గడపగడప కు వైస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం సందర్భంగా… ఆ నియోజకవర్గాలకు ఇంచార్జ్‌ల విషయంలోనూ అధిష్టానం క్లారిటీ ఇవ్వనుంది. వాటిలో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి బలమైన నేతలకు ఇంచార్జ్‌లుగా బాద్యతలు అప్పగించింది.
ఓడిన స్థానాల్లో కొన్నింటికి ఇంచార్జ్‌లను నియమించింది వైసీపీ. పర్చూరులో మాజీ మంత్రి గాదె వెంకట్రెడ్డి కుమారుడు గాదె మదుసూదనరెడ్డికి, చీరాలలో కరణం వెంకటేష్‌కు, అద్దంకిలో కృష్ణ చైతన్య , కొండేపిలో వరికూటి అశోక్ బాబుకు పార్టీ ఇంచార్జ్‌గా బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. మిగితా స్థానాలకు కూడా ఇంచార్జ్‌లను నియమించనుంది. ఇప్పటికే తనను కలిసిన మాజీ మంత్రులు, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, గాదె వెంకటరెడ్డిలతో కీలక చర్చలు జరిపారు సీఎం జగన్. సో.. వెరీ సూన్ మిగితా ఇంచార్జ్‌ల విషయంలోనూ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి, వైసీపీ వ్యూహం సక్సెస్ అవుతుందా? 151ని మించి స్థానాలు గెలుస్తుందా? అంటే మాత్రం.. 2024దాకా ఆగాల్సిందే.