Telangana Congress: రాహుల్ టూర్‌తో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి మారిపోయిందా.. ఇంతకీ ఆ నేతలు ఎక్కడ?
మొన్నటి దాకా తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ నేతలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వాళ్లు ఏం చెబితే అదే నడిచేది. ఏదిపడితే అదే మాట్లాడేవారు..
Telangana Congress: మొన్నటి దాకా తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ నేతలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వాళ్లు ఏం చెబితే అదే నడిచేది. ఏదిపడితే అదే మాట్లాడేవారు.. నోటికెంతొస్తే అంతా అనేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. సీనియర్లూ లేరు.. జూనియర్లూ లేరు… అంతా గప్‌చిప్. ఇంతకీ వాళ్లెవరు? వాళ్ల మౌనానికి కారణమేంటి? అన్నదీ ఇప్పడు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చ మొదలైంది.
రాహుల్ తెలంగాణ పర్యటన… టీపీసీసీలో కొత్త జోష్ తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. వరంగల్ రైతు సంఘర్షణ సభలో అగ్రనేత ప్రసంగం.. నేతల్లో, కార్యకర్తల్లో ఎనలేని ఉత్సాహాన్ని నింపింది. మొన్నటి వరకు ఏదో ఒక ఇష్యూతో హంగామా చేసిన నేతలు కూడా ఇప్పుడు కామైపోయారు. వారిలో రాహుల్ గాంధీ టూర్ వణుకు పుట్టించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎగిరెగిరి పడే నేతలంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడం… కొత్త చర్చకు దారితీసింది.
రాహుల్ స్పీచ్ తో కాంగ్రెస్ సత్తా ఏంటో అధికార పార్టీ నేతలకు తెలిసొచ్చినట్టుంది. రాహుల్ పర్యటన పై ఓవైపు అధికార పక్షం నేతలు విమర్శల వర్షం కురిపిస్తే… టీకాంగ్రెస్‌లో ఇన్నాళ్లూ రచ్చ చేసిన నేతలకు మాత్రం ముచ్చెమటలు పడుతన్నాయట. కొంత మంది నేతలైతే… రాహుల్‌ని అసలు రాష్ట్రానికి ఎందుకు తీసుకొచ్చామా అని ఆలోచనలో పడ్డారట. ఎందుకంటే తన పర్యటనలో అధికార టీఆర్‌ఎస్ ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో… అదే స్థాయిలో సొంత పార్టీ నేతలకూ క్లాస్ తీసుకున్నారట రాహుల్. పోరాటం చేసే వారే పార్టీలో ఉండండి… కోవర్టులెవరైనా ఉంటే వెళ్లిపోండి.. అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారంట.
ప్రస్తుతం టీకాంగ్రెస్ లో రాహుల్ చేసిన వ్యాఖ్యలపైనే జోరుగా చర్చ జరుగుతోంది. పనిచేయనివారు పార్టీలో ఉండాల్సిన అవసరం లేదంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని… కొంతమంది నేతలు తమకు ఆపాదించుకుని తలలు పట్టుకుంటున్నారట. ఢిల్లీకి రావొద్దు… హైదరాబాద్‌లో ఉండొద్దు.. నియోజకవర్గాల్లో పని చేయాలన్న రాహుల్ వ్యాఖ్యలు సైతం.. ఆ నేతల్లో కలవరం పుట్టించాయి. చిన్నాపెద్దా తేడాలేదు.. కష్టపడేవారికే టిక్కెట్లు అంటూ అగ్రనేత స్పష్టం చేయడంతో.. ఆ నేతలంతా నియోజకవర్గం బాటపట్టే ఆలోచనలో ఉన్నారంట.
పార్టీలో కోవర్టులున్నారంటూ వీ హనుమంతరావు లాంటి నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక… ఆయనకు వ్యతిరేకంగా హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. రేవంత్ తీరును ఓపెన్‌గానే విమర్శించారు. దీంతో, నేతలందరినీ ఢిల్లీకి పిలిపించిన రాహుల్… అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిందేనని హెచ్చరించారు. ఇటీవల తెలంగాణ పర్యటనలో మరోసారి ఇదే విషయమై నేతలకు రాహుల్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అధికార పార్టీపై విమర్శలకంటే సొంత పార్టీపైనే ఆయన ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో, నిన్నటి మొన్నటి దాకా తోపుల్లా ఫీలైన నేతలంతా తోకముడిచారని సమాచారం.
ఇక, ఢిల్లీలో సైతం పార్టీలో చక్రం తిప్పగలమనుకున్న నేతలకు ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదంట. ఎందుకంటే రాహుల్ తాజా పర్యటనలో అలాంటి నేతలకు సరైన ప్రాధాన్యమే దక్కలేదు. రాహుల్‌తో మాట్లాడే ప్రయత్నం చేసినా అటు నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదని లోలోపల కుమిలిపోతున్నారట ఆ నేతలు. ప్రస్తుతానికి అంతా గప్‌చిప్ అన్నట్టుగానే ఉన్నా.. ఆ లీడర్లు మున్ముందు మళ్లీ తోకజాడిస్తారనే అనుమానమూ వ్యక్తమవుతోంది.
— అశోక్ భీమనపల్లి , టీవీ 9 తెలుగు ప్రతినిధి, హైదరాబాద్