AP Rains: 50 ఏళ్లలో ఇదే తొలిసారి.. నీట మునిగిన బెజవాడ.. ఏకంగా 150కి పైగా రైళ్ల రద్దు
భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో రైలు రవాణా స్థంభించిపోయింది. వరంగల్ జిల్లా కేసముద్రం ప్రాంతంలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కేసముద్రంలో రైల్వే ట్రాక్ కింద దిమ్మెలన్నీ కొట్టుకుపోయి ట్రాక్ గాల్లో వేలాడుతోంది. ఈ మార్గంలో రెండు వైపులా ట్రాక్ దెబ్బతింది.
భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో రైలు రవాణా స్థంభించిపోయింది. వరంగల్ జిల్లా కేసముద్రం ప్రాంతంలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కేసముద్రంలో రైల్వే ట్రాక్ కింద దిమ్మెలన్నీ కొట్టుకుపోయి ట్రాక్ గాల్లో వేలాడుతోంది. ఈ మార్గంలో రెండు వైపులా ట్రాక్ దెబ్బతింది. ట్రాక్ కొట్టుకుపోయిన ప్రాంతంలో దానికి కొద్దిదూరంలో భారీ గూడ్స్ ట్రైన్ నిలిచిపోయింది. ట్రాక్‌ను పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద JCBల సాయంతో అక్కడ మట్టి నింపే జరుగుతోంది. అటు విజయవాడ శివారు రాయనపాడులోనూ ట్రాక్ దెబ్బతింది. దీంతో ఉత్తరాది నుంచి దక్షిణాదికి, అటు నుంచి ఇటు వచ్చే అనేక రైళ్ల దారి మళ్లించారు. తెలుగు రాష్ట్రాల పరిధిలో నడిచే 150కి పైగా రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. అటు వైజాగ్ వందేభారత్, తిరుపతి వందేభారత్ రైళ్ల సమయాల్లో కూడా మార్పులు చేసింది దక్షిణ మధ్య రైల్వే.
మరోవైపు భారీ వర్షాలతో విజయవాడ నగరం నదిని తలపిస్తోంది. 50ఏళ్లలో ఎప్పుడూ రానంత వరదతో బుడమేరు పరిసర గ్రామాలన్నీ జలదిగ్భంధంలోకి వెళ్లిపోయాయి. ముంపు బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి.. మంత్రులు, అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. వరద పరిస్థితిని ఎప్పటిప్పుడు ఆరా తీస్తూ.. సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు.
స్వయంగా తానే గ్రౌండ్‌లో పర్యటిస్తూ ముంపు బాధితులకు అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. వరద తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో బోట్లలో తిరుగుతూ.. బాధితులతో మాట్లాడి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఆదివారం విజయవాడలో పలు ప్రాంతాల్లో బోటులో పర్యటించిన చంద్రబాబు. ఇవాళ కూడా బోటులో తిరుగుతూ వరద తీవ్రతను స్వయంగా తెలుసుకున్నారు. విజయవాడలోని సింగ్‌నగర్, కృష్ణలంక, జూపూడి ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ముంపు ప్రాంతాల బాధితులతో మాట్లాడి.. వారికి ధైర్యం చెప్పారు. ఇక రాత్రి విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే సీఎం చంద్రబాబు బస చేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ తెల్లవారు జామున 4:30 గంటలకు మళ్లీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బుడమేరు వాగును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అందుకే ఎప్పుడూ రానంత వరద వచ్చిందన్నారు. బాధితులను ఆదుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రెండు రోజుల పాటు వరద కొనసాగే అవసరం ఉందన్నారు మంత్రి పార్థసారధి. ముంపు ప్రాంతాల్లో అన్ని సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి