Tirupati: గోవింద నామస్మరణ చేస్తూ కాలినడకన భక్తులు.. మార్గంలో కనిపించింది చూడగా
తిరుమల కాలినడకన గోవింద నామస్మరణ చేస్తూ కొండపైకి ఎక్కుతున్నారు భక్తులు. ఇంతలో వారికి మార్గం మధ్యలో ఓ వింతైన ఆకారం కనిపించింది. ఏంటా అని చూడగా.. చూడగానే దెబ్బకు గుండె బద్దలైనంత పనైంది. బాబోయ్.! ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 అడుగులు..

తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన శేషాచలం అటవీ ప్రాంతం ఎన్నో జీవరాసుల నిలయం. అరుదైన వృక్ష జంతుజాతులున్న శేషాచలం ఎన్నో జాతుల పాముల ఆవాసం. బుసలు కొట్టే విష నాగులు, భారీ కొండ చిలువల వల్ల ఇప్పటిదాకా ఎవరికీ హాని జరగకపోయినా భక్తులను మాత్రం భయపెడుతున్న పరిస్థితి ఉంది. తరచూ తిరుమలలో నడక మార్గాల్లో భక్తులకు కనిపిస్తూ బెదరగొడుతున్నాయి. ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మారిపోతున్నాయి. ఇందులో భాగంగానే తిరుమల కొండ ఎక్కుతున్న భక్తులకు నిన్న రాత్రి అలిపిరి నడక మార్గంలో గుండె గబేలుమనిపించే దృశ్యం కట్టబడింది.
గోవింద నామస్మరణ చేస్తూ అడుగులు వేస్తున్న భక్తులకు 14 అడుగులకు పైగా ఉన్న భారీ కొండచిలువ దర్శనమించింది. అలిపిరి నడక మార్గం నుంచి తిరుమల యాత్ర ప్రారంభించిన భక్తులకు 7వ మైలు వద్ద రోడ్డుపైకి వచ్చిన 14 అడుగుల పొడవైన కొండచిలువ కనిపించింది. దీంతో హడలిపోయిన నడకదారి భక్తులు కొందరు వెనక్కి పరుగులు పెట్టిన పరిస్థితి నెలకొంది. నడకదారి పక్కనే ఉన్న మొదటి ఘాట్ రోడ్ లో 15 నిమిషాల పాటు వాహనాలు కూడా నిలిపి వేయాల్సి వచ్చింది. టీటీడీ ఫారెస్ట్ విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు కు టీటీడీ సెక్యూరిటీ సమాచారం ఇచ్చింది.
ఇక వెంటనే అక్కడికి వాలిపోయిన భాస్కర్ నాయుడు కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. భారీ కొండచిలువను భుజంపై వేసుకొని తీసుకెళ్లే ప్రయత్నం చేసిన భాస్కర్ నాయుడు తో కొందరు భక్తులు సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. ఆ తరువాత 14 అడుగులకు పైగా ఉన్న భారీ కొండ చిలువను అవ్వా చారి కోన లోయలో భాస్కర్ నాయుడు వదిలి పెట్టాడు. దీంతో ఊపిరి పీల్చుకున్న భక్తులు నడకదారి ప్రయాణాన్ని కొనసాగించి తిరుమల చేరుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి