Andhra: రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగికి అనుమానాస్పద వీడియో కాల్.. కెమెరా ఆన్ చేయగా.. కట్ చేస్తే.!
సైబర్ నేరగాళ్ల మాయలో పడి ప్రకాశం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఎంప్లాయ్ కోటి 23లక్షల రూపాయలు పోగొట్టుకోవడం సంచలనంగా మారింది. ఇంతకీ.. సైబర్ కేటుగాళ్లు ఎలా మోసం చేశారు?... కోటి 23లక్షలు ఎలా కొట్టేశారు?.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

డిజిటల్ అరెస్ట్ పేరుతో సామాన్యులనే కాదు.. విద్యావంతులను కూడా సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా అద్దంకిలో ఘరానా మోసానికి పాల్పడ్డారు. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగిని బెదిరించి ఏకంగా కోటి 23 లక్షల రూపాయలు కాజేశారు. అద్దంకి పట్టణానికి చెందిన శ్రీరామ్ నాగేశ్వరరావు.. గతంలో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంకులో లోన్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేశారు. అయితే.. ఆయన విధుల్లో ఉన్నప్పుడు అక్రమాలు జరిగాయని, దీనిపై కేసు నమోదైందని సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి.. డిజిటల్ అరెస్ట్ పేరుతో భయభ్రాంతులకు గురిచేశారు.
మిమ్మల్ని, మీ భార్యను వెంటనే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. వీడియో కాల్ ద్వారా ఆన్‌లైన్‌లోనే ఇంటి శోధన చేస్తామని బెదిరించి.. ఇంట్లోని బీరువాలో ఉన్న షేర్ మార్కెట్ డాక్యుమెంట్లను కూడా క్యాప్చర్ చేసుకోవడం షాకిస్తోంది. ఈ కేసు నుంచి తప్పించాలంటే డబ్బులు చెల్లించాలని నమ్మించి.. విడతల వారీగా నాగేశ్వరరావు నుంచి కోటీ 23లక్షలు వసూలు చేశారు. ఇది చాలదన్నట్లు.. బాధితుడు నివాసం ఉంటున్న ఇంటిని కూడా అమ్మి డబ్బులు అకౌంట్లో వేయాలని మరింత వేధించడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులకు తెలిపారు. మోసపోయానని గ్రహించి.. సైబర్ క్రైమ్ విభాగానికి.. అద్దంకి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నగదు లావాదేవీలు జరిగిన సుమారు 13 అకౌంట్లను ఫ్రీజ్ చేసినట్లు అద్దంకి పోలీసులు తెలిపారు. ఎలాంటి కేసుల్లోనూ డిజిటల్ అరెస్ట్‌లు ఉండవని.. ఇలాంటి సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.




