మీ ఇంట్లో శ్రీమహాలక్ష్మి తిష్ట వేసుకుని కూర్చోవాలా? ఐతే ఇలా చేయండి
హిందూ మత విశ్వాసాల ప్రకారం శుక్రవారానికి అధిక ప్రాధాన్యత ఉంది. ఈరోజున సిరి సంపదలను అనుగ్రహించే లక్ష్మీదేవిని ఆరాధిస్తుంటారు. లక్ష్మీదేవి కటాక్షం కోసం శుక్రవారంనాడు ప్రత్యేక పూజలు, వ్రతాలు చేస్తుంటారు. అయితే, కొందరు ఈరోజున కొన్ని చేయకూడని చేస్తుంటారు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి రాకపోగా.. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతుంది.

హిందూ మతంలో శుక్రవారానికి అధిక ప్రాధాన్యత ఉంది. చాలా మంది శుక్రవారం రోజున మహాలక్ష్మి తోపాటు ఇతర దేవీదేవతలకు పూజలు చేస్తుంటారు. ఎక్కువగా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈరోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల సానుకూల ప్రభావంతోపాటు సిరిసంపదలు వస్తాయని విశ్వసిస్తారు. అయితే, ఈరోజున కొందరు తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకుందాం.
శుక్రవారం రోజున కొంతమంది పూజా మందిరంలో దేవీదేవతల విగ్రహాలను, పటాలను, పూజలో వాడే సామాగ్రిని శుభ్రం చేసి.. మళ్లీ పసుపు, కుంకుమలు పెట్టి పూజలు చేస్తుంటారు. కానీ, శుక్రవారంనాడు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. దేవుని గదిలో విగ్రహాలు, పటాలను శుభ్రం చేసుకోడానికి ఆది, సోమ, బుధ, గురువారాలు మంచివి. శుక్రవారంనాడు శుభ్రపరిచే పనులు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
సంపదను పారేసి.. దారిద్య్రాన్ని తెచ్చుకోవద్దు
చాలా మంది తమ ఇంటిలోని ఉపయోగించని, విరిగిపోయిన దేవతల విగ్రహాలను, పగిలిపోయిన అద్దం, దేవుళ్ల పటాలను తీసుకెళ్లి సమీపంలోని దేవాలయాల్లోనో, చెట్టు కిందనో, మరో చోటనో వదిలేస్తుంటారు. అయితే, ఈ పనులు మాత్రం శుక్రవారం చేయకూడదని శాస్త్రం చెబుతోంది. ఒకవేళ శుక్రవారం రోజు ఇలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవిని ఇంటి బయటికి పంపినట్లే అవుతుంది. అంతేగాక, దారిద్ర్యం, బాధలను ఆహ్వనించినట్లవుతుంది.
అప్పు ఇవ్వొద్దు.. తీసుకోవద్దు
శుక్రవారం రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదని శాస్త్రం చెబుతోంది. అలాగే అప్పు తీసుకోవద్దు కూడా. ఒక వేళ ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అప్పుగా అడిగితే.. ఆర్థిక సాయం చేయండి కానీ, అప్పుగా ఇవ్వొద్దు. ఇతరుల నుంచి అప్పు తీసుకోవద్దు. అలా చేస్తే జీవితాంతం అప్పుల ఊబిలో కూరుకుపోతారు.
లక్ష్మీదేవిని ఇంట్లోనుంచి పంపొద్దు
సాధారణంగా శుభకార్యాలు జరిగినప్పుడు చాలా మంది దేవుని విగ్రహాలను కానుకగా ఇస్తూ ఉంటారు. ఒకవేళ శుక్రవారం అలాంటి సందర్భం వస్తే మాత్రం.. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికీ కానుకగా ఇవ్వకూడదని శాస్త్రం చెబుతోంది. శుక్రవారం మీ చేతితో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికైనా కానుకగా ఇస్తే మీ ఇంటి లక్ష్మిని వేరొకరికి అందించినట్లే అవుతుందని స్పష్టం చేస్తోంది.
లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే..
ప్రతీ శుక్రవారం సాయంత్రం దీపాలు వెలిగించి.. ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. ఆ సమయంలో ప్రధాన ద్వారం మూసివుంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశిందు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరిసంపదలు కోరుకునేవారు మాత్రం సంధ్యా సమయంలో ఇంటి ప్రధాన ద్వారాలను తెరిచే ఉంచాలి.
మీ ఇంట్లో శ్రీమహాలక్ష్మి తిష్ట వేసుకుని కూర్చోవాలంటే భక్తిశ్రద్ధలతో పూజించాలి. ప్రతి శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవిని పూజించడంతోపాటు నియమనిష్టలతో అష్టోత్తర శతనామావళి పఠించాలి. ముత్తైదువులైన మహిళలకు పసుపు కుంకుమ తాంబూలం ఇవ్వాలి. దీపాల కాంతులతో లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వనించాలి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమ: అనే మంత్రాలను పఠించాలి. ఇలా చేయడం ద్వారా గృహంలో సిరిసంపదలకు లోటు ఉండదు. సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.