China: వ్యాయామం చేస్తున్నవారిపై కారు ఎక్కించిన వృద్దుడు.. 35 మంది మృతి, 43 మందికి గాయాలు
చైనాలోని జుహై నగరంలో ఒక కారు డ్రైవర్ నానా భీభత్సం సృష్టించాడు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 35 మంది మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 62 ఏళ్ల నిందితుడు స్పోర్ట్స్ సెంటర్ వెలుపల వ్యాయామం చేస్తున్న ప్రేక్షకులపైకి తన కారును నడిపాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
చైనాలోని జుహై నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ 62 ఏళ్ల వృద్ధుడు క్రీడా కేంద్రం వెలుపల వ్యాయామం చేస్తున్న వారిపైకి తన కారును నడిపాడు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 35 మంది మరణించారని.. 43 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడైన డ్రైవర్‌ను అరెస్టు చేశామని చెప్పారు. అయితే ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఉద్దేశపూర్వకంగా దాడి చేశారా అనే విషయం తెలియాల్సి ఉందని చెప్పారు.
PLA ఎయిర్‌షో ముందు ఈ ప్రమాదం జరిగింది
నివేదికల ప్రకారం చైనీస్ ఆర్మీ (PLA) నగరంలో ఈ ప్రమాదం జరగడానికి ఒక రోజు ముందు మంగళవారం జుహైలో అతిపెద్ద ఎయిర్‌షోను నిర్వహించింది. వార్తా సంస్థ అసోసియేట్ ప్రెస్ ప్రకారం, నిందితుడిని గుర్తించారు. జుహైలోని షాంగ్ చోంగ్ హాస్పిటల్ ఉద్యోగి మాట్లాడుతూ.. గాయపడిన కొంతమందిని అత్యవసర క్లినిక్‌కి తీసుకువచ్చారని.. ఇక్కడ చికిత్స ఇచ్చిన తర్వాత క్షతగాత్రులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు.
వీడియోలు వైరల్..
ఈ సంఘటనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో చాలా మంది వ్యక్తులు నేలమీద పడి ఉన్నారు. రాయిటర్స్ ఒక వీడియోను ధృవీకరించింది. ఈ వీడియోలో సుమారు 20 మంది వ్యక్తులు నేలపై పడి ఉన్నారని, గాయపడిన వారిని తీసుకెళ్లడానికి అంబులెన్స్ వచ్చినప్పుడు బాధితులు ‘టెర్రరిస్ట్’ అంటూ అరుస్తున్నారని చెప్పారు.
విడాకుల విషయంలో నిందితుడికి కోపం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంఘటనా స్థలం నుంచి నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు పట్టుకున్నారు. ఈ సమయంలో అతను కత్తితో తనను తాను గాయపరచుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో అతని మెడపై తీవ్ర గాయాలయ్యాయి. విడాకుల విషయంలో ఫాన్ చాలా కోపంగా ఉన్నాడని.. బహుశా ఈ కారణంగానే అతను ఈ దారుణ ఘటనకు పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రకటన
చైనాకి చెందిన రాష్ట్ర టెలివిజన్ CCTV ప్రకారం గాయపడిన వారికి తగిన చికిత్స అందిచాలని.. సాధ్యమైనంతగా క్షతగాత్రులను బతికించే ప్రయత్నం చేయాలని అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలని సూచించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు అక్కడ ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కూడా పంపింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..