Nimisha Priya Case: భారతీయ నర్సుకు ఉరిశిక్ష రద్దు… యెమెన్ జాతీయుడి హత్యకేసులో నిమిష ప్రియకు శిక్ష
యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియకు భారీ ఊరట లభించింది. హత్య కేసులో నిమిష ప్రియకు ఉరిశిక్ష రద్దు చేసేందుకు అంగీకరించింది యెమెన్ ప్రభుత్వం. భారత గ్రాండ్ ముఫ్తీ.. సున్నీ లీడర్ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం నుంచి ఈ ప్రకటన...

యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియకు భారీ ఊరట లభించింది. హత్య కేసులో నిమిష ప్రియకు ఉరిశిక్ష రద్దు చేసేందుకు అంగీకరించింది యెమెన్ ప్రభుత్వం. భారత గ్రాండ్ ముఫ్తీ.. సున్నీ లీడర్ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం నుంచి ఈ ప్రకటన వెలువడింది. షెడ్యూల్ ప్రకారం జులై 16నే ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా.. భారత ప్రభుత్వ విజ్ఞప్తితో వాయిదా పడింది. అప్పట్నుంచి యెమెన్ అధికారులతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతూ కేసు పరిష్కారానికి ప్రయత్నించింది. భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు సూఫీ పెద్ద షేక్ హబీబ్.. సున్నీ లీడర్ అబూబకర్ కలిసి యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించడంతో నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దుకు యెమెన్ అంగీకరించినట్టు ప్రకటించింది ముఫ్తీ కార్యాలయం.
ముఫ్తీ కార్యాలయం ప్రకటనను యెమెన్‌లోని యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ జస్టిస్ ప్రతినిధి ధృవీకరించారు. అత్యున్నత సమావేశంలో మతపెద్దలు తీసుకున్న చొరవతోనే ఉరిశిక్ష రద్దు అయినట్టు తెలుస్తోంది. ఉరిశిక్ష రద్దుతో నిమిష ప్రియను విడుదల చేస్తారా.. లేక జీవితఖైదుగా మార్చుతారా అన్నది తేలాల్సి ఉంది. హత్యకు గురైన యెమెన్ పౌరుడు మహదీ కుటుంబంతో చర్చల తర్వాత తదుపరి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
కాగా, కేరళకు చెందిన నిమిష ప్రియ వృత్తి రీత్యా నర్సు. యెమెన్ దేశీయుడైన తలాల్ అబ్దో మహదీతో కలిసి ఆ దేశంలోనే క్లినిక్ ప్రారంభించింది. కానీ.. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో అతడు నిమిషపై వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో.. మరో వ్యక్తితో కలిసి అతడికి నిమిష మత్తు మందు ఇవ్వగా డోస్ ఎక్కువై మరణించారు. ఈ కేసులో ఆమెకు యెమెన్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో ఉరిశిక్ష నుంచి నిమషను తప్పించేందుకు భారత్ చేసిన ప్రయత్నం సఫలం అయింది.
