AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాస్త మెత్తబడ్డ ట్రంప్.. ఇరాన్‌తో రెండో విడత చర్చలకు సిద్ధమైన అమెరికా..!

అమెరికా, ఇరాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టిన వేళ, తాజా పరిణామాలు కాస్త ఊరటనిస్తున్నాయి. యుద్ధం కంటే శాంతికే మొగ్గు చూపుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తుండటం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది.

కాస్త మెత్తబడ్డ ట్రంప్.. ఇరాన్‌తో రెండో విడత చర్చలకు సిద్ధమైన అమెరికా..!
Us Iran Peace Talks
Balaraju Goud
|

Updated on: Apr 14, 2026 | 10:02 PM

Share

అమెరికా, ఇరాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టిన వేళ, తాజా పరిణామాలు కాస్త ఊరటనిస్తున్నాయి. యుద్ధం కంటే శాంతికే మొగ్గు చూపుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తుండటం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్ వేదికగా జరగబోయే రెండో దఫా చర్చలు పశ్చిమాసియా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.

అమెరికా-ఇరాన్ మధ్య సయోధ్య కుదర్చడంలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషిస్తోంది. తొలి విడత చర్చల్లో అమెరికా ప్రతినిధి బృందానికి జేడీ వాన్స్ నాయకత్వం వహించారు. ఆ చర్చలు ఆశించిన స్థాయిలో ఒప్పందానికి దారితీయకపోయినప్పటికీ, కొన్ని సానుకూల సంకేతాలను ఇచ్చాయి. వాన్స్ వ్యాఖ్యల తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు $100 నుండి $98కి పడిపోయాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపింది. మరోవైపు, ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకూడదనే ప్రధాన డిమాండ్‌కు అమెరికా కట్టుబడి ఉంది. హర్మూజ్ జలసంధిపై ఆర్థిక ఒత్తిడి పెంచడం ద్వారా ఇరాన్‌ను చర్చల వద్దకు తీసుకురావడంలో అమెరికా సైనిక, ఆర్థిక వ్యూహం సఫలమైందని వాన్స్ ధీమా వ్యక్తం చేశారు.

ఈ శాంతి ప్రక్రియలో కేవలం పాకిస్థాన్ మాత్రమే కాకుండా, ప్రపంచ అగ్రరాజ్యాలు కూడా భాగస్వాములవుతున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ స్వయంగా ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌లతో మాట్లాడి, యుద్ధంతో సమస్యలు పరిష్కారం కాదని చెప్పారు. అటు చైనా, రష్యా సైతం పశ్చిమాసియాలో సుస్థిరత కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, ఇరాన్‌తో తమకున్న వాణిజ్య ఒప్పందాల్లో అమెరికా జోక్యాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. హర్మూజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో ఉన్నప్పటికీ, అది తమ నౌకలకు సురక్షితంగా ఉండాలని స్పష్టం చేసింది.

గత వారం కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతం అనిశ్చితిలో ఉంది. తొలి దఫా చర్చల విఫలానికి ఇరు దేశాలు ఒకరినొకరు నిందించుకున్నప్పటికీ, రెండో దఫా చర్చల కోసం ఇస్లామాబాద్ సిద్ధమవుతోంది. రాబోయే రెండు రోజుల్లో జరగబోయే ఈ చర్చల్లో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షులు పెజెష్కియాన్ నేరుగా పాల్గొనే అవకాశం ఉందన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ప్రస్తుతం బంతి ఇరాన్ కోర్టులో ఉంది. అమెరికా ప్రతిపాదనలను ఇరాన్ సుప్రీం నేత ఆమోదిస్తారా? లేక పశ్చిమాసియా మరో భారీ యుద్ధానికి సాక్ష్యంగా నిలుస్తుందా? అనేది ఇస్లామాబాద్ వేదికగా జరిగే ఈ రెండో విడత చర్చల ఫలితాన్ని బట్టి తేలనుంది. శాంతి దిశగా ట్రంప్ తీసుకున్న ఈ ‘యూ-టర్న్’ యుద్ధ మేఘాలను తొలగిస్తుందని ప్రపంచం ఆశిస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us