AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL: ఐపీఎల్‌లో ఆ చెత్త రూల్స్ తీసేయండి.. సచిన్‌కు చిర్రెత్తించిన ఆ రూల్స్ ఏంటంటే?

T20 Cricket Rule Changes: ఐపీఎల్ 2028 నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను తొలగించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, బోర్డు కేవలం వినోదానికే పెద్దపీట వేస్తుందా లేక సచిన్ లాంటి దిగ్గజాల సూచనలను పరిగణనలోకి తీసుకుంటుందా అనేది కాలమే నిర్ణయించాలి.

IPL: ఐపీఎల్‌లో ఆ చెత్త రూల్స్ తీసేయండి.. సచిన్‌కు చిర్రెత్తించిన ఆ రూల్స్ ఏంటంటే?
Ipl 2026 Rules
Venkata Chari
|

Updated on: May 31, 2026 | 5:15 PM

Share

ఐపీఎల్ 2026 తుది సమరానికి సర్వం సిద్ధమైన వేళ, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బ్యాటర్ల రాజ్యంగా మారుతున్న టీ20 క్రికెట్‌లో బౌలర్లకు పూర్వ వైభవం తేవడానికి, ఆటలో సమతూకాన్ని కాపాడటానికి సచిన్ బీసీసీఐ ముందు మూడు విప్లవాత్మక ప్రతిపాదనలను ఉంచారు.

బ్యాటర్ల రాజ్యంగా ఐపీఎల్.. బౌలర్ల పరిస్థితి ఏంటి?

గత రెండు మూడు ఏళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలంగా మారిపోయింది. ముఖ్యంగా ఈ 2026 సీజన్‌లో 200 ప్లస్ పరుగుల స్కోర్లు సర్వసాధారణం అయిపోయాయి. ఒకప్పుడు భారీ స్కోరుగా భావించిన 160 లేదా 170 పరుగులు ఇప్పుడు చాలా సులువుగా ఛేజ్ అవుతున్నాయి. ముంబై ఇండియన్స్ మెంటార్‌గా యువ ఆటగాళ్లను నిరంతరం గైడ్ చేసే సచిన్, ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆటలో వినోదంతో పాటు అసలైన పోటీతత్వం ఉండాలంటే నియమ నిబంధనల్లో కొన్ని మార్పులు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు చెక్ పెట్టాల్సిందే!

సచిన్ టెండూల్కర్ చేసిన మొదటి, అతి ముఖ్యమైన ప్రతిపాదన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను తొలగించడం. ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమంలో మాట్లాడిన సచిన్, తన వ్యక్తిగత అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. 20 ఓవర్ల ఫార్మాట్‌లో ఇప్పటికే బౌలర్లు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, ఇలాంటి సమయంలో అదనంగా మరొక బ్యాటర్‌ను మైదానంలోకి తెచ్చే ఈ నిబంధన ఆటలో సమతూకాన్ని పూర్తిగా దెబ్బతీస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రూల్ వల్ల బౌలర్లు మరింత బలహీనపడుతున్నారని సచిన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

పవర్‌ప్లేలో సరికొత్త వ్యూహం.. బౌలింగ్ కెప్టెన్‌కు ఛాన్స్..

బౌలర్లకు అండగా నిలిచేందుకు సచిన్ రెండో ఆసక్తికర ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం ఇన్నింగ్స్ ఆరంభంలో ఉండే ఆరు ఓవర్ల పవర్‌ప్లేను రెండు భాగాలుగా విభజించాలని సూచించారు. మొదటి నాలుగు ఓవర్లను యథాతథంగా బ్యాటింగ్ పవర్‌ప్లేగా ఉంచి, మిగిలిన రెండు ఓవర్లను ఫీల్డింగ్ కెప్టెన్ తన వ్యూహాలకు అనుగుణంగా ఎప్పుడైనా వాడుకునేలా ‘బౌలింగ్ పవర్‌ప్లే’గా మార్చాలన్నారు. అంతేకాదు, ఈ రెండు ఓవర్లలో సాధారణంగా ఉండే ఇద్దరు ఫీల్డర్లకు బదులుగా, ముగ్గురు ఫీల్డర్లను 30 గజాల వలయం వెలుపల ఉంచుకునే వెసులుబాటు కల్పించాలని, తద్వారా మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చని సచిన్ వివరించారు.

బౌలర్‌కు 5 ఓవర్లు.. క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఐడియా!

క్రికెట్ రూపురేఖలను మార్చేలా సచిన్ ఇచ్చిన మూడో సలహా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలర్‌కు నాలుగు ఓవర్లకు బదులుగా ఐదు ఓవర్లు వేసే అవకాశం ఇవ్వాలన్నారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు 20 ఓవర్ల పాటు క్రీజులో ఉండి మ్యాచ్‌ను శాసించగలిగినప్పుడు, జట్టులోని ప్రధాన బౌలర్‌కు ఎందుకు అదనపు ఓవర్ ఇవ్వకూడదని ప్రశ్నించారు. ఐదో ఓవర్ అందుబాటులోకి వస్తే బౌలర్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలడని, ప్రేక్షకులు కూడా నాణ్యమైన క్రికెట్‌ను ఆస్వాదిస్తారని 53 ఏళ్ల మాస్టర్ బ్లాస్టర్ పేర్కొన్నారు.

సచిన్ టెండూల్కర్ ప్రతిపాదించిన ఈ మార్పులు ఆటలో బ్యాట్, బాల్ మధ్య సరైన పోటీని తీసుకువస్తాయనడంలో సందేహం లేదు. ఐపీఎల్ 2028 నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను తొలగించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, బోర్డు కేవలం వినోదానికే పెద్దపీట వేస్తుందా లేక సచిన్ లాంటి దిగ్గజాల సూచనలను పరిగణనలోకి తీసుకుంటుందా అనేది కాలమే నిర్ణయించాలి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us