AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జర్మనీలో భారతీయుల సరికొత్త చరిత్ర.. ఇండియా ఫెడరేషన్ ఆఫ్ జర్మనీ ఏర్పాటు..

జర్మనీ దేశ ఆర్థిక వ్యవస్థలో ఏటా ఏకంగా 15 బిలియన్ యూరోల విలువను సృష్టిస్తూ.. అక్కడ అత్యంత శక్తివంతమైన సమాజంగా ఎదిగిన 3 లక్షల మంది భారతీయ సంతతి ప్రజల కోసం ఒక చారిత్రాత్మక మైల్‌స్టోన్ నమోదైంది. జర్మనీలోని 16 ఫెడరల్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 100కు పైగా భారతీయ సంఘాలన్నింటినీ ఒకే తాటిపైకి తెస్తూ.. వారి సమిష్టి గొంతుకగా ఇండియా ఫెడరేషన్ ఆఫ్ జర్మనీ ఏర్పాటైంది.

జర్మనీలో భారతీయుల సరికొత్త చరిత్ర.. ఇండియా ఫెడరేషన్ ఆఫ్ జర్మనీ ఏర్పాటు..
India Federation Of Germany Launched
Krishna S
|

Updated on: May 31, 2026 | 9:04 AM

Share

జర్మనీలో నివసిస్తున్న భారతీయ సమాజానికి ఇదొక చారిత్రాత్మక మైల్‌స్టోన్. జర్మనీలోని భారతీయ సంఘాలన్నింటినీ ఒకే తాటిపైకి తెస్తూ.. వారి సమిష్టి గొంతుకను ప్రపంచానికి వినిపించడానికి ఇండియా ఫెడరేషన్ ఆఫ్ జర్మనీ అధికారికంగా ప్రారంభమైంది. జర్మనీలోని 16 ఫెడరల్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న 100కు పైగా భారతీయ అసోసియేషన్లు ఈ ఫెడరేషన్‌లో భాగస్వాములుగా మారాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో అటు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటు జర్మనీ ఛాన్స్ లర్ అభ్యర్థి ఫ్రెడరిక్ మెర్జ్ నేతృత్వంలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారం మరింత బలోపేతం అవుతున్న తరుణంలో ఈ ఫెడరేషన్ ఏర్పాటు కావడం విశేషం. ఇది రెండు దేశాల మధ్య ఒక బలమైన ఇన్స్టిట్యూషనల్ బ్రిడ్జ్‌లా పనిచేయనుంది.

3 లక్షల మంది భారతీయులు..

జర్మనీ ఆర్థిక వ్యవస్థలో భారతీయుల పాత్ర ఎంత కీలకమో చెప్పడానికి ఈ ఫెడరేషన్ గణాంకాలే నిదర్శనం. ప్రస్తుతం జర్మనీలో 3 లక్షల మందికి పైగా భారతీయ సంతతి ప్రజలు నివసిస్తున్నారు. వీరంతా కలిసి జర్మనీలో ఏటా సుమారు 15 బిలియన్ యూరోల (భారత కరెన్సీలో దాదాపు రూ.1.35 లక్షల కోట్లు) ఆర్థిక విలువను సృష్టిస్తూ, అక్కడి దేశ ఆర్థిక ప్రగతిలో కీలక భాగస్వాములుగా నిలుస్తున్నారు.

28 ఏళ్ల నిశబ్ద ప్రయాణం.. ఒక భావోద్వేగ మైల్‌స్టోన్

ఈ ఫెడరేషన్ ఏర్పాటు వెనుక ఒక భారతీయ మహిళ 28 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, భావోద్వేగ ప్రయాణం దాగి ఉంది. దాదాపు 28 సంవత్సరాల క్రితం చిత్ర విశ్వనాథ్ అనే యువతి ఆత్మవిశ్వాసంతో జర్మనీలో అడుగుపెట్టింది. అంతర్జాతీయ మాస్టర్స్ విద్యార్థుల మొదటి బ్యాచ్‌లో ఒకరిగా చేరి, జర్మనీలో స్థిరపడి.. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ బాష్‌లో ఏకంగా 25 సంవత్సరాల పాటు విజయవంతమైన కెరీర్‌ను కొనసాగించారు. తన భర్త మంజునాథ్ గుబ్బి, పిల్లలతో కలిసి ఉంటున్న ఆమె తమ సనాతన ధర్మ విలువలను అస్సలు వదులుకోలేదు. రెండు భిన్న సంస్కృతుల మధ్య వంతెనలా నిలిచిన ఆమె.. తన మాతృభూమి, కర్మభూమి అయిన ఇరు దేశాల కోసం ఒక ఉమ్మడి వేదికను నిర్మించాలనే బలమైన సంకల్పంతో ఈ ఫెడరేషన్ స్థాపనకు అడుగులు వేశారు. ప్రస్తుతం సిద్ధార్థ్ ముద్గల్ నేతృత్వంలోని సమర్థవంతమైన బృందం, బలమైన భారతీయ సమాజం అండతో ఈ సరికొత్త ప్రయాణం ప్రారంభమైంది.

ఇది కేవలం ఒక ఆర్గనైజేషన్ మాత్రమే కాదు.. ఇరు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేసే ఒక గొప్ప ఉద్యమం అని వ్యవస్థాపకులు తెలిపారు. భవిష్యత్తు అంతా పరస్పర సహకారం, కనెక్టివిటీతోనే ముడిపడి ఉందని, ఇందులో భారతీయ డయాస్పోరా అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవానికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, జర్మనీ ఫెడరల్ ఫారిన్ ఆఫీస్, బెర్లిన్ లోని భారత రాయబార కార్యాలయం, ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్‌లోని కాన్సులేట్ జనరల్స్, పలువురు ఇరు దేశాల ప్రముఖ నేతలు తమ మద్దతును ప్రకటించారు.

Follow Us