చంద్రుడి పై అణుశక్తి పోటీ.. అమెరికాకు చైనా, రష్యా సవాల్
చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటు చేయాలన్న కల ఇప్పుడు మరో కీలక దశకు చేరుకుంటోంది. భవిష్యత్‌లో అక్కడ మనుషులు ఎక్కువ కాలం ఉండాలంటే నిరంతర విద్యుత్ అవసరం. సౌర విద్యుత్‌తో పాటు అణు విద్యుత్‌ను ఉపయోగించేందుకు అమెరికా, చైనా, రష్యా సిద్ధమవుతున్నాయి. చంద్రుడిపై అణు రియాక్టర్‌ను ఏర్పాటు చేసేందుకు ఈ మూడు దేశాల మధ్య పోటీ మొదలైందనీ ది న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అయితే ఈ ప్రాజెక్టులు భవిష్యత్‌లో చంద్రుడిపై ఆధిపత్యానికి దారితీస్తాయా? అన్న చర్చ కూడా మొదలైంది.

చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద పనిచేసే అణు రియాక్టర్‌లను సిద్ధం చేసేందుకు నాసా ప్రణాళికలు రూపొందిస్తోంది. కాంట్రాక్టర్లను ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నాసా కోరింది. అంతరిక్ష ప్రయాణాన్ని తట్టుకుని.. చంద్రుడిపై దిగిన తర్వాత ఎక్కువ కాలం మానవ జోక్యం లేకుండా పనిచేసే రియాక్టర్‌ను అభివృద్ధి చేస్తుంది నాసా. 2030 డిసెంబర్ నాటికి ప్రయోగానికి సిద్ధం చేయాలని అమెరికా భావిస్తోంది. ‘లూనార్ రియాక్టర్ 1’ దాదాపు 20 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగలదని అంచనా. ఒక్కసారి చంద్రుడిపై ఏర్పాటు చేస్తే ఐదేళ్ల పాటు ఎలాంటి నిర్వహణ లేకుండా పనిచేసేలా దీన్ని రూపొందిస్తున్నారు.
చైనా-రష్యా రహస్య భాగస్వామ్యం?
మరోవైపు రష్యా కూడా చంద్రుడిపై అణు రియాక్టర్ లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. చైనాతో కలిసి ‘సెలీనా’ పేరుతో ఓ రియాక్టర్‌ను అభివృద్ధి చేస్తుంది రష్యా. 2036 నాటికి సిద్ధం చేయాలని రష్యా టార్గెట్ గా పెట్టుకుంది. చంద్రుడిపై ఏర్పాటు చేయబోయే స్థావరాలకు విద్యుత్ అందించనుంది. సుమారు 10 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి, దాదాపు 10 సంవత్సరాల పాటు స్వయంచాలకంగా పనిచేసేలా రూపొందిస్తున్నారు.
చంద్రుడిపై అణు విద్యుత్ ఎందుకు?
చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటు చేయాలంటే విద్యుత్ అత్యంత కీలకం. ప్రస్తుతం సౌర విద్యుత్ ప్రధాన మార్గంగా కనిపిస్తున్నప్పటికీ ఓ సమస్య ఉంది. ఒక నెలలో చంద్రుడిపై రెండు వారాలకు పైగా చీకటి ఉంటుంది. ఆ సమయంలో సౌర ప్యానళ్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదు. దీంతో కేవలం సౌరశక్తిపై ఆధారపడటం కష్టం. అణు రియాక్టర్లకు సూర్యకాంతితో పని ఉండదు. ఎక్కువ కాలం నిరంతరంగా విద్యుత్ ను అందించగలవు. అంతేకాదు.. మానవ జోక్యం అవసరం లేకుండా చంద్రుడిపై దీర్ఘకాలిక మిషన్లకు ఇవి ఉపయోగపడతాయి.ప్రారంభ దశలో అమెరికా, చైనా సౌర విద్యుత్‌తో పాటు రేడియోఐసోటోప్ వ్యవస్థలను ఉపయోగించనున్నాయి. అయితే చంద్రుడిపై పెద్ద స్థావరాలు ఏర్పడితే వాటికి మరింత విద్యుత్ అవసరమవుతుంది. ఆ అవసరాన్ని అణు రియాక్టర్లు తీర్చగలవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అసలు ప్రమాదం ఇక్కడే..
చంద్రుడిపై అణు రియాక్టర్ ఏర్పాటు చేయడం అంత సులభం కాదు. ముఖ్యంగా రాకెట్ ప్రయోగ సమయంలో ప్రమాదం జరిగితే ఏమవుతుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. రియాక్టర్‌ను చంద్రుడిపైకి తీసుకెళ్లే రాకెట్ విఫలమైతే.. అణు పదార్థాలకు సంబంధించి రేడియేషన్ ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూమిపై అణు రియాక్టర్లకు రక్షణగా భారీ కంటైన్మెంట్ వ్యవస్థలు ఉంటాయి. కానీ చంద్రుడిపై అలాంటి రక్షణ నిర్మాణాలు ఏర్పాటు చేయడం చాలా కష్టం. రియాక్టర్ ను ఇతర పరికరాలకు దూరంగా ఉండేలా ఏర్పాటు చేయాలి. దీంతో భద్రత పెద్ద సవాలుగా మారనుంది. అమెరికా, రష్యా తమ రియాక్టర్లను చంద్రుడిపైకి పంపేటప్పుడు అవి క్రియారహిత స్థితిలో ఉండేలా చేయాలని భావిస్తున్నాయి. దీని వల్ల ప్రయోగ సమయంలో కొన్ని ప్రమాదాలను తగ్గించవచ్చు. అయినప్పటికీ రాకెట్ ప్రమాదాలను పూర్తిగా నివారించలేమని నిపుణులు చెబుతున్నారు.
చంద్రుడిపై హక్కు ఎవరిది?
అణు రియాక్టర్ల రేసుతో మరో కీలక ప్రశ్న కూడా ముందుకొచ్చింది. అదే.. చంద్రుడిపై హక్కు ఎవరికుంది? 1967లో కుదిరిన ‘ఔటర్ స్పేస్ ట్రీటీ’ ప్రకారం ఏ దేశం కూడా చంద్రుడిని తన భూభాగంగా ప్రకటించకూడదు. అయితే ఒక దేశం చంద్రుడిపై స్థావరం ఏర్పాటు చేసిన తర్వాత.. దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని ఇతర దేశాల వ్యోమగాములు లేదా రోవర్లు ఉపయోగించకుండా ఆంక్షలు విధించగలదా? అన్నది ఇంకా స్పష్టం కాలేదు. భద్రత పేరుతో చంద్రుడిపై కొన్ని ప్రాంతాలను ఇతరులకు దూరంగా ఉంచితే.. అంతరిక్షాన్ని అందరూ స్వేచ్ఛగా ఉపయోగించుకోవాలన్న సూత్రానికి అది విరుద్ధం అవుతుందా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
చంద్రుడి కోసం కొత్త పోటీ?
చైనా, రష్యా కలిసి నిర్మించే అణు రియాక్టర్లు భవిష్యత్‌లో చంద్రుడిపై ఓ రకమైన ‘నిషేధిత ప్రాంతాన్ని’ సృష్టించే అవకాశం ఉంది. ఈ కారణంగానే అమెరికా తన ప్రణాళికలను వేగవంతం చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రుడిపై భవిష్యత్ స్థావరాలకు విద్యుత్ అందించాలన్న శాస్త్రీయ ప్రయత్నం.. క్రమంగా అంతరిక్ష ఆధిపత్యం, భద్రత, వనరుల హక్కుల వంటి పెద్ద ప్రశ్నలకు దారితీస్తోంది. రాబోయే దశాబ్దాల్లో చంద్రుడిపై అసలు పోటీ ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.