Vaccine Patent: కోవిడ్ టీకా పేటెంటు ఎత్తివేతకు అమెరికా మద్దతు.. కీలక వ్యాఖ్యలు చేసిన అమెరికా వాణిజ్య ప్రతినిధి
Vaccine Patent: ప్రస్తుతం ప్రపంచం కరోనా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా పేద దేశాలు ఖరీదైన టీకాలు కొనలేక ఇబ్బందులు పడుతున్నాయి. టీకాల ధర పెరగడానికి పేటెంటు..
Vaccine Patent: ప్రస్తుతం ప్రపంచం కరోనా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా పేద దేశాలు ఖరీదైన టీకాలు కొనలేక ఇబ్బందులు పడుతున్నాయి. టీకాల ధర పెరగడానికి పేటెంటు ఫీజులు ముఖ్య కారణం. అయితే కరోనా సంక్షోభం దృష్ట్యా ఈ ఫీజుల నుంచి మినహాయింపు ఇవ్వాలని దక్షిణాఫ్రికాతో పాటుగా భారత్ అమెరికాకు విజ్ఞప్తి చేసింది. అయితే కోవిడ్ టీకా పేటెంట్ల మినహాయింపుపై చేస్తున్న పోరాటంలో భారత్‌కు అత్యంత కీలక భాగస్వామి నుంచి మద్దతు లభించింది. కరోనా టీకాకు పేటెంట్ల నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వాదనకు బుధవారం అమెరికా మద్దతు పలికింది. పేద దేశాల ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు అవసరమైన టీకాల లభ్యత పెంపుపై ఈ అంశం ఆశలు పెంచాయి.
దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మేధో సంపత్తి హక్కులు ముఖ్యమే అయినప్పటికీ కరోనాను అందరూ కలిసి అంతం చేయాల్సి ఉన్నందున పేటెంటు మినహాయింపును వాషింగ్టన్ సమర్థిస్తున్నదని అమెరికా వాణిజ్య ప్రతినిధి కేథరిన్ టాయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారాలకు మేధో హక్కుల రక్షణ అంత్యంత కీలకమైందేనని అన్నారు. కానీ కోవిడ్ టీకాకు సంబంధించి మాత్రం ఇటువంటి రక్షణను తొలగించాలన్న వాదనకు అమెరికా మద్దతు పలుకుతోందని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అసాధారణ నిర్ణయాలు తీసుకోవాలి. టీకాల తయారీ, పంపిణీకి సంబంధించిన వ్యవస్థలు మెరుగు పర్చేందుకు కృషి చేస్తాము అన్నారు. టీకాల తయారీకి అవసరమైన ముడిపదార్థాల ఉత్పత్తిని పెంచుతామని ఆయన పేర్కొన్నారు.
అమెరికా నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డీజీ ట్రెడ్రోస్ అథానోమ్ స్వాగతించారు. అమెరికా నిర్ణయం చారిత్రకమని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా పోరులో ఇదొక కీలక నిర్ణయమని అన్నారు. మేధో హక్కులపై మినహాయింపులు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఒత్తిడి ఉంది. ముఖ్యంగా సంపన్న దేశాలు టీకాలపై గుత్తాధిపత్యం చూపుతున్నాయనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ దిశగా బైడెన్ కార్యవర్గం అడుగులు వేస్తోంది.