Titanic Tragedy: ఆ విషాద ఘటనకు త్వరలో 109 ఏళ్ళు.. ఆ ఓడతో గుంటూరు జిల్లాకు లింకు? ఏంటో అది?

టైటానిక్.. ఈ పేరుతో ఓ పెద్ద ప్రయాణీకులతో కూడిన నౌక నార్త్ అట్లాంటిక్ సముద్రంలో మునిగి ఏప్రిల్ 14వ తేదీకి 109 ఏళ్ళు కావస్తోంది. అయితే ఈ ఓడతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు వున్న ఓ సంబంధం..

  • Rajesh Sharma
  • Publish Date - 6:21 pm, Sat, 10 April 21
Titanic Tragedy: ఆ విషాద ఘటనకు త్వరలో 109 ఏళ్ళు.. ఆ ఓడతో గుంటూరు జిల్లాకు లింకు? ఏంటో అది?
Titanic Ship

Titanic Tragedy to complete 109 years soon: టైటానిక్ (TITANIC).. ఈ పేరుతో ఓ పెద్ద ప్రయాణీకులతో కూడిన నౌక నార్త్ అట్లాంటిక్ సముద్రం (NORTH ATLANTIC OCEAN)లో మునిగి ఏప్రిల్ 14వ తేదీకి 109 ఏళ్ళు కావస్తోంది. అయితే ఈ ఓడతో ఆంధ్రప్రదేశ్ (ANDHRA PRADESH) రాష్ట్రంలోని గుంటూరు జిల్లా (GUNTUR DISTRICT)కు వున్న ఓ సంబంధం తాజాగా వెలుగు చూసింది. అత్యంత ఆర్భాటంతో నిర్మించి, అట్టహాసంగా తొలి ప్రయాణం ప్రారంభించుకున్న టైటానిక్ షిప్.. తన తొలి ప్రయాణంలోనే సుమారు పదకొండు వందల మందిని సాగరగర్భంలోకి ముంచేసి, దుర్మరణం పాలు చేసింది. ఇంగ్లాండ్‌ (ENGLAND)లోని సౌతాంప్టన్ (SOUTHAMPTON) నుంచి అమెరికా (AMERICA)లోని న్యూయార్క్ (NEW YORK)‌కు ప్రయాణమైన టైటానిక్ మార్గమధ్యంలోనే ప్రమాదానికి గురై రెండుగా ముక్కలై నీట మునిగింది. ఈ పేరుతో 1997లో వచ్చిన సినిమా యావత్ ప్రపంచంలో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.

టైటానిక్‌.. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రయాణ నౌక. ఏప్రిల్‌ 14, 1912న టైటానిక్‌ విషాద ఘటన జరిగింది. టైటానిక్‌ విషాద ఘటనకు త్వరలోనే 109 సంవత్సరాలు. టైటానిక్‌ నౌక తొలిప్రయాణమే చిట్టచివరి ప్రయాణంగా మారింది. 1517 మంది ప్రయాణీకులు మృత్యువాత పడ్డ మరపురాని ఘటన ఇది. ఏప్రిల్‌ 10, 1912న సౌంతాప్టన్ నుంచి మొదలైన ఈ షిప్ ప్రయాణానికి కెప్టెన్ ఎడ్వర్డ్‌ జె స్మిత్ (EDWARD J SMITH). నిజానికి టైటానిక్ ప్రయాణం ప్రారంభంలోనే ఓ అపశకునం ఎదురైనట్లు చరిత్ర చెబుతోంది. టైటానిక్‌ దాని స్థానం నుండి బయలుదేరగానే ప్రొఫెలర్లు బలమైన శక్తిని విడుదల చేశాయంటారు. ఈ ధాటికి పక్కనే వున్న న్యూయార్క్ లైనర్ (NEW YORK LINER) అనే నౌక టైటానిక్‌కు దాదాపు ఢీకొనబోయిందని, కేవలం నాలుగు అడుగుల దూరంలో నిలిచిందని చెబుతారు. ఈ అపశకునం వల్ల టైటానిక్ ప్రయాణం మరో గంట ఆలస్యమైందని కొన్ని పుస్తకాలలో పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రారంభమైన టైటానిక్ ప్రయాణంలో తొలి మజిలీ ఇంగ్లీష్‌ ఛానల్‌‌ను తరువాత వచ్చిన ఫ్రాన్సు (FRANCE)లోని చెర్‌బోర్గ్ (CHER BORG)‌. అక్కడ కాసేపు ఆగిన టైటానిక్‌లో మరికొంత మంది ప్రయాణికులు ఎక్కినట్లు సమాచారం. ఆ తర్వాత ఐర్లాండులోని క్వీన్స్‌ టౌన్ (QUEEN’S TOWN)‌ వద్ద కూడా టైటానిక్‌ మరికొందరిని ఎక్కించుకుంది. ఆ తరువాతే మొత్తం 2,240 మంది ప్రయాణికులతో న్యూయార్క్‌ వైపు ప్రయాణం ప్రారంభించింది టైటానిక్ నౌక.

ప్రమాదం జరిగింది ఇలా…

ఏప్రిల్‌ 14, 1912 ఆదివారం రాత్రి సముద్రం నిశ్చలంగా వుంది. నిర్మలమైన ఆకాశం.. చలికి గడ్డకట్టుకుపోయేంతటి కనిష్ట ఉష్ణోగ్రత. అయితే.. సముద్రంలో వున్న మంచు కొండల గురించి అప్పటికే చాలా రోజులుగు నావికుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కొన్ని నౌకలు మార్గాలను మార్చుకుని ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. మంచు కొండల గురించి వైర్‌ లెస్‌ ద్వారా సమాచారాలు అందుకుంటూ తగినట్లుగా ప్రయాణాలను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే టైటానిక్ కెప్టెన్ స్మిత్ ‌కూడా మంచుకొండల గురించిన సమాచారాన్ని అందుకున్నాడు. ఆ వెంటనే నౌకను కొద్దిగా దక్షిణ దిశగా మళ్ళించమని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాడు. ఆరోజు (ఏప్రిల్ 14) మధ్యాహ్నం 1:45 సమయానికి టైటానిక్‌ నౌక ప్రయాణించే మార్గంలో భారీ మంచు పర్వతాలు ఉండవచ్చునని అమెరికా స్టీమర్లు హెచ్చరిక చేసినట్లు కొన్ని పుస్తకాలలో పేర్కొన్నారు. అయితే ఈ హెచ్చరికలు నౌక గమనాన్ని నియంత్రించే బ్రిడ్జ్‌ గదికి చేరలేదని తెలుస్తోంది. అదే రోజు సాయంత్రం మెసాబా అనే నౌక నుంచి అలాంటి హెచ్చరికలు వచ్చినట్లు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయట పడిన కొందరు పేర్కొన్నారు. అయితే ఈ హెచ్చరికలుకూడా బ్రిడ్జి గదికి చేరలేదని తెలుస్తోంది.

రాత్రి 11:40 సమయంలో న్యూఫౌండ్‌ లాండ్స్ ‌వద్ద గల గ్రాండ్‌ బ్యాంక్స్‌లోకి టైటానిక్ పడవ ఎంటరయ్యింది. టైటానిక్‌కు ముందు భాగంలో ఫ్రెడెరిక్ ఫ్లీట్ మార్గంలో వున్న అడ్డంకులను గురించి టైటానిక్ డ్రైవింగ్ సిబ్బందికి ఫ్రెడెరిక్ ఫ్లీట్ నుంచి హెచ్చరికలు వస్తుంటాయి. ఈక్రమంలోనే టైటానిక్‌‌కు ఎదురుగా పెద్ద మంచు పర్వతాన్ని కనుగొన్నాడు రెజినాల్డ్‌ లీ. కుడి వైపు మంచు పర్వతముందని చెబుతూ బ్రిడ్జి గదికి వెళ్ళే గంటను మోగించడంతో నౌకను ఉన్నపళంగా ఎడమ వైపుకు మళ్ళించమని నౌకాధికారి ముర్డోక్‌ ఆదేశాలు జారీ చేస్తాడు. ఈ క్రమంలోనే ఇంజన్‌ ఒక్కసారి ఆగి పోయి మళ్ళీ తిరిగి పని చేయడం ఆరంభిస్తుంది. దాంతో టైటానిక్ నౌక మరోసారి వేగాన్ని పుంజుకుంటుంది. అదే వేగంతో టైటానిక్ ఓడ.. మంచు పర్వతాన్ని గుద్దుకుంటుంది. ఈ ఘటనలో నౌక కుడి భాగం వైపు 300 అడుగుల పొడవు రాపిడికి గురవుతుంది. దాంతో నౌక రివెట్లు బయటపడతాయి. వీటి గుండా సముద్రపు నీరు టైటానిక్ లోకి వచ్చేస్తుంటుంది. ముందుభాగపు గదులన్నీ నీటితో నిండిపోతాయి. తలుపులు వాటంతట అవే మూసుకుపోతాయి. నాలుగు కంపార్ట్‌మెంట్లు నీటితో నిండిపోతాయి. క్రమంగా నీరు మిగతా గదులు, కంపార్టుమెంట్లకు విస్తరిస్తుంది. టైటానిక్‌ ప్రమాదాన్ని గుర్తించి బ్రిడ్జ్‌ గదిలోకి వచ్చి నౌకను పూర్తిగా ఆపివేయమని కెప్టెన్‌ స్మిత్‌ ఆదేశిస్తాడు. ఏప్రిల్‌ 14 అర్ధరాత్రి తరువాత ఘటనను పరీశీలించాలని ఆదేశాలిస్తాడు. అదేసమయంలో లైఫ్‌ బోట్లను సమాయత్త పరచమని థామస్‌ ఆండ్రూస్‌, ఇతర నౌకాధికారులు ఆదేశాలు జారీ చేస్తారు. నౌక ప్రమాదానికి గురైన క్రమంలో 12 మంది ప్రయాణికులతో తొలి లైప్ బోటు కిందకు దిగుతుంది. ఐదవ నంబరు బోటు రెండు మూడు నిమిషముల తర్వాత దిగడం మొదలవుతుంది. ఈ లైఫ్ బోట్ల సాయంతో మొత్తం 1178 మంది కిందకు దిగినప్పటికీ అందులో కూడా చాలా మంది మరణించారు. నౌకలో 885 మంది సిబ్బంది ఉండగా… అందులో 212 మంది బతికి బయటపడ్డారు.

వైర్‌లెస్‌ ఆపరేటర్లు జాక్‌ ఫిలిప్స్‌, హరాల్డ్‌ బ్రైడ్‌ ప్రమాద సంకేతాలను నలుదిక్కులకు పంపించడం ప్రారంభిస్తారు. మౌంట్‌ టెంపుల్‌, ఫ్రాంక్‌ఫర్ట్‌, టైటానిక్‌ సోదర నౌక ఒలంపిక్‌ వంటి చాలా నౌకలకు సమాచారం అందినా సమయానికి అవి చేరుకోలేకపోతాయి. ప్రమాద ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్న నౌక కునార్డ్‌ లైన్స్‌‌కి చెందిన కర్పతియా నౌక కానీ.. మంచు కొండలు అడ్డు రావడంతో ఈ నౌక నిదానంగా ప్రయాణించి టైటానిక్ ప్రమాద ప్రాంతానికి చేరుకుంటుంది. ఈలోగానే నౌక రెండు ముక్కలై మునిగిపోవడం.. తప్పించుకునేందుకు లైఫ్ బోట్లలోకి దిగిన వారిలోను చాలా మంది మరణించడం జరిగిపోతుంది. మునిగిపోతున్న టైటానిక్‌ నుంచి పంపించిన ఎమర్జెన్సీ సందేశాన్ని కొన్ని నౌకలతో పాటు ఓ భూమ్మీద వున్న వైర్‌లెస్ స్టేషన్‌ కూడా అందుకుంటుంది. న్యూఫౌండ్‌ల్యాండ్‌లో వున్న క్యాప్‌ రేస్‌ కేంద్రానికి టైటానిక్ నుంచి సంకేతాలు అందినా సమయానికి చేసేదేమీ లేకపోయింది.

అవశేషాల కోసం అన్వేషణ

టైటానిక్‌ మునిగి పోయిన కొద్ది కాలానికే దాని అవశేషాల అన్వేషణ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 1985 సెప్టెంబర్ వరకు టైటానిక్ అన్వేషణలో పెద్దగా బ్రేక్ థ్రూ లభించలేదు. 1985 సెప్టెంబర్ 1న నార్త్ అట్లాంటిక్ సముద్రంలో రెండు మైళ్ళ లోతులో టైటానిక్ అవశేషాలను వోడ్స్ హోల్ సముద్ర పరిశోధనా సంస్థ కనుగొన్నది. ఈ సంస్థకు చెందిన జీన్‌ లూయిస్‌ మైకేల్‌, రాబర్ట్‌ బల్లార్డ్‌ నేతృత్వంలోని బృందం అవశేషాలను గుర్తించింది. టైటానిక్‌ నౌకను సముద్రగర్భం నుంచి బయటకు తీసుకురావాలని ఆలోచనలు చేసింది లూయిస్‌ బృందం.

ఈ క్రమంలోనే ముంపునకు గురైన టైటానిక్ పడవ గురించి భిన్న కథనాలు బయటికి వచ్చాయి. నౌక రెండుగా విడిపోయి మునిగిపోయిందని గుర్తించారు జీన్‌ లూయిస్‌ మైకేల్‌, రాబర్ట్‌ బల్లార్డ్‌. విడిపోయిన రెండు భాగాలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో 600 మీటర్ల దూరంలో పడి ఉన్నాయని వారు వెల్లడించారు. నౌకలు రెండు విడి పోలేదని వీరికన్నా ముందు అమెరికన్‌, బ్రిటీష్‌ విచారణ బృందాలు తేల్చాయి. కాగా టైటానిక్ ప్రమాదం నుంచి బయట పడిన వారిలో చివరి వ్యక్తి మిల్విన డీన్ 2009లో ఇంగ్లాండ్‌లో మరణించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయట పడిన అత్యంత పిన్న వయస్కురాలు కూడా డీనే కావడం విశేషం. ఆమె మే 31,2009లో తన 97 ఏళ్ళ వయసులో ఇంగ్లాండ్‌లో మృతిచెందారు. టైటానిక్‌ దుర్ఘటనలోప్రాణాలతో బయటపడిన వారు 706 మంది.

టైటానిక్‌ నౌకతో గుంటూరుకు అనుబంధం..

టైటానిక్‌ నౌకలో భారతదేశం నుండి ఒకే ఒక కుటుంబం ప్రయాణించింది. వారే గుంటూరు క్రిస్టియన్ మిషనరీలో పని చేసే అలెన్ బెకర్ ఫ్యామిలీ. గుంటూరు నుండి అమెరికాకు తిరిగి వెళుతూ ఇంగ్లాండులో టైటానిక్‌ ఎక్కింది బెకర్‌ కుటుంబం. అయితే ప్రమాదం నుంచి ఈ కుటుంబం ప్రాణాలతో బయట పడింది. ఇదిలా వుంటే.. టైటానిక్ మునకపై ఇప్పటికీ భిన్న వాదనలు వినిపిస్తూనే వుంటాయి. పదిహేను వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోవడానికి చాలా కారణాలున్నాయని అంటుంటారు. కేవలం ఐస్ బర్గ్ మాత్రమే ప్రమాదానికి కారణం కాదనే వారూ వున్నారు. టైటానిక్ షిప్ యార్డులో ఉండగానే బాయిలర్‌లో మంటలు ఏర్పడ్డాయనే వాదన కూడా వుంది. దాంతో ఈ నౌక అడుగు భాగం బలహీనంగా మారిందని అంటారు. బలహీనంగా మారిన ఓడ భాగాన్ని మంచు కొండ ఢీకొనడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువైందంటారు. 300 అడుగుల ఐస్ బర్గును ఢీకొట్టి ముక్కలైందని అందరూ భావిస్తారు. కానీ అదే సమయంలో బాయిలర్‌లో ఎగిసిపడిన అగ్ని కీలలే నౌకను బలహీనంగా మార్చాయంటారు. నౌకను తయారు చేసిన కంపెనీ అధ్యక్షుడైన జె బ్రూస్‌ ఇస్మేకు టైటానిక్ పడవ బలహీనలతు ముందే తెలుసని, ఆయన ఉద్దేశపూర్వకంగానే దీనిపై ముందస్తు వార్నింగ్ ఇవ్వలేదని కొందరు అంటారు. అందుకే ప్రమాదం జరిగిన తరువాత బ్రూస్ నోరు మెదపలేదని అంటారు.

ఓడ మునక మిస్టరీపై మరో వాదన కూడా వుంది. దీనిపై ఓ పుస్తకం కూడా ముద్రితమైంది. టైటానిక్ పడవ మునగడానికి కారణం స్టీరింగ్ లోపాలని కొందరంటారు. టైటానిక్ ఓడకు సిబ్బందిగా పని చేసిన సెకండ్ ఆఫీసర్ చార్లెస్ లైటాలర్ స్వయంగా తన మనవరాలు లేడీ లూయీ పాటెన్‌కు వివరించగా.. ఆమె రాసిన ‘‘గుడ్ యాజ్ గోల్డ్’’ అనే పుస్తకంలో ఈ అంశాన్ని వివరించారు. టైటానిక్ ఓడ ప్రమాదం నుంచి బతికి బయట పడిన చార్లెస్ లైటాలర్ తన భార్యాపిల్లలతో చెప్పిన వాస్తవాలు అంటూ ఈ పుస్తకం ముద్రితమైంది. సముద్రంలో మంచు ఖండాన్ని ముందుగానే గుర్తించారని, దానిని తప్పించే క్రమంలో నౌక స్టీరింగ్‌‌లో లోపాలు తలెత్తడం వల్లనే నౌక మంచు కొండను ఢీకొందని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. స్టీర్స్‌మ్యాన్‌గా పనిచేసిన రాబెర్ట్ హిచిన్స్.. ఓడను తప్పు దిశలో పయనించేలా చేయడం వల్ల మంచు ఖండాన్ని ఢీకొందని వివరించారు.

టైటానిక్ నౌక ఆధారంగా తీసిన సినిమాలు

సేవ్డ్ ఫ్రమ్ ది టైటానిక్ (1912)
ఇన్ నాట్ అండ్ ఐజ్ (1912)
అట్లాంటిక్ (1929)
టైటానిక్ (1943)
టైటానిక్ (1953)
ఎ నైట్ టు రిమెంబర్ (1958)
టైటానిక్ (1997 సినిమా)

వీటిలో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో 1997లో విడుదలైన టైటానిక్ బహుల ప్రాచుర్యాన్ని పొందింది. ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టింది. ప్రపంచలోని పలు భాషల్లోకి అనువదించబడింది. ఇందులో నటించిన కేట్ విన్‌స్లెట్, లియోనార్డో డికాప్రియో యావత్ ప్రపంచంలో యువతకు ఆదర్శమయ్యారు. చలన చిత్ర పరిశ్రమలోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా 14 ఆస్కార్ పురస్కారాలలో 11 అవార్డులను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.

ALSO READ: తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ మావోయిస్టు టెన్షన్.. తెలంగాణలో పోలీసులు అలర్ట్.. ఏజెన్సీలోను అంతే