AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maoist Tension: తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ మావోయిస్టు టెన్షన్.. తెలంగాణలో పోలీసులు అలర్ట్.. ఏజెన్సీలోను అంతే

దట్టమైన అరణ్యం.. చుట్టూ కొండలు, గుట్టలు.. లోకల్ ట్రైబల్స్ నుంచి విపరీతమైన సపోర్టు.. ఇవే దండకారణ్యంలో మావోయిస్టు నక్సల్స్‌కు అనుకూలంగా మారాయి. స్థానిక గిరిజనుల నుంచి మద్దతు బాగా..

Maoist Tension: తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ మావోయిస్టు టెన్షన్.. తెలంగాణలో పోలీసులు అలర్ట్.. ఏజెన్సీలోను అంతే
Naxals
Rajesh Sharma
|

Updated on: Apr 10, 2021 | 6:36 PM

Share

Maoist Tension in Telugu state: దట్టమైన అరణ్యం.. చుట్టూ కొండలు, గుట్టలు.. లోకల్ ట్రైబల్స్ నుంచి విపరీతమైన సపోర్టు.. ఇవే దండకారణ్యంలో మావోయిస్టు నక్సల్స్ (MAOIST NAXALS)‌కు అనుకూలంగా మారాయి. స్థానిక గిరిజనుల నుంచి మద్దతు బాగా వుండడంతో సెక్యురిటీ ఫోర్సెస్ (SECURITY FORCES) కదలికలు ఈజీగా నక్సల్స్‌కు చేరిపోతున్నాయి. అందువల్లనే సెక్యురిటీ ఫోర్సెస్ వైపే ఎక్కువ ప్రాణనష్టం జరుగుతోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వామపక్ష (నక్సల్స్) తీవ్రవాదాన్ని కట్టడి చేయగలిగినప్పటికీ.. దండకారణ్యంలో మాత్రం సాధ్యమవడం లేదంటూ దానికి కొండలు, గుట్టలతో నిండి వున్న కీకరణ్యం కావడమే ప్రధాన కారణం. దానికి తోడు స్థానిక ట్రైబల్స్ (TRIBALS) నక్సల్స్‌కు పెద్ద ఎత్తున సపోర్టుగా నిలవడం రెండో కారణం. ఈ అనుకూలాంశాల కారణంగానే దండకారణ్యంలో మావోయిస్టులు ప్రభుత్వాలకు కొరుకుడు పడటం లేదు. మావోయిస్టుల తాజా మెరుపుదాడి నేపథ్యంలో దేశం దృష్టి ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ (CHHATTISGARH)‌లోని ఈ కీకారణ్యంపైనే దృష్టి సారించింది. దండకారణ్యంలో మావోయిస్టుల కదలిక ఇటు తెలంగాణ (TELANGANA)కు, అటు ఏపీ (AP) కి కూడా ఇబ్బందికరంగా మారుతోంది. దండకారణ్యం తెలుగు రాష్ట్రాలకు ఆనుకొని ఉండటం, అటువైపు నుంచి అవకాశం చిక్కినప్పుడల్లా మావోయిస్టులు తెలుగు ప్రాంతంలోకి జొరబడుతుండటం, అన్నింటికీ మించి కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాళ్ల కేశవరావు సహా అనేక మంది తెలుగువారే ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణపై దీని ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ అంశం తెలుగు రాష్ట్రాల పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఏప్రిల్ 3వ తేదీన తెర్రం కొండల్లో దారుణంగా దాడి చేసి 24 మంది వీర జవాన్లను బలితీసుకున్న మావోయిస్టులిపుడు శాంతి మంత్రం వల్లించడంపై భిన్నరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత పదేళ్ళ కాలంలో పలు గెరిల్లా దాడులతో వందలాది మంది సెక్యురిటీ ఫోర్సెస్‌ని పొట్టన పెట్టుకున్న మావోయిస్టులు ఇపుడు ఒక పోలీసు కమాండర్ (POLICE COMMANDER) విడుదలకు చర్చల ప్రస్తావన తీసుకురావడం విచిత్రంగా వుందని కొందరంటుంటే.. మరికొందరు జవాన్ కుటుంబం కోసం ప్రభుత్వం తక్షణమే మధ్యవర్తిని నియమించి మావోయిస్టులతో సంప్రదింపులు జరపాలని అంటున్నారు. అయితే.. తాజా పరిణామాల నేపథ్యం ఒకవైపు.. గత 17 సంవత్సరాలుగా (పీపుల్స్ వార్ గ్రూపు (PEOPLE’S WAR GROUP), మావోయిస్టు సెంటర్ (MAOIST CENTER) కలిసి సీపీఐ (మావోయిస్టు)గా మారిన తర్వాత నుంచి) మితి మీరిన హింసాత్మక చరిత్ర మరోవైపు వెరసి చర్చలకు ఆస్కారముందా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి.

గతంలో 2012లో ఛత్తీస్ గఢ్‌లో ఐఏఎస్ అధికారి అలెక్స్ పాల్ మీనన్ (IAS OFFICER ALEX PAUL MENON)‌ను అపహరించిన సందర్భంలోను మావోయిస్టులు చర్చలకు రెడీ అయ్యారు. అప్పుడు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం (CHHATTISGARH GOVERNMENT) కాకుండా కేంద్ర ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగి, మావోయిస్టులతో చర్చలు జరిపింది. చర్చలు విజయవంతమవడంతో మావోయిస్టులు అలెక్స్ పాల్‌ను విడుదల చేశారు. 2017లో సుక్మా జిల్లాలోని కిస్తారాం ప్రాంతంలో కెనడియన్ జాతీయుడు జాన్ స్లాజాక్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.

అయితే.. మావోయిస్టులు అంతమయ్యారని, అక్కడా ఇక్కడా ఏరి వేసినట్లుగానే మావోయిస్టు ఉద్యమం వుందని పలు మార్లు చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ భీషణ ప్రకటనలు చేశారు. ఇలా ప్రకటనలు వెలువడిన ప్రతీసారి మావోయిస్టులు తమ అస్తిత్వాన్ని చాటుకునేందుకు పెద్ద ఎత్తున దాడులకు తెగబడుతూనే వున్నారు. పదుల సంఖ్యలో భద్రతా బలగాల సిబ్బందిని బలితీసుకుంటూనే వున్నారు. శాంతి చర్చల విషయంపై గతంలో ఏం జరిగిందని పరికిస్తే.. చర్చలు మావోయిస్టులకే ఉపయోగపడినట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మావోయిస్టులు బలపడ్డారన్న విషయం తాజా దాడితో తేటతెల్లమైంది. ముఖ్యమంత్రి బఘేల్ ప్రకటనల్లో డొల్లతనం తాజా దాడితో బయటపడింది.

గత 40 ఏళ్లుగా బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 3,200కు పైగా ఎదురుకాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. జనవరి 2001 నుంచి 2019 మే వరకు 1,002 మంది మావోయిస్టులు మృతి చెందగా.. వివిధ ఘటనల్లో 1,234 మంది భద్రతా సిబ్బంది తమ విధి నిర్వహణలో అసువులు బాసారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన పలు కాల్పుల ఉదంతాలలో 1782 మంది సాధారణ జనం కూడా మరణించడం విషాదం. ఈ క్రమంలోనే 3,896 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. గత సంవత్సరం కరోనా కాలంలోను పలు మార్లు ఎన్‌కౌంటర్లు జరిగాయి. 2020 నవంబర్ 30 నాటికి ఆ సంవత్సరంలో 31 మంది మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. 270 మామావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసుల రికార్డులు (POLICE RECORDS) చెబుతున్నాయి.

అటు ప్రభుత్వం, ఇటు మావోయిస్టులు పలు సందర్భాలలో పరస్పరం చర్చలకు సిద్దమని ప్రకటనలు చేస్తూనే వున్నారు. కానీ చర్చలపై ఇరు పక్షాలకు పెద్దగా ఆసక్తి ఉన్నట్లు గత ఉదంతాల ద్వారా అర్థమవుతోంది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను అంతకు ముందు ఇచ్చిన హామీ మేరకు నక్సల్స్‌తో చర్చలకు సిద్దపడ్డారు. హైదరాబాద్ గ్రీన్ ల్యాండ్స్ గెస్ట్ హౌజ్ వేదికగా నక్సల్స్‌తో వైఎస్ ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితేనేం ఆ చర్చలు పెద్దగా ఫలించలేదు. సరికదా.. ఆ తర్వాత కొంత కాలానికే మావోయిస్టులగా మారిన నక్సల్స్ మరింతగా హింసా మార్గాన్ని అనుసరించారు. దాంతో ఉభయ పక్షాలు చర్చలను అంత సీరియస్‌గా తీసుకోవడం లేదని బోధపడుతోంది.

ఏజెన్సీలో అటెన్షన్‌

చత్తీస్ గఢ్‌లో ఎన్‌కౌంటర్ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాల పోలీసులు (POLICE OF TELUGU STATES) అలెర్ట్ అయ్యారు. గతంలో పంచాయతీ ఎన్నికలను మావోయిస్టులు బహిష్కరించారు. అయినా సరే పోటీలో నిలిచిన ఒక అభ్యర్థి దంపతులను తీవ్రంగా కొట్టిన సంగతి తెలిసిందే. ఆతర్వాత టీడీపీ నేత, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను కాల్చి చంపారు. ఇప్పుడు ఇదే తరహా ఘటనలు ఏపీలో జరుగుతాయా అనే చర్చ సాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఏపీలోకి మావోయిస్టులు ప్రవేశించారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఏజెన్సీ గ్రామాల్లో వైసీపీ ప్రజాప్రతినిధులకు టెన్షన్‌ పట్టుకుంది. పరిషత్‌ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. బయట తిరగాలంటేనే భయపడుతున్నారు. మరోవైపు పోలీసులకు నేతలకు జాగ్రత్తలు చెబుతున్నారు. కొద్ది రోజుల పాటు మారు మూల ప్రాంతాలకు వెళ్లక పోవడమే మంచిదని చెబుతున్నారు.

దేశంలో గత పదేళ్లలో వామపక్ష తీవ్రవాదం తాలూకూ హింస చాలావరకూ తగ్గింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 2010లో దేశంలో వామపక్ష తీవ్రవాదానికి సంబంధించి 2,213 హింసాత్మక ఘటనలు జరగ్గా 1,005 మంది మరణించారు. 2019 నాటికి ఘటనలు 670కి, మరణాలు 202కి తగ్గాయి. అప్పట్లో మొత్తం పది రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉండగా ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌ మినహా మిగతా రాష్ట్రాల్లో వామపక్ష కార్యకలాపాలు నామమాత్రంగానే ఉన్నాయి. తీవ్రవాదంపై పోరులో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యకలాపాలు చాలా పరిమితమయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లో 2010లో 625 ఘటనలు, 343 మరణాలు సంభవిస్తే 2019 నాటికి అవి వరుసగా 263, 77కు చేరుకున్నాయి. ఇక్కడ పరిస్థితి అదుపులోకి రాకపోవడానికి ప్రధాన కారణం దండకారణ్యమే. దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టింది. మిగతా రాష్ట్రాల నుంచి బలగాలను ఉపసంహరించి ఛత్తీస్‌గఢ్‌కు పంపుతోంది. దండకారణ్యంలో పరిస్థితి అదుపులోకి రాకపోతే దీని ప్రభావం మిగతా రాష్ట్రాలపైనా ఉంటుందనడంలో సందేహం లేదు.

ఒక్కమాటలో చెప్పాలంటే దేశంలో వామపక్ష తీవ్రవాదం ప్రభావం ఎలా ఉందో చెప్పడానికి దండకారణ్యమే కొలమానంగా మారింది. తమకు పెట్టనికోటలా మారిన ఈ అరణ్యంలో తిష్టవేసిన మావోయిస్టులు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా ఇటీవలి ఘటన తరహాలో మెరుపుదాడులకు దిగుతున్నారు. మిగతా రాష్ట్రాల్లోకి చొచ్చుకెళ్లడంతోపాటు ఆయా రాష్ట్రాల క్యాడర్‌ను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్త నియామకాలపై దృష్టి పెట్టి, ఆకర్షితులైన వారికి శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆదెల్లు అలియాస్‌ భాస్కర్‌ నియామకాల కోసమే ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చాలాకాలం సంచరించాడు. పోలీసులు అప్రమత్తమయ్యే సరికి మళ్లీ దండకారణ్యంలోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌ వైపు నుంచి ఎప్పుడైనా ముప్పు ముంచుకు రావచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. సరిహద్దుల్లో నిరంతరం కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. వామపక్ష తీవ్రవాదం కట్టడిలో అనుభవం ఉన్న సిబ్బందిని ఇక్కడ ప్రత్యేకంగా నియమించారు. అయితే ఇవన్నీ ముందు జాగ్రత్త చర్యలుగానే పనికి వస్తాయి తప్ప ముప్పుని పూర్తిస్థాయిలో నివారించలేవనే భావన వ్యక్తమవుతోంది.

ALSO READ: ఆ విషాద ఘటనకు త్వరలో 109 ఏళ్ళు.. ఆ ఓడతో గుంటూరు జిల్లాకు లింకు? ఏంటో అది?