డీఎంకే పార్టీకే పట్టం కట్టబోతున్న తమిళనాడు ప్రజలు, అన్నా డీఎంకేకు అత్తెసరు సీట్లు
ఎగ్జిట్ పోల్స్ నిజమవ్వాలని రూలేమి లేదు. అలాగని కొట్టిపారేయ్యడానికి వీల్లేదు.. తమిళనాడు అసెంబ్లీ పోలింగ్ ముగిసిన తర్వాత చేసిన సర్వే ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది..
ఎగ్జిట్ పోల్స్ నిజమవ్వాలని రూలేమి లేదు. అలాగని కొట్టిపారేయ్యడానికి వీల్లేదు.. తమిళనాడు అసెంబ్లీ పోలింగ్ ముగిసిన తర్వాత చేసిన సర్వే ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.. తమిళనాడు ప్రజలు డీఎంకే పార్టీకే పట్టం కట్టబోతున్నట్టు సర్వేలు అంటున్నాయి. మెజారిటీ ప్రజలు ఉదయిస్తున్న సూర్యుడి గుర్తుకే ఓటేసినట్టు చెబుతున్నాయి. అధికారంలో ఉన్న అన్నాడీఎంకేకు అత్తెసరు సీట్లు కట్టబెట్టబోతున్నారట! ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే బీజేపీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాదట! తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 70 శాతం పోలింగ్ అయ్యింది.. పట్టణ ప్రాంతాలలో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పోలింగ్ ఎక్కువగా జరిగింది. ఈ ఓటింగ్ సరళి చూస్తుంటే డీఎంకే అధికారంలోకి రావడం పక్కా అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలలో డీఎంకే ఈజీగా 180 స్థానాలు గెల్చుకుంటుందని ఐ బ్యాక్ సంస్థ చెబుతోంది. పోలింగ్ రోజున డీఎంకే అధినేత స్టాలిన్ చెన్నైలో ఉన్న ఐ ప్యాక్ సంస్థ కార్యాలయాలని వెళ్లడం గమనార్హం. సర్వే ఫలితాలను చూసి స్టాలిన్‌లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఎలాగూ గెలుస్తామన్న ధీమాతో ఆయన డీఎంకే అభ్యర్థులను చెన్నైకు పిలిపించుకుంటున్నారు.. జిల్లా కార్యదర్శులు కూడా స్టాలిన్‌ను కలిసి వెళుతున్నారు. అప్పుడే మంత్రి పదవులు, శాఖల కేటాయింపులపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అలాగే పలువురు ఐఏఎస్ అధికారులు స్టాలిన్‌ను కలిసి ముందస్తు శుభాకాంక్షలు కూడా చెప్పారట! మరోవైపు పోలింగ్ తర్వాత అన్నాడీఎంకే క్యాడర్‌లో నిరుత్సాహం ఆవరించింది. నాయకులు డీలా పడ్డారు. ఎన్నికలన్నాక గెలుపోటములు సహజమేనన్న భావన ముఖ్యమంత్రి పళనిస్వామిలో ఏర్పడిందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. సేలం జిల్లా సూరమంగళంలోని తన ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారట! అన్నాడీఎంకే పార్టీకి 20 నుంచి 30 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే చెబుతోంది. ఇది నిజమో కాదో మే 2న తేలిపోతుంది.
మరిన్ని ఇక్కడ చదవండి: అలర్ట్.. స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారా ? అయితే మీకు ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువే.. ఎంటో తెలుసా..
China: ఈ కామర్స్ దిగ్గజం అలీబాబాకు సంస్థకు చైనా షాక్.. భారీ జరిమానా.. ఎందుకంటే..