AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news : వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తిరుపతి ఎంపీ బైపోల్‌ ప్రచార పర్యటన రద్దు.. బహిరంగ లేఖ రాసిన ముఖ్యమంత్రి

AP CM YS jagan Tirupati campaign సీఎం జగన్మోహన్‌ రెడ్డి తిరుపతి ప్రచారం పర్యటన రద్దైంది.

Breaking news : వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తిరుపతి ఎంపీ బైపోల్‌ ప్రచార పర్యటన రద్దు.. బహిరంగ లేఖ రాసిన ముఖ్యమంత్రి
Ys Jagan
Venkata Narayana
|

Updated on: Apr 10, 2021 | 4:18 PM

Share

AP CM YS jagan Tirupati campaign సీఎం జగన్మోహన్‌ రెడ్డి తిరుపతి ప్రచార పర్యటన రద్దైంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తన పర్యటన రద్దు చేసుకున్నారు ముఖ్యమంత్రి జగన్‌. ఈ మేరకు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. తిరుపతి పార్లమెంట్‌ ఓటర్లకు మీ జగన్‌ రాస్తున్న లేఖంటూ ప్రారంభించిన ముఖ్యమంత్రి… తిరుపతి పార్లమెంట్‌ బై పోల్‌ లో మనందరి అభ్యర్థిగా పోటీ చేస్తోన్న గురుమూర్తికి ఓటు వేయాల్సిందిగా నేను రాసిన ఉత్తరం మీ ఇంటికి అందిందని భావిస్తున్నాను.. అంటూ తన పర్యటన రద్దు కావడానికి గల కారణాలను కూడా జగన్‌ తన లేఖలో తిరుపతి ఓటర్లకు వివరించారు.

కాగా, ఈనెల 8వ తేదీ గురువారం తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఓటర్ల ఇంటింటికీ సీఎం జగన్ లేఖలు పంపిన సంగతి తెలిసిందే. ఎంపీ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి ఈ లేఖలు పంపారు. సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా జరిగిన లబ్ధిని లేఖలో వివరించారు. రాష్ట్రాభివృద్ధి, వాగ్దానాల అమలు, ప్రభుత్వ దార్శనికతను సీఎం ఆ లేఖలో ప్రస్తావించారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా ఆ నియోజకవర్గంలోని కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా లేఖలు రాశారు. అయితే, ఇప్పుడు పర్యటన రద్దు అవుతున్నట్టు తాజాగా మరో లేఖ రాశారు జగన్‌.

ఇవాళ్టి లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది:

ఈ నెల 14న తిరుపతి బహిరంగ సభకు నేను వస్తానని ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఆ సభకు రావటం ద్వారా మీ ఆత్మీయతను, అనురాగాన్ని ప్రత్యక్షంగా అందుకోవాలని భావించాను. అయితే తాజా హెల్త్ బులెటిన్ చూసిన తరవాత ఈ లేఖ రాస్తున్నాను దేశంతోపాటు రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. నిన్నటి బులెటిన్ ప్రకారం 24 గంటల్లో రాష్ట్రంలో 31,892 శాంపిల్స్ పరీక్షిస్తే అందులో 2,765 మంది పాజిటివ్ అని తేలింది. పాజిటివిటీ రేటు 8.67 శాతంగా కనిపిస్తోంది. ఇది మన రాష్ట్ర సగటు పాజిటివిటీ రేటు అయిన 5.87 శాతం కంటే ఎక్కువగా పెరిగిన విషయం కనిపిస్తోంది. అందులో 496 ‌తో చిత్తూరులో అత్యధిక కేసులు నమోదయ్యాయి. నెల్లూరులో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన కేసులు ఒక్క రోజులోనే 292 నమోదయ్యాయి.

గంటల వ్యవధిలో మరణించిన 11 మందిలో నలుగురు చిత్తూరు, నెల్లూరు జిల్లాల వారు ఈ రెండు జిల్లాల్లో ఉన్న తిరుపతి పార్లమెంటులో నేను వ్యక్తిగతంగా బహిరంగ సభకు హాజరైతే… అభిమానంతో, ఆప్యాయతతో వేలాదిగా తరలి వస్తారు. వీరందరూ నాకు ముఖ్యమే, వీరంతా నావాళ్ళే. వీరందరి ఆరోగ్యం, ఆనందం నాకు ముఖ్యమే. వీరందరి కుటుంబాలూ చల్లగా ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తిగా… బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా, ఒక బాధ్యతగల స్థానంలో ఉన్న ఒక అన్నగా ఒక తమ్ముడిగా తిరుపతిలో నా బహిరంగ సభను రద్దు చేసుకుంటున్నాను.

నేను వ్యక్తిగతంగా వచ్చి బహిరంగ సభలో పాల్గొని ప్రచారం చేసి మిమ్మల్ని ఓటు అడగకపోయినా, మనందరి ప్రభుత్వం మీ పిల్లల కోసం, మన అవ్వాతాతల కోసం, మన అక్కచెల్లెమ్మల కోసం, మన రైతుల కోసం, మన గ్రామాలూ పట్టణాల కోసం…..

మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరుల కోసం… మన అక్కబెల్లెమ్మల కోసం ఏం చేసిందన్నది మీ అందరికీ వివరిస్తూ, ప్రతి కుటుంబంలోని ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు వ్యక్తిగతంగా… మీకు కలిగిన లబ్దికి సంబంధించిన వివరాలతో… నా సంతకంతో ఇంటింటికీ అందేలా ఉత్తరం రాశాను. మీ అందరి కుటుంబాల శ్రేయస్సు దృష్ట్యా నేను రాకుండా ఆగిపోయినా మనందరి ప్రభుత్వం ఈ 22 నెలల్లో ఇంటింటికీ మనిషి మనిషికి చేసిన మంచి మీ అందరికీ చేరిందన్న నమ్మకం నాకుంది

మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి నిండు మనసుతో, గుండెనిండా ప్రేమతో, రెట్టింపయిన నమ్మకంతో మీ అందరి చల్లని దీవెనలను ఓటు రూపంలో ఇస్తారని, మనందరి అభ్యర్థి, నా సోదరుడు డాక్టర్ గురుమూర్తిని.. గతంలో బల్లి దుర్గాప్రసాద్ అన్నకు ఇచ్చిన మెజారిటీ (2.28 లక్షల) కన్నా ఇంకా ఎక్కువగా… ఫ్యాన్ గుర్తుమీద ఓట్లు వేస్తారని, ప్రతి ఒక్కరూ మరో నలుగురితో మన అభ్యర్థి గురుమూర్తిని తిరుగులేని మెజారిటీతో గెలిపించేలా ఓట్లు వేయిస్తారని ఆశిస్తూ.. అభ్యర్థిస్తూ దేవుడి ఆశీస్సులు మీ అందరి కుటుంబాలకూ, మనందరి ప్రభుత్వానికి కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను.

ఇట్లు

మీ సోదరుడు

మీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు,

మీ ముఖ్యమంత్రి

మీ.. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

Jagan Letter 1