Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రాజీనామా.. స్పీకర్‌కు ఇమెయిల్..
గురువారం తన రాజీనామా లేఖను పార్లమెంటరీ స్పీకర్‌కు ఇమెయిల్ చేశారు. బుధవారం తన భార్యతో కలిసి శ్రీలంక నుంచి పారిపోయిన రాజపక్సేకు వ్యక్తిగత పర్యటన నిమిత్తం సింగపూర్‌లో..
శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రాజీనామా చేశారు. గురువారం తన రాజీనామా లేఖను పార్లమెంటరీ స్పీకర్‌కు ఇమెయిల్ చేశారు. బుధవారం తన భార్యతో కలిసి శ్రీలంక నుంచి పారిపోయిన రాజపక్సేకు వ్యక్తిగత పర్యటన నిమిత్తం సింగపూర్‌లో ప్రవేశానికి అనుమతి లభించింది. సింగపూర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, రాజపక్సే ఆశ్రయం కోరలేదు లేదా అతనికి ఆశ్రయం ఇవ్వలేదని సింగపూర్ వెల్లడించింది. మాల్దీవుల్లోని మాలేలో ఒకరోజు గడిపిన రాజపక్సే సింగపూర్ చేరుకున్నారు. అతను ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. జూలై 13 రాత్రికి తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపాలని భావించారు.. కానీ అలా చేయడంలో విఫలమయ్యారు.
ఇదిలావుండగా, ఆయన రాజీనామాకు పిలుపునిస్తూ నిరసనకారులు బుధవారం ప్రధాని కార్యాలయాన్ని ముట్టడించడంతో ప్రభుత్వం కొలంబో జిల్లాలో జూలై 14 మధ్యాహ్నం 12 నుండి జూలై 15 ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. వచ్చే వారం పార్లమెంటు కొత్త పూర్తికాల అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది. పార్టీ మొదటి ఎంపికగా విక్రమసింఘే అని అధికార పార్టీ మూలం రాయిటర్స్‌కి తెలిపింది.
గొటబయ రాజీనామా చేయడంతో శ్రీలంకలో సంబరాలు మొదలయ్యాయి. ఆనందంతో రోడ్లపైకి వస్తున్నారు జనాలు.
తాత్కాలిక అధ్యక్షుడికి వ్యతిరేకంగా నిరసనలు..
ఇటీవల శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టినప్పటికి ఆందోళనకారులు శాంతించడం లేదు. రణిల్ విక్రమసింఘే తీరుపై కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రణిల్ సైతం రాజపక్స లాగే విదేశాలకు వెళ్లిపోతారని ప్రచారం జరుగుతోంది. ప్రధాని కార్యాలయాన్ని ఆక్రమించారు ఆందోళనకారులు.
పరిస్థితిని అదుపు చేయడానికి ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని సైన్యానికి అధికారమించ్చారు విక్రమసింఘే. శ్రీలంలో శాంతియుత అధికార మార్పిడికి కొన్ని ఫాసిస్ట్ శక్తులు అడ్డుపడుతున్నాయని- తాత్కాలిక దేశాధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే విమర్శించారు. పరిస్థితులు చక్కబడేందుకే ఎమర్జెన్సీతోపాటు కర్ఫ్యూని ప్రకటించినట్లు ప్రత్యేక వీడియో సందేశంలో చెప్పారాయన. అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకోసం అన్నిపార్టీల నేతలు సమావేశం అవుతున్నట్లు రణిల్ విక్రమసింఘే చెప్పారు.