Nusrat Mirza Row: ఐఎస్‌ఐ ఏజెంట్‌ నుస్రత్‌ మిర్జాతో సంబంధాలు లేవు.. స్పష్టం చేసిన మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ

పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్‌ నుస్రత్‌ మిర్జాతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ. తాను ఎప్పుడు మిర్జాను భారత్‌కు ఆహ్వానించలేదని , సమావేశం కాలేదని కూడా తేల్చి చెప్పారు.

Nusrat Mirza Row: ఐఎస్‌ఐ ఏజెంట్‌ నుస్రత్‌ మిర్జాతో సంబంధాలు లేవు.. స్పష్టం చేసిన మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ
Nusrat Mirza Row
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 13, 2022 | 9:09 PM

బీజేపీపై విరుచుకుపడ్డారు మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ. పాక్‌ జర్నలిస్ట్‌ , ఐఎస్‌ఐ ఏజెంట్‌ నుస్రత్‌ మిర్జాతో ఎలాంటి సంబంధాలు లేవన్నారు అన్సారీ. నుస్రత్‌ మిర్జాను ఎప్పుడు భారత్‌కు ఆహ్వానించలేదని, సమావేశం కాలేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌ తొత్తుగా ఎప్పుడు వ్యవహరించలేదన్నారు హమీద్‌ అన్సారీ. నుస్రత్‌ మిర్జా ఐఎస్‌ఐ ఏజెంట్‌ అని భారత నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్‌కు భారత రాయబారిగా ఉన్నప్పుడు దేశ ప్రయోజనాలు దెబ్బతినేలా వ్యహరించినట్టు నిఘా సంస్థ రా చేస్తున్న ఆరోపణల్లో కూడా నిజం లేదన్నారు.

బీజేపీ నేతలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు హమీద్‌ అన్సారీ . పాకిస్తాన్‌కు ప్రయోజనాలు చేకూర్చినట్టు ఆధారాలు చూపించాలని డిమాండ్‌ చేశారు. ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు తాను నుస్రత్‌ మిర్జాను భారత్‌కు ఆహ్వానించలేదని , ఢిల్లీలో ఆయనతో సమావేశం కాలేదని స్పష్టం చేశారు హమీద్‌ అన్సారీ . విదేశాంగశాఖ సూచించిన వ్యక్తులతోనే ఉపరాష్ట్రపతి సమావేశమవుతారని . స్వయంగా ఎవరిని ఆహ్వానించరని అన్సారీ తెలిపారు. ఉగ్రవాదంపై నిర్వహించిన సదస్సుకు మాత్రమే తాను హాజరైనట్టు స్పష్టం చేశారు.

ఇరాన్‌లో భారత రాయబారిగా కూడా అప్పట్లో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం సూచించినట్టే నడుచుకుంటన్నట్టు స్పష్టం చేశారు. నుస్రత్‌ మిర్జా జర్నలిస్ట్‌ ముసుగులో ఉన్న ఐఎస్‌ఐ ఏజెంటని బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. యుపీఏ అధికారంలో ఉన్నప్పుడు మిర్జా ఐదుసార్లు భారత్‌లో పర్యటించాడని కూడా ఆరోపించారు. అప్పట్లో ఉపరాష్ట్రపతిగా ఉన్న హమీద్‌ అన్సారీ ఆహ్వానం మేరకే నుస్రత్‌ మిర్జా భారత్ వచ్చాడని ఆరోపించారు. భారత్‌కు చెందిన కీలక సమాచారాన్ని ఐఎస్‌ఐకి మిర్జా చేరవేశాడని కూడా బీజేపీ ఆరోపించింది. దీనికి కాంగ్రెస్‌తో పాటు హమీద్‌ అన్సారీ జవాబు చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదని అటు కాంగ్రెస్‌ నేతలు , ఇటు హమీద్‌ అన్సారీ స్పష్టం చేస్తున్నారు.

జాతీయ వార్తల కోసం