Monkeypox Virus: భయాందోళన కలిగిస్తున్న మరో కొత్త వైరస్.. ఇది ఎలా వ్యాపిస్తుంది..? ఎలాంటి లక్షణాలు
Monkeypox Virus: గత రెండేళ్లకుపైగా కరోనా మహమ్మారి ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటే.. తర్వాత కొత్త కొత్త వైరస్‌లు వ్యాప్తి చెంది మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి..
Monkeypox Virus: గత రెండేళ్లకుపైగా కరోనా మహమ్మారి ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటే.. తర్వాత కొత్త కొత్త వైరస్‌లు వ్యాప్తి చెంది మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. చైనాలో పుట్టిన కరోనా వైరస్ (Coronavirus)తో ప్రపంచ దేశాలు పోరాడుతున్నాయి. ఇప్పుడు మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. బ్రిటన్‌లో మంకీపాక్స్ వైరస్ కేసు నమోదైంది. ఈ వైరస్ ఎలుకల నుంచి సోకిన జీవుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ నిర్ధారణ అయిన వ్యక్తి ఇటీవల నైజీరియా నుండి వచ్చాడు. అటువంటి పరిస్థితిలో ఈ వైరస్ కూడా అక్కడి నుండి వచ్చినట్లు భావిస్తున్నారు.
నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మంకీపాక్స్ ఒక అరుదైన వైరస్. దానితో బాధపడుతున్న వ్యక్తిలో ఫ్లూ లక్షణాలు కనిపించాయి. ఒకరి పరిస్థితి మరింత దిగజారితే అతను న్యుమోనియా బారిన పడతాడు. దద్దుర్లు శరీరం, ముఖం అంతటా కనిపించడం ప్రారంభమవుతాయి. ఈ కేసు నమోదు కావడంతో బ్రిటన్ హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అప్రమత్తమైంది. మంకీపాక్స్ అరుదైన వైరస్ అని, ఇది అంత తేలికగా వ్యాపించదని ఏజెన్సీ చెబుతోంది. ఈ వైరస్‌పై అధ్యయనం చేశామని ఏజెన్సీ తెలిపింది. దీని లక్షణాలు చిన్నవి. ఈ వైరస్ బారిన పడితే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. గతేడాది జులైలో అమెరికాలోని టెక్సాస్‌లో ఓ వ్యక్తికి ఈ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
మంకీపాక్స్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం:
మంకీపాక్స్ మొదటి కేసు కనుగొనబడినప్పటి నుండి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు UK ఆరోగ్య అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందని, ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి పరిస్థితి బాగా లేదని చెబుతున్నారు. దీంతో ఆయనతో పరిచయం ఉన్న వ్యక్తులపై ఆరా తీస్తున్నారు. వైరస్ సోకిన వ్యక్తితో పరిచయం ఉన్న వ్యక్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
అయితే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అమెరికాలో అరుదైన మంకీ పాక్స్ వ్యాధి బయటపడింది. కొన్ని రోజుల క్రితం నైజీరియా నుంచి తిరిగొచ్చిన టెక్సాస్‌కి చెందిన ఓ వ్యక్తిలో ఈ వ్యాధి బయటపడింది. ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో అతన్ని ఐసోలేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం అతని కాంటాక్ట్స్‌ని గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. అతనితో పాటు విమాన ప్రయాణం చేసిన వారి జాబితాను పరిశీలిస్తున్నారు అధికారులు. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) ఈ వివరాలు వెల్లడించింది.
చివరి సారిగా 2003లో అమెరికాలో ఈ మంకీ పాక్స్ కేసులు బయట పడ్డాయి. అప్పట్లో 47 మందికి ఈ వైరస్ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. మిడ్‌వెస్ట్ ప్రాంతంలోని పెంపుడు కుక్కల్లో ఈ వైరస్ ఆనవాళ్లను ఉన్నట్లు గుర్తించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మంకీ పాక్స్ కేసు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల సాధారణ ప్రజలకు ఎటువంటి ముప్పు లేదని అమెరికా అధికారులు చెబుతున్నారు. అధికారుల వివరాల ప్రకారం.. 100లో ఒకరికి మాత్రమే ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో దీని ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి