పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు.. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడి చేసే అవకాశం

హమాస్‌ చీఫ్‌ హనియా తరువాత పశ్చిమాసియా బాంబు పేలుళ్లు , మిస్సైల్‌ దాడులతో దద్దరిల్లుతోంది. రానున్న 24 గంటల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి చేసే అవకాశాలున్నాయి. ఇజ్రాయెల్‌ క్షిపణి దాడిలో 20 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లో పాలస్తీనా యువకుడు జరిపిన కత్తి దాడిలో ఇద్దరు చనిపోయారు.

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు.. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడి చేసే అవకాశం
Iran Israel Conflict
Follow us

|

Updated on: Aug 04, 2024 | 6:25 PM

పశ్చిమాసియా మిస్సైళ్ల దాడులు, బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. రానున్న 24 గంటల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి. హమాస్‌ చీఫ్‌ హనియా హత్యకు ప్రతీకారంగా ఇరాన్‌, దాని మిత్రదేశాలు ఇజ్రాయెల్‌పై ఏ క్షణమైనా దాడి చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌‌ అప్రమత్తమైంది. ఇజ్రాయెల్‌కు అండగా అమెరికా కూడా బరి లోకి దిగింది.

పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ బలగాల క్షిపణి దాడులు

పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ బలగాల క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. దిర్‌ ఎల్‌ బలా ప్రాంతం లోని అల్‌ అక్సా ఆస్పత్రిపై క్షిపణి దాడిలో ముగ్గురు చనిపోయారు. 18 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇజ్రాయెల్‌ బలగాలు అమాయకులను టార్గెట్‌ చేస్తున్నాయని పాలస్తీనా ఆరోపించింది. అంతకుముందు గాజా సిటీ లోని స్కూల్‌పై జరిగిన మిస్సైల్‌ దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. శరణార్దులు తలదాచుకుంటున్న స్కూల్‌పై ఈ దాడి జరిగింది.

జ్రాయెల్‌పై హమాస్‌ ప్రతీకార దాడులు

మరోవైపు ఇజ్రాయెల్‌పై హమాస్‌ ప్రతీకార దాడులకు దిగుతోంది. హోలాన్‌ పట్టణంలో కత్తులతో పౌరులపై దాడి జరిగింది. పాలస్తీనా యువకుడు జరిపిన దాడిలో ఓ మహిళతో సహా ఇద్దరు చనిపోయారు. కత్తిపోట్లలో చాలామంది గాయపడ్డారు. హమాస్‌ చీఫ్‌ హనియా హత్యకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ పార్లమెంట్‌ ప్రకటించింది. కనీవినీ ఎరగని రీతిలో ఈ దాడి ఉంటుందని స్పీకర్‌ మహ్మద్‌ బగేర్‌ ప్రకటించారు.

ఇజ్రాయెల్‌కు అండగా వస్తున్న అమెరికాకు కూడా గుణపాఠం తప్పదని ఇరాన్‌ హెచ్చరించింది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్ధ నౌకలు, ఫైటర్‌ జెట్లను పంపిస్తోంది. అమెరికా సిబ్బందితో పాటు ఇజ్రాయెల్‌ రక్షణ కోసం అదనపు యుద్ధ నౌకలు, ఫైటర్‌ జెట్లను అగ్రరాజ్యం పంపించింది. ఇరాన్‌ సంయమనం పాటించాలని లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వార్నింగ్ ఇచ్చారు.

మరోవైపు లెబనాన్‌లోని హెజ్‌బొల్లా తీవ్రవాదులు కూడా ఇజ్రాయెల్‌ టార్గెట్‌గా క్షిపణి దాడులు చేస్తున్నారు. అయితే ఈ దాడులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. కౌంటర్‌గా లెబనాన్‌ లోని రబ్‌ ఎల్‌ తలైతీన్‌ పట్టణంపై డ్రోన్లతో ఇజ్రాయెల్‌ బలగాలు దాడులు చేశాయి.

హెజ్‌బొల్లా స్థావరాలను టార్గెట్‌ చేస్తూ ఇజ్రాయెల్‌ బలగాలను డ్రోన్‌ దాడులు చేస్తున్నాయి. ఇజ్రాయెల్‌ దాడుల్లో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. యుద్దం కారణంగా గాజాలో శరణార్దుల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. తిండి కోసం , మంచినీటి కోసం జనం అలమటిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…