Canada: కెనడాలో ఖలీస్తాన్ మద్దతు దారుల అలజడి.. దీపావళి వేడుకలే టార్గెట్ గా.. పరిస్థితి ఉద్రిక్తం..
కెనడాలో ఖలిస్తానీ వేర్పాటు వాదులు దీపావళిని టార్గెట్ చేశారు. వేడుకలను అడ్డుకోబోగా ప్రతిగా ప్రవాస భారతీయులు వందేమాతరం నినాదాలు చేశారు.ప్రపంచమంతా భారతీయులు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు...
కెనడాలో ఖలిస్తానీ వేర్పాటు వాదులు దీపావళిని టార్గెట్ చేశారు. వేడుకలను అడ్డుకోబోగా ప్రతిగా ప్రవాస భారతీయులు వందేమాతరం నినాదాలు చేశారు.ప్రపంచమంతా భారతీయులు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. కెనడాలో కూడా అక్కడి ప్రవాస భారతీయులు సంబరాలు జరుపుకుంటుండగా ఖలిస్తాన్ మద్దతుదారులు అలజడి సృష్టించారు. మాల్టన్ – మిస్సిసౌగా నగరంలో దీపావళి వేడుకలను టార్గెట్ చేశారు. సిక్కులు జరుపుకునే బందీ చోర్ దివాస్ లో భాగంగా ఖలిస్తాన్ మద్దతుదారులు ఊరేగింపు నిర్వహించారు. వీరు అక్కడి పార్కింగ్ లాట్‌లో టపాకాయలు కాలుస్తున్నవారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయంలో సమీపంలోనే ఉన్న భారతీయులకు తెలియడంతో వారంతా త్రివర్ణ పతాకాలు పట్టుకొని అక్కడికి చేరుకున్నారు. ఖలిస్తాన్ మద్దతుదారులు భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ప్రతిగా భారతీయులు వందేమాతరం నినాదాలు చేశారు. రెండు వర్గాలు ఎదురెదురుగా నిలవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘర్షణల్లో కొందరు గాయపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కెనడాలో కొంత కాలంలో ఖలిస్తాన్ వేర్పాటు వాదులు భారత వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేశారు. సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ నవంబర్ 6 వ తేదీన ఖలిస్తాన్ ఏర్పాటు చేయాలంటూ రిఫెరెండం నిర్వహించింది. దీనిపై భారత్ కెనడా ప్రభుత్వానికి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడెన్ ఖలిస్తాన్ వేర్పాటు వాదుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి