Kerala: కేరళలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం.. సమన్వయ లోపమే దీనికి కారణమా..?
కేరళలో ఓ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. అక్కడి ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఓ అంశం తీవ్ర వివాదానికి కారణం కాగా.. ప్రభుత్వం తన వాదనను సమర్థించుకుంటుండగా, గవర్నర్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకం వివాదం కేరళ రాష్ట్ర..
కేరళలో ఓ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. అక్కడి ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఓ అంశం తీవ్ర వివాదానికి కారణం కాగా.. ప్రభుత్వం తన వాదనను సమర్థించుకుంటుండగా, గవర్నర్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకం వివాదం కేరళ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. తొమ్మిది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు వైదొలగాలని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ రాజకీయ దుమారం ఏర్పడింది. కేరళలో గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఘర్షణను చూసుకుంటే, గవర్నర్ చెబుతున్న అనేక విషయాలు వాస్తవమే అయినప్పటికి, వాటి విషయంలో గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాను వ్యవహరిస్తున్న తీరు సరైనదేనని, నిజమైన ప్రజాస్వామ్యవాదినని, ప్రభుత్వ వైఫల్యాలను తప్పుపట్టడం తన రాజ్యాంగ కర్తవ్యంగా గవర్నర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ తీరును కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ప్రజలతో ఎన్నుకోబడినందున, వారు ఏమి చేసినా సరైనదనని, చట్టం యొక్క మద్దతు ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును బట్టి అర్థం అవుతోంది. వాస్తవానికి విద్యావ్యవస్థలో రాజకీయ నాయకుల ప్రమేయం సరైనది కాదు, విద్యా వ్యవస్థను రాజకీయాలు, రాజకీయ నాయకులు ప్రభావం చేయకూడదు. కాని కొన్నేళ్లుగా దేశంలో పరిస్థితులు చూస్తుంటే.. అధికారంలో ఉన్న పార్టీ తమకు అనుకూలమైన వ్యక్తులను వైస్ ఛాన్సలర్లుగా నియమించుకోవడం చూస్తున్నాం. కాని ఒక రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్ గా గవర్నర్ ఉంటారు. కొద్ది సంవత్సరాలుగా పరిస్థితులను చూస్తే విద్యా వ్యవస్థపై రాజకీయ నాయకులు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మొదటిగా ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య వివాదం పూర్వపరాలు పరిశీలిస్తే గతంలో రాష్ట్రపతిగా ఉన్న రామ్ నాధ్ కోవింద్ కు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయాలని కేరళ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్‌కు గవర్నర్ చేసిన అభ్యర్థనకు సంబంధించినది. రాజకీయ ఒత్తిడి కారణంగా గవర్నర్ నిర్ణయాన్ని వైస్ ఛాన్సలర్ తిరస్కరించాల్సి వచ్చింది. రాష్ట్రపతికి గౌరవ డాక్టరేట్ ప్రధానానికి సంబంధించి అక్కడి ప్రభుత్వాన్ని ఒప్పించడంలో అప్పటి వైస్ ఛాన్సలర్ విఫలమయ్యారు. దీంతో ఈ విషయం ప్రభుత్వానికి, విశ్వవిద్యాలయాల కులపతి అయిన గవర్నర్ కు మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది.
వాస్తవానికి కేరళ ప్రభుత్వం ఆ విషయంలో సానుకూలంగా ఆలోచించి ఉండాల్సింది. రాజకీయ గణాంకాలను భేరీజు వేసుకోకుండా రాష్ట్రపతిని గౌరవించే విషయంగా దీనిని అప్పట్లో ప్రభుత్వం భావించి ఉంటే ఈ వివాదం ఏర్పడే అవకాశం ఉండేది కాదని కొందరు విద్యావేత్తల అభిప్రాయం. అలాగే కన్నూర్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ కూడా ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య వివాదానికి కారణం అయింది. డిసెంబర్ 2019లో కన్నూర్ యూనివర్శిటీ నిర్వహించిన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌ను ప్రారంభించేందుకు గవర్నర్ వెళ్లినప్పుడు ఎదురైన ఇబ్బందిని ఇటీవల గవర్నర్ ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగించబోతుండగా, కార్యక్రమానికి హాజరైన చాలా మంది ప్రతినిధులు లేచి, ఆయన వైఖరికి వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గోన్న వారు గవర్నర్ పట్ల వ్యవహరించిన తీరు కూడా ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య వైర్యం పెరగడానికి కారణంగా చెప్పవచ్చు. పౌరసత్వ సవరణ చట్టం- సీఏఏ వంటి అంశాల్లో గవర్నర్ వైఖరి తెలిసిన యూనివర్సిటీ అధికారులు ఆయనను కార్యక్రమానికి ఆహ్వానించి ఉండకూడదు లేదా ఆహ్వానించిన నేపథ్యంలో ఆయన అభిప్రాయాలను గౌరవించి, అటువంటి సమావేశానికి సంబంధించిన ప్రోటోకాల్, ప్రజాస్వామ్య మర్యాదలను పాటించి ఉండాల్సింది. అలా చేయకపోవడంతో గవర్నర్ ను పిలిచి అవమానించారనే విషయం అక్కడ ఎస్టాబ్లిస్ అయింది. మరొక విషయాన్ని చూసుకుంటే కళామండలం డీమ్డ్ యూనివర్సిటీ అంశం. వీటన్నింటిలో వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉంటే ఎటువంటి సమస్యలు ఉత్పన్నం అయ్యేవి కావు. ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేవి. రాజకీయనాయకులు, విశ్వవిద్యాలయాల ఉన్నత అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో నేడు గవర్నర్, ప్రభుత్వం మధ్య ఘర్షణకు కారణంగా చెప్పుకోవచ్చు.
రాజకీయ నాయకులు తమకు అధికారం ఉందని, తాము పాలించే ప్రజలు, ప్రాంతంపై గుప్తాధిపత్యం ఉందని భావిస్తుంటారు. వాస్తవానికి అలాంటి అధికారాన్ని ఎవరూ కలిగి ఉండరు. కేవలం ప్రభుత్వాన్ని నడపడానికి మాత్రమే ప్రజలు పాలకులను ఎన్నుకుంటారు. ఆ విషయాన్ని గుర్తిస్తే చాలా సమస్యలకు పరిష్కారం సులువుగా దొరుకుతుంది. కాని ఎవరికి వారు తాము చేస్తున్నదే కరెక్ట్ అని భావించడం వల్లే ఇలాంటి వివాదాలు ఉత్పన్నమవుతున్నాయి.
తొమ్మిది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు తమ పదవుల నుంచి వైదొలగాలని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆదేశాలు జారీ చేయడంతో వివాదం ఏర్పడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని గవర్నర్ పేర్కొన్నారు. అయితే సీఎం పినరయి విజయన్ రాష్ట్రంలో విద్యావ్యవస్థను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని గవర్నర్ వ్యాఖ్యానించారు. గవర్నర్ ఆర్ ఎస్ ఎస్ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారంటూ ప్రభుత్వం విమర్శించింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం, విద్యాపరంగా స్వతంత్య్రంగా ఉండాల్సిన యూనివర్సిటీల అధికారాలను గవర్నర్ చర్యలు అతిక్రమించడమే అవుతాయని సీఏం పినరయి విజయన్ ఆరోపించారు. కేరళ ప్రభుత్వం వివిధ యూనివర్సిటీలకు సొంతంగా వైస్ ఛాన్సలర్లను నియమిస్తున్న నేపథ్యంలో గవర్నర్, ప్రభుత్వానికి మధ్య వివాదం ప్రారంభం అయింది. వైస్ ఛాన్సలర్ల నియామకం అనేది గవర్నర్ అధికారాల్లో ఒకటి అని ఆరీఫ్ మహ్మద్ ఖాన్ చెబుతున్నారు. కేరళ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కన్నూర్ యూనివర్సిటీ, ఏపీజే అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్శిటీ, శ్రీ శంకరాచార్య సంస్కృత యూనివర్శిటీ, కాలికట్ యూనివర్శిటీ, తుంచత్ ఎజుతచ్చన్ మలయాళ యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేయాలని గవర్నర్ ఆదేశాశాలు జారీ చేయడంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. అయితే ఈ వివాదానికి కారణం గత సంఘటనలే అని స్పష్టమవుతున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..