Joe Biden: ప్రెస్‌మీట్ జరుగుతుండగా మధ్యలోనే వెళ్లిపోయిన జో బైడెన్.. ఎందుకంటే ?

అమెరికా అధ్యక్షుడు ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు మధ్యలోనే వెళ్లిపోవడం సహజమే. కాని తాజాగా విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఈసారి బైడెన్ సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

Joe Biden: ప్రెస్‌మీట్  జరుగుతుండగా మధ్యలోనే వెళ్లిపోయిన జో బైడెన్.. ఎందుకంటే ?
Joe Biden
Follow us
Aravind B

|

Updated on: Mar 14, 2023 | 12:14 PM

అమెరికా అధ్యక్షుడు ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు మధ్యలోనే వెళ్లిపోవడం సహజమే. కాని తాజాగా విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఈసారి బైడెన్ సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇటీవల అమెరికాలోని రెండు బ్యాంకుల్లో సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. వీటి గురించి బైడెన్‌ మాట్లాడుతూ తమ బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగానే ఉందని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. డిపాజిటర్ల డబ్బుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారు. అయితే ఈ క్రమంలో విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సంక్షోభం ఎందుకు తలెత్తింది అన్న దానిపై ప్రస్తుతం మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటీ ? దీని తదనంతరం ప్రతికూల ప్రభావాలు అమెరికన్లపై ఉండవని భరోసా ఇవ్వగలరా అని ప్రశ్నలు సంధించారు. దీంతో జో బైడెన్ ఒక్క క్షణం ఆలోచించకుండా వెనక్కి తిరిగి నడక ప్రారంభించారు. ఇతర బ్యాంకులకు కూడా ఇలాంటి పరిస్థితులే వస్తాయనా అని మరో విలేకరి ప్రశ్నిస్తుండగానే తనకేం సంబంధం లేదన్నట్లు అక్కడి నుంచి వెళ్లిపోయి గది తలుపులు మూసేశారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. బైడెన్ వ్యవహార శైలిపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ప్రెస్ మీట్ జరుగుతుండగా బైడెన్ ఇలా మధ్యలోనే వెళ్లిపోవడం తొలిసారి ఏం కాదు. ఇటీవల చైనా స్పై బెలున్ ఘటనపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా ఇదే రీతిలో వ్యవహరించారు. మీ కుటుంబ వ్యాపారాల వల్ల రాజీపడ్డారా అని ఓ విలేకరి ప్రశ్నించగా నాకు కొంత సమయం ఇవ్వండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. చైనా నిఘా బెలూన్‌ను అమెరికా కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ విదేశీ వ్యాపారాలపై తరచూ విమర్శలు వినిపిస్తుంటాయి. తమ కుటుంబ వ్యాపారాలు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉండవని ఇదివరకు అధ్యక్షుడు హామీ ఇచ్చారు. అయితే హంటర్‌కు స్కానియాటిలిస్‌ ఎల్‌ఎల్‌సీ ద్వారా చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీహెచ్‌ఆర్‌ పార్ట్నర్స్‌లో ఇంకా 10 శాతం వాటా ఉందని అమెరికన్ మీడియా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. 2021లో అందులోని వాటాలన్నింటిని ఆయన విక్రయించారని హంటర్ తరఫు న్యాయవాది వెల్లడించారు. కానీ కొన్ని అనుమానిత లావాదేవీలపై మాత్రం ఆయన సమాధానం ఇవ్వలేదు.

ఇవి కూడా చదవండి

అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌, సిగ్నేచర్ బ్యాంకులు ఇటీవల మూతపడ్డాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ ఉదంతం ఇంకా ప్రకంపనలు సృష్టిస్తుండగానే క్రిప్టో పరిశ్రమతో ఎక్కువగా సంబంధాలున్న సిగ్నేచర్‌ బ్యాంక్‌ ను మూసివేస్తున్నట్లు అక్కడి నియంత్రణ సంస్థలు ఆదివారం సాయంత్రం ప్రకటించాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అమెరికాలో ఇలా కీలక బ్యాంకులు మూతపడడంతో బ్యాంకింగ్‌ రంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం