Ratan Tata: అందుకే ఈ యువకుడి ప్రతిభకు రతన్‌ టాటా సైతం ఫిదా అయ్యారు..

రతన్ టాటా.. టాటా గ్రూప్‌ చైర్మన్‌గా వ్యాపార దక్షతకు మారుపేరుగా పర్యాయ పదంగా నిలిచిన ఈ బిజినెస్‌ టైకూన్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

Ratan Tata: అందుకే ఈ యువకుడి ప్రతిభకు రతన్‌ టాటా సైతం ఫిదా అయ్యారు..
Follow us
Basha Shek

|

Updated on: Nov 22, 2021 | 10:50 PM

రతన్ టాటా.. టాటా గ్రూప్‌ చైర్మన్‌గా వ్యాపార దక్షతకు మారుపేరుగా పర్యాయ పదంగా నిలిచిన ఈ బిజినెస్‌ టైకూన్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అదేవిధంగా తన సేవా కార్యక్రమాలతోనూ అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా కాలంలో ఎన్నో సహాయక కార్యక్రమాలు నిర్వహించి మరోసారి వార్తల్లో నిలిచారీ పెద్దాయన. ఈ మధ్యన సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్న ఆయన సమాజంలో జరిగే విషయాలు, సంఘటనలపై తన అభిప్రాయాలు చెబుతుంటారు. ఇవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రోజురోజుకీ సోషల్ మీడియాలో ఆయనను అనుసరించే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. అయితే రతన్‌ సేవా కార్యక్రమాలు, ఆయన సోషల్‌ మీడియా ఖాతాల నిర్వహణ వెనక ఓ 28 ఏళ్ల యువకుడి ప్రతిభా నైపుణ్యాలు దాగి ఉన్నాయి. అతనే శాంతను నాయుడు. ప్రస్తుతం రతన్‌కు అసిస్టెంట్‌గా, డిప్యూటీ జనరల్ మేనేజర్‌(ఛైర్మన్‌ ఆఫీస్‌)గా వ్యవహరిస్తోన్న ఈ యువకుడి గురించి, టాటాతో అతని అనుబంధం గురించి తెలుసుకుందాం రండి.

ఒకే ఒక్క ఆలోచన.. కొన్నిసార్లు మనం చేసే చిన్నచిన్న పనులే మనకు ఎక్కువ గుర్తింపు తీసుకొస్తాయి. శాంతను నాయుడు విషయంలో ఇదే జరిగింది. ఒకరోజు అతను ఇంటికి వస్తున్నప్పుడు ఓ కుక్క రోడ్డు ప్రమాదంలో గాయపడి అతని కళ్ల ముందే చనిపోయింది . ఈ సంఘటన శాంతనుని ఎంతగానో కలిచివేసింది. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏదైనా చేయాలనుకున్నాడు. బాగా ఆలోచించి తన ఫ్రెండ్స్‌తో కలిసి ఒక రేడియం బెల్ట్ ను రూపొందించాడు. ఒకే రంగులో కాకుండా వివిధ రంగులు కనిపించేలా ఈ బెల్ట్‌ను డిజైన్‌ చేశాడు. ఈ బెల్ట్‌ ధరించిన కుక్క రోడ్డు మీదకు వెళ్లినప్పుడు ఆ బెల్టు మీదున్న రంగులు రిఫ్లెక్ట్ అయ్యి ఎదురుగా వచ్చే వాహనదారులు నెమ్మది కావడమో, ఆపేయడమో చేస్తారు. దీంతో ఆ మూగజీవాలకు ఎలాంటి ప్రమాదం జరగదు. శాంతను ఒక కుక్క కోసమే ఈ బెల్ట్ తయారుచేశాడు. కానీ అతని ప్రతిభను చూసి మరికొందరు అలాంటి బెల్టులు కావాలన్నారు. అయితే శాంతను దగ్గర అంత డబ్బులు లేవు. అప్పుడు శాంతను తండ్రి టాటా ఇండస్ట్రీస్ కి ప్రాజెక్ట్ ఫండింగ్ చేయడానికి లేఖ రాయమని సలహా ఇచ్చాడు. ఆ సమయంలో తన లేఖకు టాటా వాళ్లు సమాధానం ఇస్తారని శాంతను అనుకోలేదు. అనుకున్నట్లే రెండు నెలల పాటు టాటా కంపెనీ నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. ఇక ఆశలు వదులుకుంటున్న సమయంలో శాంతనుకి టాటా ఇండస్ట్రీస్ నుంచి కాల్ వచ్చింది. ముంబైకి రమ్మని ఆహ్వానం పంపారు. రతన్ టాటాకి కూడా మూగజీవాల అంటే మక్కువ ఉండటంతో వెంటనేఈ ప్రాజెక్టుకు ఫండింగ చేయడానికి ఒప్పుకున్నారు. అలా శాంతను మోటోపాస్ అన్న కంపెనీని మొదలెట్టాడు.

సోషల్‌ మీడియా గైడ్‌గా.. ఇలా మూగజీవాల సంరక్షణ కోసం మొదలైన వీరిద్దరి పరిచయం ఆ తర్వాత మంచి స్నేహంగా మారింది. సేవా కార్యక్రమాల గురించి పరస్పరం చర్చించుకునేవారు. ఈమెయిల్స్‌ ద్వారా ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు పంచుకునేవారు. ఇదే సమయంలో టాటాకు సోషల్‌ మీడియాను పరిచయం చేశాడు శాంతను. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, హ్యాష్‌ ట్యాగ్‌లు, ఎమోజీలు వాడడం.. ఇలా సామాజిక మాధ్యమాలను మెరుగ్గా వినియోగించడంలో ఉండే మెలకువలన్నీ రతన్‌కు నేర్పించాడు. అలాగే వ్యాపార నిర్వహణకు సంబంధించి రతన్‌కు ఎన్నో విలువైన సలహాలు కూడా అందిస్తున్నాడు. రతన్‌, శాంతనుల మధ్య భారీగా ఏజ్‌గ్యాప్‌ ఉంది. అయితే వీరి స్నేహానికి అది ఏమాత్రం అడ్డుకాలేదు. ఒకరిపై మరొకరు చేతులు వేసుకుని మాట్లాడేంత సాన్నిహిత్యం ఉంది వీరిద్దరికి.   ఈ నేపథ్యంలో ఒక పక్క తన ఫ్రెండ్స్‌తో మెటోపాస్‌ కంపెనీ బాధ్యతలను చూసుకుంటూనే మరో పక్క ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిపోయాడు శాంతను. ఈ సందర్భంగా శాంతను చదువుకుంటున్న న్యూయార్క్‌లోని కార్నెల్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన గ్రాడ్యుయేషన్‌ వేడుకలకు కూడా హాజరయ్యారు రతన్‌. ఇక శాంతను చదువు ముగించుకుని ఇండియాకు వచ్చిన తర్వాత రతన్‌ ఆహ్వానం మేరకు బిజినెస్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరాడు. అప్పటి నుంచి వ్యాపార నిర్వహణ, లావాదేవీలకు సంబంధించి రతన్‌కు విలువైన సలహాలు, సూచనలు అందిస్తున్నాడు శాంతను. అదేవిధంగా ఆయన సోషల్‌ మీడియా ఖాతాల నిర్వహణ బాధ్యతలను కూడా పర్యవేక్షిస్తున్నాడు.

Also Read:

Indians Behind America: అగ్రరాజ్యంగా అవతరించిన అమెరికా వెనుక కనిపించని భారతీయుల కృషి ఎంతో తెలుసా?

Tipu Sultan: టిప్పు సుల్తాన్ సింహాసనంలోని పులి తలను వేలానికి పెట్టిన యూకే.. దొంగిలించిన వాటిని అమ్మడమేంటి అంటూ నెటిజన్లు ఫైర్

Non Resident Indians: ప్రవాస భారతీయుల సంక్షేమమే లక్ష్యంగా ‘ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్‌ మీట్‌’.. సమావేశం ఎప్పుడంటే..