Iran Hijab Protest: ఆందోళనలతో అట్టుడుకుతోన్న ఇరాన్.. హిజాబ్ వ్యతిరేక ఘర్షణల్లో 75 మంది మృతి..
ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనల్ని అణచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 75 మంది చనిపోయారు.
ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనల్ని అణచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 75 మంది చనిపోయారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో వేలాదిమంది ఆందోళనకారులు ‘డెత్ టు ద డిక్టేటర్’ అంటూ నినాదాలు చేశారు. మూడు దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖొమైనీ పాలనకు చరమగీతం పలకాలని నినాదాలు చేశారు. అయితే.. పోలీసులు ఆందోళలను అడ్డుకునేందుకు కాల్పులు జరుపుతున్నారు. పోలీసుల చర్యలతో ఇప్పటివరకు దాదాపు 80 మంది వరకు మరణించగా.. వేలాది మంది అరెస్ట్ అయ్యారు. చాలామంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న కారణంతో మహ్స అమిని అనే 22 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమె తీవ్ర గాయాలతో కస్టడీ మృతి చెందడంతో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. హిజాబ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మహిళలు గళమెత్తారు. ఈ ఉద్యమానికి మహిళలతో పాటు పురుషులు కూడా మద్దతిస్తున్నారు. వీధుల్లోకి చేరిన ఉద్యమకారులు హిజాబ్‌ను బహిరంగంగా తగలబెడుతున్నారు. జుట్టు కత్తిరించుకుంటున్నారు. ఈ ఉద్యమం పదో రోజుకు చేరింది.
ఇరాన్‌లోని 46 ప్రధాన పట్టణాల్లో ఈ ఆందోళనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. అయితే, ఈ ఘటనలు అక్కడ హింసకు దారి తీశాయి. భారీ సంఖ్యలో రోడ్లపైకి చేరిన ఆందోళన కారుల్ని పోలీసులు, సైన్యం అణిచివేస్తోంది. వేలాది మందిని పోలీసులు అరెస్టు చేసి సోషల్ మీడియా యాప్స్‌పై నిషేధం విధించింది. మానవ హక్కుల కార్యకర్తల్ని కూడా సైన్యం అదుపులోకి తీసుకుంటోంది. ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు అమిని మృతికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో విదేశీ కుట్ర ఉందన్న వార్తలను ఇరాన్ ప్రభుత్వం ఖండించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..