Global Market: ప్రపంచాన్ని భయపెడుతున్న ఆర్థిక మాంద్యం.. అన్ని కరెన్సీల విలువ పతనం.. ఆర్థిక సంక్షోభం తప్పదా..?

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 107 దేశాల ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. దాదాపుగా 69 దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి అల్లాడిపోతున్నాయి. ఉపఖండంలో మన ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ ఆర్థిక మాంద్యంతో బెంబేలెత్తుతున్నాయి.

Global Market: ప్రపంచాన్ని భయపెడుతున్న ఆర్థిక మాంద్యం.. అన్ని కరెన్సీల విలువ పతనం.. ఆర్థిక సంక్షోభం తప్పదా..?
Global Market
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 28, 2022 | 6:05 AM

తీవ్ర ఆర్థిక మాంద్యం 2008లో అగ్రరాజ్యం అమెరికాను కుదేలు చేసింది. అప్పటి సబ్‌ప్రైమ్‌ సంక్షోభం అమెరికా ఆర్థిక రంగాన్ని ఉల్టాపల్టా చేసింది. నాటి ఆర్థిక సంక్షోభం మరోసారి ప్రపంచాన్ని ముంచెత్తే సూచనలు కనిపిస్తున్నాయని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 107 దేశాల ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. దాదాపుగా 69 దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి అల్లాడిపోతున్నాయి. ఉపఖండంలో మన ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ ఆర్థిక మాంద్యంతో అల్లాడిపోతున్నాయి. ఆర్థికంగా బలమైన చైనా కూడా క్రమంగా మాంద్యంలో కూరుకుపోతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ దేశాలపై మాంద్యం సునామీ విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తోంది. మన దేశంలో కూడా ధరల పెరుగుదలను కట్టడి చేసేందుకు ఆర్బీఐ మరోసారి వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు అమెరికా ఫెడ్‌ కూడా ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు కొద్ది రోజుల క్రితం మూడోసారి వడ్డీ రేట్లను పెంచింది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పన్నులను తగ్గించడం, వ్యయాన్ని పెంచే ప్లాన్లను అనుమతించడంతో అమెరికన్‌ డాలర్‌తో పోలిస్తే బ్రిటీష్‌ పౌండ్‌ విలువ బాగా పడిపోయింది. ఇది గత 40 ఏళ్లలో కనిష్ట స్థాయి అని చెబుతున్నారు. డాలర్‌తో పోలిస్తే ఒక్క బ్రిటీష్‌ పౌండ్‌ మాత్రమే కాకుండా యూరో, స్విస్‌ ఫ్రాంక్‌, చైనీస్‌ యువాన్‌, జపనీస్‌ యెన్‌, ఇండియన్‌ రూపీ విలువలు కూడా పాతాళానికి పడిపోతున్నాయి. మరోవైపు డాలర్‌ మరింత బలపడుతోంది. రాబోయే ఆర్థిక మాంద్యానికి ఇవి సూచనలని ఆర్థిక నిపుణులు చెబుతుంటే జనం గుండెల్లో గుబులు మొదలవుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఆల్‌ టైమ్‌ కనిష్ట స్థాయికి చేరింది. డాలర్‌ విలువ పెరిగి, రూపాయి విలువ పతనం కావడంతో మన దేశ దిగుమతుల వ్యయం పెరిగిపోతోంది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇలానే కొనసాగితే ఆర్థిక సంక్షోభం తప్పదంటూ పేర్కొంటున్నారు.