Tigris River: అంతరించిపోతున్న ప్రాచీన నాగరికతకు సాక్ష్యమైన టైగ్రిస్ నది.. ఆందోళనలో ప్రజలు..
ప్రాచీన నాగరికతకు సాక్ష్యమైన ఆ నది ఇక అంతరించిపోతోందా? ఇరాక్‌లోని టైగ్రిస్ నది ప్రవాహం దాదాపు క్షీణించిపోవడం అక్కడి ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
Death of Tigris River: ప్రాచీన నాగరికతకు సాక్ష్యమైన ఆ నది ఇక అంతరించిపోతోందా? ఇరాక్‌లోని టైగ్రిస్ నది ప్రవాహం దాదాపు క్షీణించిపోవడం అక్కడి ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. సుమేరియన్, మెసొపొటేమియా నాగరికతలు ఈ నది ఒడ్డునే పుట్టాయి. ప్రాచీన కాలంలో పాటు అకాడియన్, అస్సిరియన్, పార్దియన్, ఓట్టమన్ తదితర సామ్రాజ్యాల పాలనను చూసిన ఈ టైగ్రిస్ నది.. ఎడారి దేశం ఇరాక్‌లో మానవ మనుగడకు ఊపిరిపోసింది. ఈ నదికి సాంస్కృతిక, మత పరంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. 1,750 కిలో మీటర్ల దూరం ప్రవహించే ఈ నది మూడు దేశాల్లో కనిపిస్తుంది.. టర్కీ, సిరియాల్లో కూడా ఉన్నా ఇరాక్‌లోనే ఎక్కువ భూభాగంలో ప్రవహిస్తుంది టైగ్రిస్.. చివరకు యూప్రటీస్‌తో సంగమించి పర్షియన్ గల్ఫ్‌లో కలిసిపోతుంది. టైగ్రిస్ నది ఒడ్డున బాగ్దాద్, మోసూల్, బస్రా తదితర నగరాలున్నాయి.
గత కొద్ది సంవత్సరాలుగా టైగ్రిస్ నదిలో జల ప్రవాహం తగ్గుతూ వస్తోంది. ఎడారి దేశమైన ఇరాక్‌లో వాతావరణ మార్పులు టైగ్రిస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేశాయి. మండే ఎండలు, ఇసుక తుఫాను ప్రభావం పెరిగిపోయింది. వర్షపాతం చాలా తగ్గిపోయింది. ఫలితంగా నదిలో కొత్త నీరు చేరడం లేదు.. తాగునీటికి, వ్యవసాయ అవసరాలకు కష్టమొచ్చిందని ఇక్కడి ప్రజలు అంటున్నారు.
గత మూడు మూడేళ్లుగా పరిస్థితులు మరీ దారుణంగా మారాయి. టైగ్రిస్ నదిలో ప్రవాహం తగ్గడంతో జలరవాణా కూడా పూర్తిగా ఆగిపోయింది. ఈ నదిలో ఇప్పుడు పాయలు మాత్రమే కనిపిస్తున్నాయి. మరోవైపు టైగ్రిస్ నది మొదలయ్యే టర్కీలో నిర్మించిన ఆనకట్టలు కూడా నదీ ప్రవాహం తగ్గడానికి ప్రధాన కారణం అంటున్నారు ఇరాక్ వాసులు.
చాలా దేశాలు ఒకదాని తర్వాత మరొకటి ప్రకృతి వైపరీత్యంతో కొట్టుమిట్టాడుతున్నాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. వాతావరణ మార్పులకు ఎక్కువగా గురయ్యే ఐదు దేశాలలో ఇది కూడా ఒకటి అని తెలిపింది. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం.. తీవ్రమైన ఇసుక తుఫానులు ఈ పరిస్థితికి కారణం కావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి