Canada Travel: కెనడాలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం.. కారణం ఇదే..
Canada Travel Advisory: కెనడాలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అక్కడ పెరిగిపోతున్న విద్వేష నేరాలు, మత హింసపై ఆందోళన వ్యక్తం చేస్తూ..
Hate Crime: కెనడాలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కెనడా వెళ్లే ప్రయాణికులు, అక్కడ చదువుతున్న విద్యార్థుల కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) హెచ్చరించింది. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు “తీవ్రమైన పెరుగుదల” ఉందని భారతదేశం ప్రయాణికులకు సలహా ఇచ్చింది. కెనడాలో విద్వేషపూరిత నేరాల కేసులు, భారత వ్యతిరేక కార్యకలాపాలపై కెనడా అధికారులతో విదేశాంగ మంత్రిత్వ శాఖ మాట్లాడిందని ప్రభుత్వం తెలిపింది. ఈ నేరాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను కోరారు. ఈ నేరాలకు పాల్పడిన వారికి కెనడాలో ఇప్పటివరకు ఎలాంటి శిక్షలు పడలేదని విదేశాంగ శాఖ పేర్కొంది.
అక్కడ పెరిగిపోతున్న విద్వేష నేరాలు, మత హింసపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇప్పటికే కెనడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది భారత్.. తాజాగా ఖలిస్థానీ వేర్పాటువాదుల రిఫరెండం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. కెనడాలో ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలను సీరియస్‌గా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కొంత కాలంగా అక్కడ విద్వేషపూరిత నేరాలు, మతపరమైన హింసపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కెనడాలో నివసిస్తున్న భారతీయులంతా జాగ్రత్తగా ఉండాలని విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
కెనడాలోని భారతీయ పౌరులు, చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాని విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది, భారత్ నుంచి కెనడా పర్యటన కోసం వెళ్లినవారిని కూడా అలర్ట్ చేసింది.. ఒట్టావాలోని హైకమిషన్ ఆఫ్ ఇండియాతోపాటు టొరంటో, వాంకోవర్‌లలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయాలతో టచ్‌లో ఉండాలని సూచించింది. సంబంధిత వెబ్‌సైట్‌లలో తమ వివరాలు నమోదు చేసుకుంటే అత్యవసర పరిస్థితుల్లో వేగంగా సంప్రదించేందుకు అవకాశం ఉంటుందని ఆ అడ్వైజరీ నోట్‌లో తెలిపింది.
ఇటీవల ఖలిస్థాన్ ఉద్యమ అనుకూల సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నిర్వహించిన రిఫరెండంపై భారత్ ఆగ్రహంతో ఉంది. ఖలిస్థాన్ ఏర్పాటును కోరుతూ నిర్వహించిన ఈ రిఫరెండంకు అనుమతి ఇవ్వడంపై కెనడా ప్రభుత్వానికి అభ్యంతరాన్ని వ్యక్తం చేసినట్లు తెలిపారు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ.. కాగా భారతదేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను తాము గౌరవిస్తున్నామని, ఖలిస్తాన్ రెఫరెండాన్ని గుర్తించబోమని కెనడా ప్రభుత్వం తెలిపింది.
విద్వేషపూరిత ఘటనలు, మతపరమైన హింస..
కెనడా ప్రభుత్వం విద్వేషపూరిత ఘటనలు, మతపరమైన హింస, భారత వ్యతిరేక కార్యకలాపాల విషయంలో మెతక వైఖరిని అవలంభిస్తోందనే విమర్శలున్నాయి. కొద్ది రోజుల క్రితం ఖలిస్థానీ వేర్పాటువాదులు టోరంటోని స్వామి నారాయణ మందిరాన్ని టార్డెట్ చేశారు. ఆలయం గోడవలపై భారత వ్యతిరేక, ఖలిస్థాన్ అనుకూల నినాదాలు రాశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో మంత్రి వర్గంలో ఖలిస్థానీ అనుకూల నాయకుడు జగ్మీత్ సింగ్‌కు చోటు దక్కడం భారత్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది. కెనడాలో 16 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వీరంతా తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఖలిస్తానీ ప్రజాభిప్రాయ సేకరణపై అభ్యంతరం..
కెనడాలో “ఖలిస్తానీ రెఫరెండం అని పిలవడం”పై భారత్ తీవ్రంగా వ్యతిరేకింది. స్నేహపూర్వక దేశంలో రాడికల్, అతివాద మూలకాలను రాజకీయంగా ప్రేరేపించే కార్యకలాపాలకు అనుమతించడంపై “అత్యంత అభ్యంతరకరం” అని పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి విలేకరులతో మాట్లాడుతూ.. దౌత్య మార్గాల ద్వారా కెనడా ప్రభుత్వం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లిందని తెలిపారు.
కాల్పుల్లో భారతీయ విద్యార్థి మృతి
కొద్ది రోజుల క్రితం, కెనడాలోని అంటారియోలో కాల్పుల్లో గాయపడిన భారతీయ విద్యార్థి శనివారం మరణించాడు. దీంతో పాటు ఈ ఘటనలో ఓ పోలీసు సహా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గత సోమవారం మిల్టన్‌లో జరిగిన కాల్పుల్లో భారతీయ విద్యార్థి గాయపడ్డాడని హిల్టన్ టెరిటోరియల్ పోలీస్ సర్వీస్ (HRPS) ప్రకటన విడుదల చేసింది. అతడిని సత్వీందర్ సింగ్‌గా గుర్తించారు. హామిల్టన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం