COVID-19: గ్రహాంతరవాసుల వల్లే కరోనా వ్యాప్తి.. బెలూన్లతో వదిలారు.. కిమ్ జోంగ్ వింత వాదన..
ఏప్రిల్‌లో 18 ఏళ్ల సైనికుడితోపాటు 5 ఏళ్ల చిన్నారి 'గ్రహాంతరవాసుల లాంటి వస్తువు'ను తాకినట్లు ఉత్తర కొరియాలో పుకార్లు వ్యాపించాయి. ఆ తర్వాత ఆ ఇద్దరిలోనూ కరోనా లక్షణాలు కనిపించాయంట.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన వింత ప్రకటనలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన కరోనా గురించి మరోసారి ఓ వింత వాదన చేశారు. గ్రహాంతరవాసుల వల్లే కరోనా వ్యాపిస్తోందని కిమ్ జోంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు కూడా గ్రహాంతరవాసుల వల్లే కనుగొన్నట్లు కిమ్ జోంగ్ చెప్పుకొచ్చారు. దక్షిణ కొరియాతో అనుసంధానమైన సరిహద్దు నుంచి గ్రహాంతరవాసులు ఈ వైరస్‌ను బెలూన్‌లో నింపి విసిరారని షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పటి నుంచి ఉత్తర కొరియాలో కరోనా వైరస్ విజృంభిస్తోందని తెలిపారు.
ఇద్దరు వ్యక్తులు వాటిని తాకారు..
ఏప్రిల్‌లో 18 ఏళ్ల సైనికుడితోపాటు 5 ఏళ్ల చిన్నారి ‘గ్రహాంతరవాసుల లాంటి వస్తువు’ను తాకినట్లు ఉత్తర కొరియాలో పుకార్లు వ్యాపించాయి. ఆ తర్వాత ఆ ఇద్దరిలోనూ కరోనా లక్షణాలు కనిపించాయంట. అయితే పొరుగు దేశం దక్షిణ కొరియా మాత్రం గ్రహాంతరవాసుల నుంచి వ్యాపిస్తున్న థియరీని నాన్సెన్స్ అంటూ కొట్టిపారేసింది. వస్తువుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నందున కిమ్ జోంగ్ వాదనను నమ్మడం కష్టమని సియోల్‌లోని ఒక ప్రొఫెసర్ తెలిపారు.
అలాంటివి కనిపిస్తే సమాచారం ఇవ్వాలి..
ఉత్తర కొరియా వార్తా సంస్థ KCNA ప్రకారం, సరిహద్దుకు ఆనుకుని ఉన్న ప్రాంతాలకు ప్రభుత్వం కొన్ని సూచనలను జారీ చేసింది. సరిహద్దుకు సమీపంలో నివసించే ప్రజలు గాలిలో అంటే బెలూన్లు, గ్రహాంతరవాసుల వంటి వాటి గురించి అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది. ఎవరైనా అలాంటివి కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొంది. దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత కరోనా వైరస్ నుంచి బయటపడినట్లు పేర్కొన్న తర్వాత, ఏప్రిల్ చివరి నుంచి ఉత్తర కొరియాలో సుమారు రెండు మిలియన్ల మంది ప్రజలు వింత జ్వరంతో బాధపడుతున్నారు. మే 12 న, ఉత్తర కొరియా మొదటిసారిగా తమ దేశంలో కరోనావైరస్ కేసులు వచ్చినట్లు ప్రకటించింది. దీని తరువాత, కిమ్ జోంగ్ దేశం మొత్తం లాక్డౌన్ విధించారు.