Chilie – Elections: దక్షిణ అమెరికాలో మళ్లీ రెపరెపలాడిన ఎర్ర జెండా.. హోరాహోరీ పోరులో 35 ఏళ్ల యువకుడు..
Chilie - Elections: దక్షిణ అమెరికాలో మళ్లీ ఎర్ర జెండా రెపరెపలాడింది. లెఫ్టిస్ట్ యువత వర్సెస్ కన్జర్వేటివ్ నేతలు అన్నట్లుగా సాగిన హోరాహోరీ పోరులో

Chilie – Elections: దక్షిణ అమెరికాలో మళ్లీ ఎర్ర జెండా రెపరెపలాడింది. లెఫ్టిస్ట్ యువత వర్సెస్ కన్జర్వేటివ్ నేతలు అన్నట్లుగా సాగిన హోరాహోరీ పోరులో చివరికి 35 ఏళ్ల యువకుడు గాబ్రియేల్ బోరిక్ చిలీకి కొత్త సారధిగా ఎన్నికయ్యారు. వివరాల్లోకెళితే.. లాటిన్ అమెరికా దేశాలన్నిటిలోకి అంతో ఇంతో సుస్థిరంగా, సంపన్న దేశంగా ఉన్నా, ఏళ్లపాటు నిరసనకాండలతో చితికిపోయిన చిలీలో ఈ ఎన్నికలు ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. చిలీ అధ్యక్షుడిగా అత్యంత పిన్న వయస్కుడైన సోషల్ కన్వగెన్స్ పార్టీ నేత గాబ్రియేల్ బోరిక్ ఎన్నికయ్యారు. మితవాద ప్రత్యర్ధి జోస్ ఆంటోనియా కాస్ట్‌పై వామపక్ష అభ్యర్థి గాబ్రియేల్ గెలుపొందారు. గాబ్రియేల్ వెంట నిలిచిన వారిలో నూటికి నూరు శాతం యువతే కావడంతో విజయం తర్వాత వారి ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి.చిలీ ఎన్నికల ఫలితాల్లో లెఫ్టిస్టు యువ నేత గాబ్రియేల్ బోరిక్ కు 56 శాతం ఓట్లు, మితవాద ఆంటోనియాకు 44 ఓట్లు దక్కాయి. హోరాహోరీగా సాగిన పోరులో చివరికి యువ ఓటర్లే డిసైడింగ్ ఫ్యాక్టర్ లా వామపక్ష అభ్యర్థికే పట్టం కట్టారు.
పారిశ్రామికంగా లాటిన్ అమెరికాలో అందరికంటే మెరుగ్గా ఉన్న చిలీలో కార్మికులకు, సామాన్యులకు పెన్షన్, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను సంస్కరించడం, వారానికి పని గంటలను 45 నుండి 40కి తగ్గించడం, గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్ పెంచడం ద్వారా అసమానతలను పరిష్కరిస్తామంటూ గాబ్రియెల్ బోరిక్ ఇచ్చిన హామీలను జనం విశ్వసించారు. సహజ వనరులకు నిలయమైన చిలీ ఏళ్లకు ఏళ్లు నిరసనలతో చితికిపోయి..భవిష్యత్ తరాల కోసం కొత్త రాజ్యాంగాన్ని రచించేందుకు సిద్ధమౌతున్న వేళ యువ వామపక్ష నేత అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకోనున్నారు. మాజీ విద్యార్థి నేత అయిన గాబ్రియేల్.. 2019-2020లో దేశంలో అసమానతలు, అవినీతికి వ్యతిరేకంగా చేపడుతున్న సామూహిక ఆందోళనలకు మద్దతునిచ్చారు.బోరిక్ గెలుపుతో చిలీ రాజధాని శాంటియోగోలో సంబరాలు మిన్నంటాయి. వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఎన్నికల ప్రచారంలో తనదైన వాగ్ధాటి, హామీలతో బోరిక్ ప్రజలను ఆకట్టుకోగలిగారు. పౌర హక్కుల విషయంలో తనకున్న కమిట్‌మెంట్‌ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు.
Also read: