AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Scott Morrison: వికలాంగ చిన్నారులపై నోరు జారిన ఆస్ట్రేలియా ప్రధాని.. క్షమాపణ చెప్పిన మోరిసన్

అంగ వైకల్యంతో జన్మించిన చిన్నారులపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్(Australian PM Scott Morrison) నోరుజారారు. అంగవైకల్యం లేని పిల్లలను పొందడం దేవుడి ఆశీర్వాదమేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

Scott Morrison: వికలాంగ చిన్నారులపై నోరు జారిన ఆస్ట్రేలియా ప్రధాని.. క్షమాపణ చెప్పిన మోరిసన్
Scott Morrison
Janardhan Veluru
|

Updated on: Apr 21, 2022 | 11:45 AM

Share

అంగ వైకల్యంతో జన్మించిన చిన్నారులపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ (Australian PM Scott Morrison) నోరుజారారు. అంగవైకల్యం లేని పిల్లలను పొందడం దేవుడి ఆశీర్వాదమేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆస్ట్రేలియాలో మే మాసంలో ఎన్నికలు జరగనుండగా.. ప్రధాని స్కాట్ మోరిసన్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం టౌన్ హాల్ డిబేట్‌లో ఆయన పాల్గొన్నారు. ఆటిజంతో బాధపడుతున్న ఓ బిడ్డ తల్లి.. అంగ వైకల్య బీమా పథకం గురించి స్కాట్ మోరిసన్‌తో పాటు ఆయన ప్రత్యర్థి ఆంథోనీ అల్బనీస్‌‌‌ను ప్రశ్నించారు. ఈ పథకం కింద దేశంలో ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులకు అందిస్తున్న సాయంలో కోత విధించడం పట్ల అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనికి సమాధానం చెప్పిన మోరిసన్.. దేవుడి ఆశీస్సులతో తనకు అంగ వైకల్యం లేని ఇద్దరు పిల్లలు కలిగారని పేర్కొన్నారు. అంగ వైకల్య బీమా పథకం తనకు అవసరం లేదని.. అయితే బాధితులకు అందిస్తున్న ప్రభుత్వ సాయంలో కోతపై బాధితుల తల్లిదండ్రుల అభ్యంతరాలను తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు.

అంగ వికలాంగ చిన్నారులపై ప్రధాని మోరిసన్ చేసిన వ్యాఖ్యలను ఆయన రాజకీయ ప్రత్యార్థులతో పాటు వికలాంగ హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. దేవుడి ఆశీస్సులు లేనందునే అంగ వైకల్యం కలిగిన పిల్లలు పట్టారన్నట్లు ప్రధాని స్కాట్ మోరిసన్ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అంగ వైకల్యం కలిగిన పిల్లలు జన్మించడం దేవుడి శాపమన్న ఆలోచన సరికాదని మండిపడ్డారు.  ప్రతి బిడ్డ దేవుడి ఆశీస్సేనని లేబర్ పార్టీ నాయకుడు బిల్ షార్టెన్ అభిప్రాయపడ్డారు. అంగ వైకల్య బీమా పథకం కింద అందజేసే సాయాన్ని మోరిసన్ ప్రభుత్వం తగ్గించడం సరికాదని.. దీన్ని లేటర్ పార్టీ అధికారంలోకి వస్తే పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. అంగ వైకల్యంతో జన్మించిన వారు సంపూర్ణంగా జీవించేందుకు NDIA (నేషనల్ డిసేబిలిటీ ఇన్సూరెన్స్ స్కీమ్) దోహదపడుతుందని చెప్పారు.

ఆటిజంతో బాధపడేవారు, వారి తల్లిదండ్రులను అవమానించేలా ప్రధాని మోరిసన్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆటిజం అవేర్‌నెస్ గ్రూప్ అభ్యంతరం వ్యక్తంచేసింది. మే ఎన్నికల్లో ఓటు వేసే ముందు వికలాంగులు, వారి కుటుంబాలు ప్రధాని చేసిన వ్యాఖ్యలను గుర్తుంచుకుంటాయని పేర్కొంది. అంగ వైకల్యం ఉన్న వ్యక్తులను ప్రధాని ఏ దృష్టితో చూస్తున్నారన్నది ఆయన మాటల ద్వారా తేటతెల్లం అవుతోందని మండిపడింది.

వికలాంగులు, వారి కుటుంబ సభ్యుల పట్ల సానుభూతి వ్యక్తం చేయడం వారికి ఒరిగేది ఏమీ ఉండదని ఆస్ట్రేలియన్ పారాలింపియన్ డైలాన్ ఆల్కాట్ అన్నారు. వికలాంగులకు సమానత్వం కల్పించడంతో పాటు సొంత జీవితాన్ని జీవించేందుకు వారికి స్వేచ్ఛను కల్పించాలని సూచించారు. తాను ప్రతి రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే అంగ వైకల్యంతో జన్మించడాన్ని దేవుడి ఆశీస్సుగానే భావిస్తుంటానని చెప్పారు. తన తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో చాలా సంతోషంగానే ఉన్నారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

తన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్.. ఈ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. అయితే తన వ్యాఖ్యలను ప్రతిపక్షం వక్రీకరించిందని మండిపడ్డారు. తాను కేవలం మంచి విశ్వాసంతో చెప్పడానికి ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. వికలాంగులు ఎదుర్కొంటున్న సవాళ్లను తాను గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. తన వ్యాఖ్యలు గాయపరిచినందుకు వికలాంగులు, వారి తల్లిదండ్రులను క్షమాపణ కోరుతున్నట్లు ప్రధాని మోరిసన్ పేర్కొన్నట్లు ది గార్డియన్ పత్రిక తెలిపింది.

Also Read..

ఎండాకాలంలో.. డయాబెటిస్‌ నియంత్రణకు ఇలాంటి ఆహారం తీసుకోండి

Mangoes: చేదెక్కుతున్న మధుర ఫలం.. ధరలోనే కాదు, రుచిలోనూ మోసమే