Paracetamol: జ్వరం తగ్గించే పారాసిటమాల్‌తో పాములు చంపుతున్న అమెరికా.. ఎందుకనేగా.?
Paracetamol: కాస్త జ్వరంగా అనిపించినా.. ఒంట్లో నలతగా ఉన్నా వెంటనే గుర్తొచ్చే పేరు పారాసిటమాల్. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత ఈ ట్యాబ్లెట్ పేరు మారుమోగుతోంది. పారాసిటమాల్ అమ్మకాలు భారీగా పెరిగాయి. అయితే మనం జ్వరాన్నితగ్గించుకోవడానికి...
Paracetamol: కాస్త జ్వరంగా అనిపించినా.. ఒంట్లో నలతగా ఉన్నా వెంటనే గుర్తొచ్చే పేరు పారాసిటమాల్. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత ఈ ట్యాబ్లెట్ పేరు మారుమోగుతోంది. పారాసిటమాల్ అమ్మకాలు భారీగా పెరిగాయి. అయితే మనం జ్వరాన్నితగ్గించుకోవడానికి ఉపయోగిస్తున్న ఈ ట్యాబ్లెట్‌తో అమెరికాలో పాములను చంపుతున్నారని మీకు తెలుసా.? పారాసిటమాల్‌తో పాములను చంపడం ఏంటి.? అసలు ఇదేలా సాధ్యమవుతుంది.? అనేగా మీ సందేహం అయితే ఈ వివరాల్లోకి వెళ్లాల్సిందే..
అమెరికాలోని గువామ్ అనే దీవిలో బ్రౌన్ ట్రీ స్నేక్స్ విపరీతంగా ఉంటాయి. ఇవి చెట్ల కొమ్మలపై జీవిస్తుంటాయి. అమెరికా ఇప్పుడు ఈ పాములనే చంపే పనిలో ఉంది. దీనికి కారణం ఈ బ్రౌన్ ట్రీ స్నేక్స్‌వల్ల చాలా జాతుల వన్యాప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. గువామ్ దీవిలో ఇప్పటికే 9 జాతుల పక్షులు అంతరించి పోయాయి. అంతేకాకుండా ఈ పాములు విద్యుత్ స్తంభాలు ఎక్కుతూ, విద్యుత్ తీగల్లో చిక్కుకుపోవడంతో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే అమెరికా ప్రభుత్వం ఈ పాములను చంపే నిర్ణయం తీసుకుంది.
పారాసిటమాల్‌తో పాములను ఎలా చంపుతున్నారంటే..?
బ్రౌన్ ట్రీ జాతికి చెందిన పాములను చంపేందుకు గాను ముందుగా చనిపోయిన ఎలుకలను సేకరిస్తున్నారు. అనంతరం వాటిలో 80 మిల్లీగ్రాముల చొప్పున పారాసిటమాల్‌ను ఎక్కించి, చనిపోయిన ఎలుకలను కార్డ్‌బోర్డ్ పారాచూట్‌లకు అతికించి హెలికాప్టర్ల ద్వారా అడవుల్లోకి వదిలేస్తున్నారు. దీంతో చెట్లపై పడిన ఆ ఎలుకలను తిన్న బ్రౌన్ ట్రీ స్నేక్స్ చనిపోతున్నాయి. మరి ఎలుకలను తిన్న పాములు మరణించాయా లేదా.? ఎలా తెలియాలి. ఇందుకోసం కూడా అధికారులు రేడియో ట్రాకర్లను అమర్చారు. ఇలా పాములను చంపేందుకు అమెరికా ప్రభుత్వం పెద్ద తతంగాన్నే నడిపిస్తోంది. ఇదిలా ఉంటే పాములను చంపడంపై వన్యప్రాణుల సంరక్షకులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.
Also Read: Corona In India: దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఓమిక్రాన్.. రోజుకింత ముదురుతున్న కరోనా..(వీడియో)