Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో దారుణం.. డబ్బులకోసం బాలికలను 70 ఏళ్ల వృద్ధులకిచ్చి వివాహం..
Afghanistan Crisis: తాలిబాన్ ఆక్రమిత ఆఫ్ఘనిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం ఎంతగా పెరిగిపోయిందంటే ప్రజలకు రెండు పూటలా తిండి కూడా దొరకడం లేదు. ప్రజలు ఆకలితో
Afghanistan Crisis: తాలిబాన్ ఆక్రమిత ఆఫ్ఘనిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం ఎంతగా పెరిగిపోయిందంటే ప్రజలకు రెండు పూటలా తిండి కూడా దొరకడం లేదు. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎంతలా అంటే తిండి కోసం చిన్నారులను వృద్ధులకు అమ్ముతున్నారు. దిక్కుతోచని పరిస్థితులలో కుటుంబాలను పోషించడానికి బాలికలను విక్రయిస్తున్నారు. ఓ అమెరికన్ వెబ్‌సైట్ ప్రకారం.. గత నెలలో 9 ఏళ్ల బాలికను 55 ఏళ్ల వ్యక్తికి విక్రయించారు. బాలిక కుటుంబం బగ్లాన్ ప్రావిన్స్‌లోని క్యాంపులో నివసిస్తోంది.
కుటుంబంలో ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక ఈ వ్యక్తులు ఇంటి ఖర్చులు భరించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ సంస్థ రాకతో దేశానికి విదేశీ సాయం ఆగిపోయింది. ఒక ఇంటర్వ్యూలో ఈ అమ్మాయి తండ్రి కొన్ని నెలల క్రితం తన 12 ఏళ్ల అమ్మాయిని విక్రయించాడని చెప్పాడు. ఇక ఇప్పుడు మరో 9 ఏళ్ల కూతురిని అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. కుటుంబ సభ్యులు బతకడం కోసం ఇలాంటి సిగ్గుమాలిన పని చేయక తప్పడం లేదని దుఖించాడు.
అమ్ముడుపోయిన బాలిక తాను చదివి ఉపాధ్యాయురాలిని కావాలని అనుకున్నానని కాని మా కుటుంబం తనను ఒక అమ్మేసిందని చెప్పింది. వృద్ధుడితో పెళ్లి గురించి బాలికను ప్రశ్నించగా.. చాలా భయపడ్డానని చెప్పింది. ఆ వ్యక్తి తనను కొట్టి, ఇంటి పనులు బలవంతంగా చేయిస్తున్నాడని ఏడుస్తూ చెప్పింది. ఈ బాలిక కోసం ఆ వృద్ధుడు కుటుంబానికి 2,200 డాలర్లు (దాదాపు రూ. 16 లక్షలు) గొర్రెలు, భూమి, నగదు రూపంలో ఇచ్చాడు. అనంతరం బాలికను తన వెంట తీసుకెళ్లాడు.
ఈ అమ్మాయిల అమ్మకపు కథ ఇక్కడితో అయిపోలేదు. పొరుగున ఉన్న ఘోర్ ప్రావిన్స్‌లో 10 ఏళ్ల బాలికను కూడా విక్రయించారు. డబ్బు కోసం కుటుంబసభ్యులు ఆమెకు 70 ఏళ్ల వృద్ధుడితో పెళ్లి చేశారు. ఈ అమ్మాయి తన కుటుంబం నుంచి దూరంగా వెళ్లడం ఇష్టం లేదని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. దేశంలోని అనేక ఇతర ప్రాంతాల నుంచి ఇలాంటి వార్తలు వస్తున్నాయి.