School Building Collapsed: తరగతులు జరుగుతుండగా హఠాత్తుగా కుప్పకూలిన స్కూల్ భవనం.. 22 మంది విద్యార్థులు మృతి!
నైజీరియాలో శుక్రవారం (జులై 12) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర మధ్య నైజీరియాలో హఠాత్తుగా రెండంతస్తుల పాఠశాల భవనం కుప్పకూలింది. తరగతులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 22 మంది విద్యార్థులు మృతి చెందగా, 100 మందికి పైగా విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ టీమ్, భద్రతా దళాలు సహాయక చర్యలు..
నైజీరియా, జులై 13: నైజీరియాలో శుక్రవారం (జులై 12) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర మధ్య నైజీరియాలో హఠాత్తుగా రెండంతస్తుల పాఠశాల భవనం కుప్పకూలింది. తరగతులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 22 మంది విద్యార్థులు మృతి చెందగా, 100 మందికి పైగా విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ టీమ్, భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టింది. బుసా బుజి కమ్యూనిటీలోని సెయింట్స్ అకాడమీ కాలేజీలో ఈ సంఘటన జరిగింది. స్కూల్ చదువుతున్న విద్యార్ధులంతా 15 యేళ్లకు తక్కువ వయసున్న వారిగా అధికారులు చెబుతున్నారు.
బుసా బుజి కమ్యూనిటీలోని సెయింట్స్ అకాడమీ కాలేజీలో తరగతులు ప్రారంభమైన కొద్దిసేపటికే పాఠశాల భవనం కుప్పకూలింది. శిథిలాల్లో మొత్తం 154 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. వారిలో 132 మందిని రక్షించినట్లు పోలీసు అధికార ప్రతినిధి ఆల్ఫ్రెడ్ అలబో తెలిపారు. గాయపడిన వారంత వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 22 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది. పాఠశాల భవనం కూలడంతో స్థానికులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులు రోధిస్తూ తమ పిల్లల కోసం శిథిలాల వద్దకు వెళ్లేందుకు యత్నించగా.. అధికారులు వారిని అడ్డుకున్నారు. రెస్క్యూ టీంఎక్స్‌కవేటర్‌ల సాయంతో శిధిలాల కింద చిక్కుకున్న విద్యార్ధులను రక్షించడంలో నిమగ్నమయ్యాయి.
నైజీరియా ప్రభుత్వం ప్రమాదంపై స్పందించింది. పాఠశాల నిర్మాణం బలహీనంగా ఉండడం, నది ఒడ్డున ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపింది. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను వెంటనే గుర్తించి, వాటిని మూసివేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన నైజీరియాలో భవనాలు కూలిపోవడం సర్వసాధారణమైపోయింది. గడచిన గత రెండేళ్లలో ఇటువంటి సంఘటనలు డజనుకు పైగా నమోదయ్యాయి. బిల్డింగ్ సేఫ్టీ నిబంధనలను అమలు చేయడంలో వైఫల్యం, పేలవమైన నిర్వహణ కారణంగా అక్కడ తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి.