Telangana: సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఎలుకల స్వైర విహారం.. 12 మంది బాలికలు అస్వస్థత
తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు సమస్యలకు నిలయంగా మారుతున్నాయి. నిన్నమొన్నటి వరకూ కలుషిత ఆహారాలకు పలువురు విద్యార్ధులు ఆస్పత్రి పాలవగా.. తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్‌లో ఎలుకల దాడిలో ఏకంగా 12 మంది విద్యార్థినులకు గాయాలయ్యాయి. బాలికల వసతి గృహాల్లో ఎలుకలు..
మెదక్, జులై 12: తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు సమస్యలకు నిలయంగా మారుతున్నాయి. నిన్నమొన్నటి వరకూ కలుషిత ఆహారాలకు పలువురు విద్యార్ధులు ఆస్పత్రి పాలవగా.. తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్‌లో ఎలుకల దాడిలో ఏకంగా 12 మంది విద్యార్థినులకు గాయాలయ్యాయి. బాలికల వసతి గృహాల్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి సమయాల్లో బాలికలు నిద్రించే సమయంలో ఎలుకలు దాడులకు దిగుతున్నాయి. ఈ క్రమంలో పలువురు విద్యార్ధులను ఎలుకలు కొరికాయి. దీంతో బాలికలు నిద్రపోవాలంటేనే హడలెత్తిపోతున్నారు.
ఈ ఘటనలో 12 మంది అమ్మాయిలను ఎలుకలు కొరకడంతో వారు అస్వస్థతకు గురయ్యారు. బాధిత విద్యార్థినులకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హాస్టల్ గదుల్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉందని, నిద్రిస్తున్న సమయంలో తమను కొరుకుతున్నాయని పలుమార్లు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదంటూ విద్యార్ధులు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గురువారం హాస్టల్‌కు చేరుకున్న బాలికల తల్లిదండ్రులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ప్రిన్సిపల్ కలుగజేసుకుని బాలికలకు ఇబ్బంది కలుగకుండా తగిన చర్యలు తీసుకుంటామని వారికి నచ్చజెప్పి పంపించారు.
ఇదిలా ఉంటే తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో కనీస వసతి సౌకర్యాలులేక విద్యార్ధులు తీవ్ర ఇబ్బంది పలుడుతున్నారు. ఇటీవల సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ హాస్టల్‌లో చట్నీలో చిట్టెలుక ఈత కొడుతూ కనిపించిన ఘటన చూసి విద్యార్థులు బెంబేలెత్తిపోయారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.