Viral: పెట్రోల్ కోసం బంక్‌లోకి వెళ్లగా.. అక్కడున్న బోర్డు చూసి జనాల మైండ్ బ్లాంక్!
ఐదొందలకు తక్కువైతే లేదు పొమ్మంటున్నారు. దాదాపు సగానికి పైగా పెట్రోల్ బంకుల్లో ఇదే పరిస్థితి...
నో డీజిల్, నో పెట్రోల్…! స్టాక్ లేదు క్షమించండి అంటూ ఎటుచూసినా ఆ బోర్డులే వెక్కిరిస్తున్నాయి. ఒకవేళ స్టాక్ ఉన్నా వందకో రెండొందలకో కొట్టరట. ఐదొందలకు తక్కువైతే లేదు పొమ్మంటున్నారు. దాదాపు సగానికి పైగా పెట్రోల్ బంకుల్లో ఇదే పరిస్థితి. మొన్నటిదాకా రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అల్లాడిన జనం ఇప్పుడు.. కొందామంటే కూడా చమురు దొరక్క ఇక్కట్ల పాలవుతున్నారు. అరకొరగా జరుగుతున్న ఆయిల్ సరఫరాతో కొన్నిచోట్ల బంకులన్నీ మూతబడుతున్నాయి. స్టాక్ ఉండే బంకుల కోసం వెతికివెతికి వేసారిపోతున్నారు వాహనదారులు.
ఇదేమంటే ఆయిల్ కార్పొరేషన్‌ని తప్పుబడుతున్నారు. వాళ్లు నిర్ణయించిన రేట్ కార్డే కొంప ముంచుతోందట. కొనుగోలు రేటు కంటే అమ్మకం రేటు తక్కువగా ఉన్నందున… సేల్స్ తాత్కాలికంగా నిలిపేస్తున్నాం అంటూ బోర్డులు వెలిశాయి. ఈ పరిస్థితుల్లో డీజిల్ అమ్మితే పాతిక రూపాయల దాకా మాకే నష్టం అంటున్నారు డీలర్లు. 500 కంటే తక్కువ మొత్తానికి డీజిల్ కొట్టే ప్రసక్తే లేదంటూ బోర్డులు పెట్టి మరీ భయపెడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో పడిపోయారు చిన్న వాహనదారులు.
మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పరిధిలోనూ నో డీజిల్, నో పెట్రోల్ అంటూ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. కీసర, ఘట్కేసర్ మండలాల్లో మొత్తం 39 పెట్రోల్ బంకులుంటే, వాటిలో 14 బంకులు మూతబడ్డాయి. వచ్చి చూసి… ఉస్సూరుమంటున్నారు వాహనదారులు. స్టాక్ లేదు… వారం రోజులవుతున్నా లోడ్ రాలేదనేది నిర్వాహకుల మాట. అలాగే ఖమ్మం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత… జనాన్ని తిక్క పట్టిస్తోంది. అరకొరగా జరుగుతున్న సప్లయ్‌తో రైతులు, వాహనదారులు పెట్రోలు బంకుల వద్ద బారులు తీరారు. వ్యవసాయ సీజన్ కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి.
ఆయిల్ కొనేటట్టు లేదు… బండి నడిపేట్టు లేదు… అశ్వారావుపేట, సత్తుపల్లి, ఇల్లందు, సుజాత నగర్, కూసుమంచి, పినపాక… ఎటుచూసినా ఇదే వరస. నష్టాల నుంచి తప్పించుకోవటానికి కొన్ని బంకులు అధికధరలకు విక్రయిస్తుంటే మరికొన్ని బంకులు విధిలేక స్వచ్ఛందంగా మూతబడుతున్నాయి. పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. నిజంగానే స్టాక్ లేదా… లేక ఉండీ లేదంటున్నారా… అసలీ ఆయిల్ కొరతకు కారణమేంటి…?