ఇదేందయ్యా ఇదీ.. పెళ్లి చేసుకోకపోతే రూ.29లక్షలు.. ఈ బంపర్ ఆఫర్ మామూలుగా లేదుగా..
ఏ పేరెంట్స్ అయినా పిల్లలకు పెళ్లి చేయాలని చూస్తారు. కానీ ఈ తల్లి మాత్రం అందుకు భిన్నం.. తన కూతుళ్లు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏకంగా రూ. 29 లక్షలు ఇస్తానని ఆఫర్ ఇచ్చింది. అసలు పెళ్లిళ్లపై ఈ తల్లికి ఎందుకంత కోపం..? తన సొంత జీవితంలో జరిగిన ఒక సంఘటన దీనికి కారణమా..? ఆమె ఆలోచన వెనుక ఉన్న ఆ రహస్యం ఏమిటి? అనేది తెలుసుకుందాం..

సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు మంచిగా పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలని అనుకుంటారు. కానీ విదేశాలకు చెందిన ఒక తల్లి మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించి, అందరి దృష్టిని ఆకర్షించింది. తన కూతుళ్లు పెళ్లి చేసుకోకపోతే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని ఆఫర్ ఇచ్చింది. కేట్ అనే నలుగురు పిల్లల తల్లి తన కూతుళ్లకు ఒక వింత ఆఫర్ ఇచ్చింది. అదేమిటంటే.. ఎవరైనా పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటే వారికి దాదాపు రూ. 29 లక్షలు ఇస్తానని చెప్పింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
వివాహానికి వ్యతిరేకం కాదు
తాను పెళ్లికి వ్యతిరేకం కాదని.. కానీ వివాహ వేడుకల్లో విపరీతంగా డబ్బు ఖర్చు చేసే సంస్కృతికి వ్యతిరేకమని కేట్ స్పష్టం చేసింది. “పెళ్లి పేరుతో అప్పులు చేసి జీవితం మొదలుపెట్టే ఇబ్బంది నా పిల్లలకు రాకూడదు. అందుకే వారు పెళ్లి చేసుకోకూడదనుకుంటే, వారికి ఈ చెక్ ఇస్తాను” అని ఆమె వివరించింది. కేట్ తన సొంత పెళ్లి చాలా ఘనంగా జరిగిందని తెలిపింది. అయితే ఆ ఖర్చుల కోసం తీసుకున్న అప్పును తీర్చడానికి ఆమె, ఆమె భర్త 5 ఏళ్లు కష్టపడాల్సి వచ్చిందట. అందుకే ఆమె ఇలా ఆలోచించింది. “నాకు మళ్లీ అవకాశం వస్తే, ఆ డబ్బును పెళ్లికి కాకుండా, ఇల్లు, హనీమూన్ లేదా రిటైర్మెంట్ కోసం దాచుకునేదాన్ని” అని కేట్ చెప్పింది.
ఈ రోజుల్లో పెద్ద పెద్ద పెళ్లిళ్లు కేవలం డబ్బు వృథా మాత్రమేనని కేట్ అభిప్రాయపడింది. అందుకే తన కూతుళ్లు ఆ ఆర్థిక భారం పడకుండా ఉండాలని, ఆ డబ్బును వారి భవిష్యత్తు కోసం వాడుకోవాలనే ఈ ఆఫర్ ఇచ్చింది. అయితే పెళ్లి చేసుకోవాలా వద్దా అనే తుది నిర్ణయం మాత్రం పూర్తిగా వారి కూతుళ్లదేనని, వారు ఘనంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటే తాను అన్ని ఖర్చులూ భరిస్తానని కూడా ఆమె హామీ ఇచ్చింది. పెళ్లి ఖర్చులకు బదులు భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టాలనే కేట్ ఆలోచనపై సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
